Let's talk: editor@tmv.in
ప్రధాని ప్రసంగించకపోవడానికి ప్రతిపక్షమే కారణం: కిరెన్‌ రిజిజు

ప్రధాని ప్రసంగించకపోవడానికి ప్రతిపక్షమే కారణం: కిరెన్‌ రిజిజు

Pinjari Chand
8 ఫిబ్రవరి, 2026

రాష్ట్రపతి ప్రసంగానికి కృతజ్ఞతల తీర్మానంపై జరిగిన చర్చకు లోక్‌సభలో ప్రధాని నరేంద్ర మోడీ సమాధానం ఇవ్వకపోవడానికి ప్రతిపక్షమే పూర్తిగా బాధ్యత వహించాలని కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరెన్‌ రిజిజు శనివారం స్పష్టం చేశారు. లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లా చాంబర్‌లోకి ప్రధాని ప్రసంగానికి ముందు 40 నుంచి 50 మంది ప్రతిపక్ష ఎంపీలు చొరబడి, అనుచితంగా మాట్లాడారని, ఆ పరిస్థితుల్లో ప్రధాని సభకు రాకపోవడమే మంచిదని తాము నిర్ణయించుకున్నామని ఆయన తెలిపారు. పాట్నాలోని బీజేపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రిజిజు మాట్లాడుతూ, మాజీ సైన్యాధిపతి ఎం.ఎం. నరవణే రచించిన పుస్తకంలో చైనా సైన్యంతో జరిగిన ఘర్షణలపై వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ, లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీ చేసిన ఆరోపణలను ఎదుర్కొనేందుకే ప్రధాని సభకు రాలేదని ప్రతిపక్షం చేస్తున్న ఆరోపణలకు స్పందించారు.

మేమెవరికీ భయపడటం లేదు. మేము అధికారంలో ఉన్నాం. కావాలంటే సభలో మార్షల్స్‌ను పిలిపించి ప్రతిపక్షాన్ని నియంత్రించవచ్చు. కానీ మేం అలాంటి ప్రజాస్వామ్య విరుద్ధ చర్యలను నమ్మం. అందుకే మొదట ప్రతిపక్షాన్ని చర్చల టేబుల్‌కు తీసుకురావాలని ప్రయత్నించామని రిజిజు తెలిపారు.

అయితే 40–50 మంది ప్రతిపక్ష ఎంపీలు స్పీకర్‌ ఓం బిర్లా చాంబర్‌లోకి దూసుకెళ్లి అడ్డగోలుగా (అనప్‌ షనప్‌) మాట్లాడిన తర్వాత పరిస్థితి మారిపోయింది. వారు గొడవకు సిద్ధంగా ఉన్నారని అర్థమైంది. అందుకే ప్రధాని సభకు రాకపోవడమే మంచిదని భావించామని ఆయన అన్నారు. ఈ కారణంగానే రాజ్యసభలో సుదీర్ఘంగా ప్రసంగించిన ప్రధాని మోడీ, తమ సూచన మేరకు లోక్‌సభలో చర్చకు హాజరుకాలేదని రిజిజు వివరించారు. అయితే సంఖ్యాబలం తమవద్ద ఉండటంతో, లోక్‌సభలో కృతజ్ఞతల తీర్మానం మూజువాణి ఓటుతో ఆమోదం పొందిందని చెప్పారు. ఇదివరకు పాట్నా విమానాశ్రయంలో విలేకరులతో మాట్లాడిన రిజిజు ప్రధాని మోడీపై తన విమర్శలతో ఆయన పార్లమెంట్‌ నుంచి పారిపోయారని, దేశం నుంచే పారిపోయేలా చేస్తామని రాహుల్‌ గాంధీ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. హెడ్లైన్లలో నిలవాలనే ఉద్దేశంతో రాహుల్‌ గాంధీ అర్థంలేని వ్యాఖ్యలు చేస్తున్నారు. ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలో దేశం అపారమైన ప్రగతి సాధించింది. 60 ఏళ్ల పాటు అధికారంలో ఉండి దేశాన్ని బలహీనపరిచిన కాంగ్రెస్‌పై ఇక ప్రజలు మళ్లీ విశ్వాసం ఉంచరని రిజిజు విమర్శించారు.

బీహార్‌ అసెంబ్లీ ప్రాంగణంలో జరిగిన ఒక కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం నిర్వహించిన విలేకరుల సమావేశంలో రిజిజు మాట్లాడుతూ, మోడీ మూడవ పదవీకాలంలో ఆర్థిక సంస్కరణలు మరింత వేగంగా అమలవుతాయని చెప్పారు. మేం దీనిని ‘రిఫార్మ్స్‌ ఎక్స్‌ప్రెస్‌’గా పిలుస్తున్నాం. ఇది ఆగదు. 2047 నాటికి ‘వికసిత్‌ భారత్‌’ లక్ష్యాన్ని సాధించే దిశగా వేగంగా దూసుకెళ్తుంది. ఇటీవల ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో ముఖ్యంగా బీహార్‌ వంటి రాష్ట్రాలకు ఎంతో ప్రయోజనం ఉంది. ఇక్కడ మౌలిక వసతులు అభివృద్ధి చెందాయి, ఉద్యోగ విపణిలోకి అడుగుపెట్టేందుకు సిద్ధంగా ఉన్న భారీ యువత ఉందని తెలిపారు.

కేంద్ర ప్రభుత్వం బీహార్‌కు ప్రత్యేక ఆర్థిక ప్యాకేజీ ప్రకటించకపోవడం ద్వారా అన్యాయం చేస్తోందన్న ప్రతిపక్ష ఆరోపణలను కూడా రిజిజు తోసిపుచ్చారు. ప్యాకేజీలు అనేవి వాస్తవానికి టోకెనిజం మాత్రమే. అందించడానికి ఏమీ లేనప్పుడు ప్రభుత్వాలు అలాంటి మాటలు చెబుతాయి. మేం బీహార్‌ అవసరాలను నేరుగా పరిష్కరిస్తున్నాం. కాంగ్రెస్‌, అరవింద్‌ కేజ్రీవాల్‌ ప్రోత్సహించే ఉచితాల సంస్కృతికి మా పాలన భిన్నమైనది. కోవిడ్‌ సమయంలో మాత్రమే ఉచిత రేషన్‌ ఇచ్చాం, అప్పట్లో సాధారణ జీవితం పూర్తిగా నిలిచిపోయిందని అన్నారు.

ప్రధాని ప్రసంగించకపోవడానికి ప్రతిపక్షమే కారణం: కిరెన్‌ రిజిజు - Tholi Paluku