Let's talk: editor@tmv.in
ప్రధాని భారతమాతను అమెరికాకు అమ్మేశారు: రాహుల్‌గాంధీ

ప్రధాని భారతమాతను అమెరికాకు అమ్మేశారు: రాహుల్‌గాంధీ

Pinjari Chand
12 ఫిబ్రవరి, 2026

భారత్–అమెరికా మధ్యంతర వాణిజ్య ఒప్పందంపై లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ బుధవారం ఎన్డీయే ప్రభుత్వంపై, ముఖ్యంగా భారత ప్రధాని నరేంద్రమోడీపై విరుచుకుపడ్డారు. ఈ ఒప్పందం ద్వారా కేంద్ర ప్రభుత్వం ‘భారత్ మాతను అమ్మేసిందని’, ఇది పూర్తిగా లొంగుబాటు అని మండిపడ్డారు. దేశ ఇంధన భద్రతను అమెరికా చేతుల్లో పెట్టి, రైతుల ప్రయోజనాలను రాజీ చేశారని ఆరోపించారు. కేంద్ర బడ్జెట్‌పై చర్చలో పాల్గొన్న ఆయన, ప్రధాని నరేంద్ర మోడీపై నేరుగా విమర్శలు గుప్పించారు. ఏ భారత ప్రధానమంత్రి అయినా, మోడీ గారైనా, తనపై ఒత్తిడి లేకుండా ఇలాంటి ఒప్పందానికి అంగీకరించరని వ్యాఖ్యానించారు. మార్షల్ ఆర్ట్స్‌ను ఉదాహరణగా చూపుతూ, మొదట పట్టుదల, తర్వాత మెడపై బిగింపు… చివరికి లొంగిపోవడం జరుగుతుందంటూ ఉపమానం ఇచ్చారు.

ప్రపంచం ప్రస్తుతం గ్లోబల్ తుఫాన్‌ను ఎదుర్కొంటోందని ప్రభుత్వం స్వయంగా అంగీకరిస్తోందని పేర్కొన్నారు. ఏకైక సూపర్‌పవర్ యుగం ముగిసిందని, భౌగోళిక రాజకీయ ఘర్షణలు పెరుగుతున్నాయని, ఇంధనం–ఆర్థిక వ్యవస్థలు ఆయుధాలుగా మారుతున్నాయని ప్రభుత్వం చెబుతోందని గుర్తుచేశారు. అయినప్పటికీ, అమెరికా ఇంధన, ఆర్థిక వ్యవస్థలను భారత్‌పై ప్రభావం చూపేలా ఉపయోగించేందుకు ప్రభుత్వం అవకాశం కల్పించిందని ఆరోపించారు. ప్రపంచం యుద్ధ వాతావరణంలోకి జారుతోందని రాహుల్ పేర్కొన్నారు. ఉక్రెయిన్‌లో యుద్ధం నడుస్తోంది, గాజాలో ఘర్షణ వాతావరణం నెలకొని ఉంది, మధ్యప్రాచ్యంలో తీవ్ర ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి, ఇరాన్‌పై ముప్పు ఉంది. మనం కూడా ‘ఆపరేషన్ సిందూర్’ చేపట్టాం. ఇది ప్రమాదకర కాలమని అన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రజలు, వారి డేటా, ఆహార సరఫరా, ఇంధన వ్యవస్థలను కాపాడుకోవడం అత్యవసరమని నొక్కిచెప్పారు. బంగ్లాదేశ్ కూడా అమెరికన్ కాటన్ పై సుంకాలు ఎత్తివేసింది. ఇప్పుడు దాని ఫలితం అనుభవిస్తోంది.

మనం ఎవరితో వ్యాపారం చేయాలో కూడా అమెరికా నిర్ణయిస్తుంది

ఇండియా కూటమి ప్రభుత్వం అధికారంలో ఉండి ఉంటే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో సమాన భాగస్వామ్యంగా చర్చించేదని ఆయన అన్నారు. భారతీయ డేటానే అతిపెద్ద ఆస్తి. అమెరికా డాలర్‌ను రక్షించుకోవాలంటే భారత డేటా విలువను గుర్తించాలి. మాతో సేవకుల్లా కాకుండా సమానంగా మాట్లాడాలని పేర్కొన్నారు. ఇంధన భద్రతపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తూ ఇకపై మనం ఎవరితో చమురు కొనాలో అమెరికానే నిర్ణయిస్తుంది. వారు ఇష్టపడని దేశాల నుంచి కొనుగోలు చేస్తే 50 శాతం వరకు సుంకాలు విధిస్తారని ఆరోపించారు. అమెరికా ఏ దేశం నుంచి చమురు కొనొద్దని చెబితే, అది మన ఇంధన భద్రతపై బాహ్య నియంత్రణలా మారుతోంది. ఇంధనాన్ని మనపై ఆయుధంగా ఉపయోగిస్తున్నట్టే. ఇది మీకు సిగ్గుగా అనిపించడంలేదా?

