Let's talk: editor@tmv.in
ప్రధాని బీహార్ ను అవమానించేలా మాట్లాడారు:తేజస్వీ యాదవ్

ప్రధాని బీహార్ ను అవమానించేలా మాట్లాడారు:తేజస్వీ యాదవ్

Pinjari Chand
26 అక్టోబర్, 2025

అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సమస్తీపూర్‌‌ సభలో చేసిన వ్యాఖ్యలపై రాష్ట్ర రాజకీయాల్లో దుమారం చెలరేగింది.మహాఘట్భంధన్ ముఖ్యమంత్రి అభ్యర్థి, ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ శనివారం తీవ్ర విమర్శలు గుప్పించారు. తేజస్వీ మాట్లాడుతూ ప్రధానమంత్రి బీహార్ పట్ల చెప్పిన ప్రతి మాట, ప్రతి వాక్యం బీహార్‌ను అవమానించేలా ఉంది. ఆయన ఏ ఒక్క సానుకూల మాట కూడా చెప్పలేదు. 11 ఏళ్లుగా మీరు ప్రధానమంత్రిగా ఉన్నారు. కానీ బీహార్‌కు మీరు ఇచ్చింది ఏమిటి? అని ప్రశ్నించారు.

తేజస్వీ ఇంకా ఇలా మాట్లాడుతూ మీరు గుజరాత్‌లో ఫ్యాక్టరీలు ఏర్పాటు చేసుకున్నారు.కానీ బీహార్‌లో గెలవాలని కోరుకుంటున్నారు. అది ఎప్పటికీ జరగదు. బీహార్ అన్ని విధాలుగా గుజరాత్ కంటే పెద్దది. దేశంలోని ప్రతి పదవ వ్యక్తి బీహార్‌కు చెందినవారే. ప్రధానమంత్రి బీహార్‌ను మోసం చేయడానికి మాత్రమే పనిచేశారు. గుజరాత్‌కు ఆయన ఏమి ఇచ్చినా, అందులో ఒకశాతం కూడా బీహార్‌కు ఇవ్వలేదు. బీహార్ ప్రజలు ప్రతిదానికీ జవాబుదారీతనం కోరుతున్నారు. ప్రధాని వద్ద సమాధానాలు లేవు అని విమర్శించారు.

వీఐపీ చీఫ్ ముఖేష్ సహానీని ఉప ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించినప్పటి నుంచి నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ (ఎన్డీయే) మహాఘట్బంధన్‌ను ఎగతాళి చేస్తోందని తేజస్వీ ఆరోపించారు. మేము చాలా వెనుకబడిన వర్గానికి చెందిన నాయకుడిని ఉప ముఖ్యమంత్రిగా పేరును ప్రకటించినప్పటి నుంచి ఎన్డీయే నాయకులు ట్రోలింగ్ ప్రారంభించారు. అంటే బీజేపీ నాయకులు వెనుకబడిన వర్గాలను ద్వేషించడం మొదలు పెట్టారని ఆయన ఆరోపించారు. తేజస్వీ మాట్లాడుతూ ఈ సారి ప్రజల ఆలోచన విధానం స్పష్టంగా మారింది. బీహార్‌లో మార్పు తథ్యం. అవినీతి ప్రభుత్వానికి బీహార్ ప్రజలు గుణపాఠం చెబుతారు. ఈసారి వాతావరణం మొత్తం మహాఘట్బంధన్‌కు అనుకూలంగా ఉంది అని అన్నారు.

సమస్తీపూర్‌లో జరిగిన సభలో ప్రధాని మోదీ చేసిన ప్రసంగంలో ఆయన ఆర్జేడీపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఆర్జేడీ పాలనలో బీహార్‌లో నేరాలు, కిడ్నాప్‌లు, వసూళ్లు, హత్యలు విపరీతంగా పెరిగాయి. ఆ జంగిల్ రాజ్ కారణంగా బీహార్ అనేక తరాలుగా నష్టపోయింది. ఆ సమయంలో పోలీసులు వెనుకబడిన వర్గాల సమస్యలను వినేవారు కాదని అన్నారు.

బీహార్ అసెంబ్లీ ఎన్నికలు నవంబర్ 6, 11 తేదీల్లో రెండు దశల్లో జరగనున్నాయి. ఫలితాలు నవంబర్ 14న వెలువడతాయి.