Let's talk: editor@tmv.in
ప్రధాని నియంత్రణ కోల్పోయారు: సంజయ్‌రౌత్‌

ప్రధాని నియంత్రణ కోల్పోయారు: సంజయ్‌రౌత్‌

Pinjari Chand
25 మార్చి, 2026

పశ్చిమాసియా ఘర్షణపై లోక్‌సభలో ప్రధాని ప్రసంగం నేపథ్యంలో శివసేన (యూబీటీ) నేత సంజయ్‌రౌత్‌ మంగళవారం తీవ్ర విమర్శలు చేశారు. ప్రధాని నరేంద్రమోడీ యుద్ధం ప్రారంభమైన 25 రోజుల తర్వాత సభకు వచ్చారని, ఆయన మాట్లాడే తీరు, బాడీ లాంగ్వేజ్ చూస్తే నియంత్రణ కోల్పోయినట్లు, నిరుత్సాహంగా కనిపించారని వ్యాఖ్యానించారు. యుద్ధం ప్రారంభమైన 25 రోజుల తర్వాత మోడీ జీ సభకు వచ్చారు. ఆయన మాట్లాడే తీరు, ప్రవర్తన చూస్తే ఆయన డిప్రెషన్‌లో ఉన్నట్లు అనిపించింది. నియంత్రణ కోల్పోయారు. ఎక్కువ కాలం అధికారంలో ఉండాలనే మనస్థత్వం కనిపించడం లేదు. ఆయన స్వయంగా తప్పుకునే అవకాశం ఉందని రౌత్ జోస్యం చెప్పారు.

లోక్‌సభలో ప్రధాని చేసిన 25 నిమిషాల ప్రసంగంపై రాహుల్‌గాంధీ చేసిన వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ, ఇంత తీవ్రమైన పరిస్థితిపై ప్రజలకు స్పష్టత ఇవ్వాలంటే సభలో పూర్తి స్థాయి చర్చ జరగాలని రౌత్ పేర్కొన్నారు. ప్రపంచం, దేశం ముందున్న ఇంత పెద్ద సమస్యపై చర్చ అవసరం. కరోనా సమయంలో ఉన్న పరిస్థితులు మళ్లీ రావచ్చని మీరు చెబుతున్నారు. ఇలాంటి పరిస్థితిలో ప్రజలకు స్పష్టత ఇవ్వాలంటే చర్చ జరగాలని ఆయన అన్నారు.

ఇదిలా ఉండగా, పశ్చిమాసియా పరిస్థితిపై ప్రధాని వ్యవహారంపై రాహుల్ గాంధీ కూడా విమర్శలు చేశారు. ఆయన ప్రసంగంలో అమెరికా పేరు ప్రస్తావించలేదని, అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ ప్రభావంలో ఉన్నారని ఆరోపించారు. పార్లమెంట్‌లో చర్చకు ప్రధాని సిద్ధంగా ఉండరని కూడా వ్యాఖ్యానించారు. సోమవారం లోక్‌సభలో ప్రసంగించిన ప్రధాని పశ్చిమాసియా ఘర్షణను ‘ఆందోళనకరమైనది’గా అభివర్ణించారు. ఈ ఘర్షణ భారత్‌పై ఆర్థిక, భద్రతా, మానవతా పరమైన ప్రభావాలు చూపే అవకాశముందని తెలిపారు. ముఖ్యంగా క్రూడ్ ఆయిల్, గ్యాస్ సరఫరాలపై ప్రభావం ఉంటుందని పేర్కొన్నారు. ఉద్రిక్తతలు తగ్గించాలని అన్ని పక్షాలను కోరుతున్నామని, పౌరులపై దాడులు, వాణిజ్య నౌకలపై దాడులు, అలాగే హర్ముజ్‌ వంటి కీలక సముద్ర మార్గాల నిరోధాన్ని భారత్ ఖండిస్తున్నట్లు ప్రధాని స్పష్టం చేశారు.