Let's talk: editor@tmv.in
ప్రధాని దేశాన్ని అమ్మేశారు: రాహుల్ గాంధీ

ప్రధాని దేశాన్ని అమ్మేశారు: రాహుల్ గాంధీ

Pinjari Chand
4 ఫిబ్రవరి, 2026

భారత్–అమెరికా వాణిజ్య ఒప్పందం నేపథ్యంలో లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీపై తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ ఒప్పందంలో ప్రధాని కాంప్రమైజ్ అయ్యారని, ఈ ఒప్పందం ద్వారా భారత రైతుల రక్తం, చెమటను, దేశాన్ని అమ్మేశారని ఆయన వ్యాఖ్యానించారు. పార్లమెంటు వెలుపల మీడియాతో మాట్లాడిన రాహుల్ గాంధీ, కొన్ని నెలలుగా నిలిచిపోయిన వాణిజ్య ఒప్పందాన్ని తీవ్ర ఒత్తిడుల మధ్య ప్రధాని మోడీ సంతకం చేశారని అన్నారు. మోదీజీ భయపడిపోయారు. ఆయన ఇమేజ్ దెబ్బతింటుందనే భయంతో ఈ ఒప్పందానికి ఒప్పుకున్నారు. అసలు విషయం ఏమిటంటే ప్రధాని కాంప్రమైజ్ అయ్యారని వ్యాఖ్యానించారు.

ఈ ఒప్పందంలో ప్రజల కష్టార్జితాన్ని అమ్మేశారని ఆరోపించిన రాహుల్ గాంధీ, దేశాన్ని అమ్మేశారు. ప్రధాని ఇమేజ్‌ను నిర్మించినవారే ఇప్పుడు ఆ ఇమేజ్‌ను కూల్చుతున్నారని అన్నారు. ప్రధాని ఎందుకు కాంప్రమైజ్ అయ్యారని నమ్ముతున్నారని ప్రశ్నించగా, గౌతమ్ అదానీపై అమెరికాలో ఉన్న కేసు, అలాగే ఎప్‌స్టీన్ ఫైల్స్‌ను రాహుల్ గాంధీ ప్రస్తావించారు. అదానీపై ఉన్న కేసు నిజానికి మోదీజీపైనే కేసు. ఎప్‌స్టీన్ ఫైల్స్‌లో ఇంకా చాలా విషయాలు బయటకు రావాల్సి ఉన్నాయి. ఇవే ప్రధాన ఒత్తిడి పాయింట్లు అని చెప్పారు. ఇదే సమయంలో, మాజీ సైన్యాధిపతి జనరల్ ఎం.ఎం. నరవణే అప్రచురిత మెమోయిర్‌కు సంబంధించిన అంశంపై రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు సభలో తీవ్ర వాగ్వాదానికి దారితీశాయి. ట్రెజరీ బెంచ్, ఇండియా బ్లాక్ ఎంపీల మధ్య ఉద్రిక్తత నెలకొనడంతో సభను వాయిదా వేశారు.

అమెరికా ముందు ప్రధాని మోడీ పూర్తిగా లొంగిపోయారు

భారతదేశం-అమెరికా వాణిజ్య ఒప్పందం పై కాంగ్రెస్ పార్టీ తీవ్ర విమర్శలు వ్యక్తం చేసింది. ప్రధాని నరేంద్ర మోడీ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను ప్రసన్నం చేసుకోవడానికి ‘ప్రధాని పూర్తిగా లొంగిపోయారు’ అని, భారత రైతుల ప్రయోజనాలను పణంగా పెట్టారని ఆరోపించింది. ఫిబ్రవరి 2, 2026న (భారత కాలమానం ప్రకారం ) ట్రంప్ సోషల్ మీడియాలో ఈ ఒప్పందం ప్రకటించారు. భారత ఎగుమతులపై అమెరికా రిక్రోకల్ టారిఫ్‌లను 25శాతం నుంచి 18శాతానికి తగ్గిస్తామని, భారతదేశం రష్యా నుంచి చమురు కొనుగోలు ఆపి అమెరికా, వెనిజులా నుంచి ఎక్కువ కొనుగోలు చేస్తుందని, అమెరికా వస్తువులకు భారతదేశం టారిఫ్‌లు, నాన్-టారిఫ్ బ్యారియర్లను జీరోకి తగ్గిస్తుందని, 500 బిలియన్ల విలువైన అమెరికా వస్తువులు (వ్యవసాయ ఉత్పత్తులు సహా) కొనుగోలు చేస్తుందని ట్రంప్ పేర్కొన్నారు. రష్యా చమురు కొనుగోలు కారణంగా విధించిన అదనపు 25శాతం టారిఫ్‌ను కూడా ఉపసంహరిస్తామని తెలిపారు.

ప్రధాని మోదీ ఎక్స్ లో స్పందిస్తూ, భారత ఉత్పత్తులకు 18శాతం టారిఫ్ తగ్గడం సంతోషకరమని, రెండు దేశాల భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేస్తుందని అన్నారు. అయితే, ట్రంప్ చెప్పిన షరతులు (రష్యా చమురు ఆపడం, వ్యవసాయ దిగుమతులు తెరవడం వంటివి) గురించి భారత ప్రభుత్వం నుంచి స్పష్టమైన వివరాలు ఇంకా రాలేదు.

దేశ ప్రకటనలు అమెరికా నుంచి

కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ (కమ్యూనికేషన్స్) జైరాం రమేష్ తీవ్రంగా విమర్శించారు. ట్రంప్ ప్రకటనలు వాషింగ్టన్ నుంచి వస్తున్నాయని, భారతదేశం తన ప్రభుత్వ చర్యల గురించి ట్రంప్ నుంచే తెలుసుకుంటోందని ఆక్షేపించారు. ‘హగ్లోమసీ(ఆలింగనం / కౌగిలించుకోవడం)’ అని మోడీ డిప్లొమసీని ఎగతాళి చేశారు. మే 10, 2025న ఆపరేషన్ సిందూర్ (భారత్-పాకిస్తాన్ ఘర్షణ సందర్భంగా) ఆపివేయడం ట్రంప్ ప్రకటించినట్లే, ఇప్పుడు కూడా మోడీ పూర్తిగా లొంగిపోయారని ఆరోపించారు. పార్లమెంట్ సమావేశంలో ఉండగా, యూఎస్, ఈయూ వాణిజ్య ఒప్పందాల పూర్తి వివరాలు (టెక్స్ట్) రెండు సభల్లో ఉంచి చర్చించాలని డిమాండ్ చేశారు. అమెరికా వ్యవసాయ కార్యదర్శి బ్రూక్ రోలిన్స్ భారత మార్కెట్ అమెరికన్ రైతులకు తెరిచారని చెప్పడం ప్రస్తావిస్తూ, భారత రైతుల ప్రయోజనాలు దెబ్బతినవచ్చని ఆందోళన వ్యక్తం చేశారు.

పార్లమెంట్ చర్చ జరగాలి

కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ మాట్లాడుతూ ఒప్పందం వివరాలు స్పష్టంగా తెలియాలని, అమెరికా వ్యవసాయ ఉత్పత్తుల దిగుమతులు భారత రైతులకు రాజకీయ చిక్కులు తెస్తాయని అన్నారు. పార్లమెంటులో చర్చ జరగాలని, ప్రభుత్వం సమాధానాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. రాజ్యసభలో పలువురు ప్రతిపక్ష ఎంపీలు (జైరాం రమేష్, దిగ్విజయ సింగ్, రణదీప్ సుర్జేవాలా, సంజయ్ సింగ్, మనోజ్ ఝా తదితరులు) నిరసన వ్యక్తం చేసి వాకౌట్ చేశారు. రైతుల ప్రయోజనాలు దెబ్బతిన్నాయని ఆరోపించారు. మాజీ మంత్రి ఆనంద్ శర్మ ఒప్పందం సార్వభౌమ సమానత్వంతో ఉండాలని, వ్యవసాయం, పాడి, ఫార్మా రంగాల్లో భారత ప్రయోజనాలు కాపాడాలని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ ఒప్పందం భారత్-యూరోపియన్ యూనియన్ ఎఫ్టీఏ (జనవరి 27, 2026న ప్రకటించింది) తర్వాత వచ్చింది. అయితే, వివరాలు స్పష్టంగా లేకపోవడం, రష్యా చమురు ఆపడం వంటి షరతులు భారత వ్యూహాత్మక స్వాతంత్ర్యాన్ని ప్రభావితం చేస్తాయని విమర్శించారు.