సభలో అధికారపక్ష సభ్యులు ఆయన వ్యాఖ్యలను ‘నిరాధారాలు’గా కొట్టిపారేసి ధృవీకరణ కోరగా, తన ఆరోపణలకు ఆధారాలు సమర్పించేందుకు సిద్ధమని రాహుల్ తెలిపారు.

ఎఫ్ స్టీన్ ఫైల్స్ విషయంలో ప్రభుత్వం స్పందించడం లేదు

పార్లమెంట్ వెలుపల మీడియాతో మాట్లాడుతూ, అమెరికాలో విడుదలైన ‘ఎప్స్టీన్ ఫైల్స్’లో కేంద్ర మంత్రి హర్దీప్ పూరి, వ్యాపారవేత్త అనిల్ అంబానీ పేర్లు ఉన్నాయని పేర్కొన్నారు. ఎప్‌స్టీన్‌కు సంబంధించిన ఫైల్స్‌లో అనిల్ అంబానీ పేరు ఉన్నప్పటికీ ఆయన జైలులో ఎందుకు లేరని ప్రశ్నించారు. అమెరికా న్యాయశాఖ విడుదల చేసిన ఫైల్స్‌లో అంబానీ పేరు ఉందని ఆయన ఆరోపించారు అదానీపై అమెరికాలో కొనసాగుతున్న కేసులో సమన్లు జారీ అయినా, 18 నెలలుగా ప్రభుత్వం స్పందించలేదని విమర్శించారు. ఎప్‌స్టీన్ ఫైల్స్, అదానీ కేసు కారణంగా గానీ మోదీజీ అధికారం కాపాడుకోవడానికి జాతీయ ప్రయోజనాలను తాకట్టుపెట్టారని రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు. అయితే, ట్రెజరీ బెంచీల సభ్యులు ఆయన ఆరోపణలను ‘బేస్‌లెస్’గా కొట్టిపారేస్తూ, వాటికి ఆధారాలు చూపించాలని డిమాండ్ చేశారు. దీనికి స్పందించిన రాహుల్, తన వ్యాఖ్యలకు ఆధారాలు సమర్పించేందుకు సిద్ధమని తెలిపారు. సభకు అధ్యక్షత వహిస్తున్న జగదంబికా పాల్ జోక్యం చేసుకుని, హౌస్ సభ్యులు కాని వ్యక్తుల పేర్లు ప్రస్తావించవద్దని రాహుల్‌ను కోరారు. ఈ వ్యాఖ్యలతో లోక్‌సభలో తీవ్ర వాగ్వాదం నెలకొంది. అధికార, ప్రతిపక్షాల మధ్య ఆరోపణలు–ప్రత్యారోపణలు సాగడంతో సభలో ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది.

సుంకాల విషయంలో అసమానత

‘ఎక్స్’ వేదికగా చేసిన పోస్టులో, భారత్–అమెరికా వాణిజ్య ఒప్పందం 140 కోట్ల భారతీయుల భవిష్యత్తును తాకట్టు పెట్టింది. యువత ఉద్యోగాలు ప్రమాదంలో ఉన్నాయి. రైతుల పంటలు చర్చల బల్లపై ఉన్నాయి. ఇంధన భద్రత విదేశీ నిబంధనలకు లొంగిపోతోందని రాశారు. డిజిటల్ వాణిజ్య అంశాలపై కూడా ప్రభుత్వం వెనక్కి తగ్గిందని ఆయన ఆరోపించారు. డేటా లోకలైజేషన్ తొలగింపు, డేటా స్వేచ్ఛా ప్రవాహం, డిజిటల్ పన్ను పరిమితి, సోర్స్ కోడ్ వెల్లడింపు మినహాయింపులు, పెద్ద టెక్ కంపెనీలకు 20 ఏళ్ల పన్ను రాయితీలు వంటి నిర్ణయాలను విమర్శించారు. సుంకాల విషయంలో అసమానత ఉందని పేర్కొంటూ మన సగటు సుంకాలు 3 శాతం నుంచి 18 శాతానికి పెరిగాయి. అమెరికా సుంకాలు 16 నుంచి సున్నాకి తగ్గాయి. అమెరికా దిగుమతులు 46 బిలియన్ డాలర్ల నుంచి 146 బిలియన్ డాలర్లకు పెరుగుతాయి. ఇది అసంబద్ధమని అన్నారు. రైతుల పరిస్థితిపై ఆందోళన వ్యక్తం చేస్తూ ‘వేల ఎకరాల యాంత్రిక అమెరికన్ వ్యవసాయానికి తలుపులు తెరిచి, మన చిన్న రైతులను అణగదొక్కుతున్నారు. ఇది అవమానకరం. ఇంతకు ముందు ఎవరూ ఇలా చేయలేదు. ఇకపై ఎవరూ చేయరని రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు.