Let's talk: editor@tmv.in
ప్రధాని మోడీతో ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు భేటీ

ప్రధాని మోడీతో ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు భేటీ

Gaddamidi Naveen
4 ఆగస్టు, 2026

పల్నాడు జిల్లా నరసరావుపేట పార్లమెంట్ నియోజకవర్గ ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు సోమవారం న్యూఢిల్లీలో భారత ప్రధాని నరేంద్ర మోడీతో భేటీ అయ్యారు. తన నియోజకవర్గ పరిధిలోని ఆర్థిక పురోగతి, పరపతి అభివృద్ధి ఆధారిత పురోగతిని వివరిస్తూ రూపొందించిన "పల్నాడు: ఎ క్రానికల్ ఆఫ్ ఫైనాన్షియల్ ట్రాన్స్‌ఫార్మేషన్" నివేదికను ఆయన ప్రధానికి అందజేశారు. ఈ విషయాన్ని ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు తన అధికారిక 'ఎక్స్' ఖాతా ద్వారా వెల్లడించారు.

పల్నాడు ప్రాంతంలో నిరుపేదలు, మహిళలు, రైతులు, యవతకు బ్యాంకింగ్ సేవలను అందుబాటులోకి తెచ్చినట్లు తెలిపారు. ఇప్పటివరకు 1,03,246 మంది లబ్ధిదారులకు రూ. 3,216 కోట్ల సంస్థాగత రుణాలను అందించామని, అందులో 70,000 మందికి పైగా తొలిసారి రుణాలు పొందినవారేనని ప్రధానికి వివరించారు. పల్నాడు జిల్లాలోని వ్యవసాయ, పారిశ్రామిక సామర్థ్యాన్ని ప్రధానికి వివరించిన ఎంపీ, 'వికసిత్ భారత్' లక్ష్యానికి అనుగుణంగా జిల్లాను ఆర్థిక వృద్ధికి నమూనాగా తీర్చిదిద్దడమే తమ ధ్యేయమని పేర్కొన్నారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రైతాంగ సంక్షేమం, వ్యవసాయ అభివృద్ధికి అత్యంత కీలకమైన ప్రధాన సాగునీటి ప్రాజెక్టులను నిర్ణీత గడువులోగా పూర్తి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం తగిన మద్దతు అందించాలని ప్రధానిని కోరారు. పల్నాడు, ఆంధ్రప్రదేశ్ సమగ్ర అభివృద్ధికి ప్రధాని మోడీ చూపిన ఆప్యాయత, ఇచ్చిన మార్గదర్శకత్వానికి ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు తన కృతజ్ఞతలు తెలిపారు.