Let's talk: editor@tmv.in
ప్రధాని దిగజారి మాట్లాడుతున్నారు: తేజస్వీ యాదవ్

ప్రధాని దిగజారి మాట్లాడుతున్నారు: తేజస్వీ యాదవ్

Pinjari Chand
4 నవంబర్, 2025

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ‘కట్టా’ వ్యాఖ్యలపై ఆర్జేడీ నేత, మహాఘట్భంధన్ ముఖ్యమంత్రి అభ్యర్థి తేజస్వీ యాదవ్ తీవ్రంగా స్పందించారు. ఇంత తక్కువస్థాయి భాషను ఉపయోగించే ప్రధానిని ఇప్పటివరకు చూడలేదని ఆయన విమర్శించారు. గుజరాత్‌లోకి వెళ్లినప్పుడు మోడీ పరిశ్రమల గురించి మాట్లాడతారని,సెమీ కండక్టర్, ఐటీ,డేటా సెంటర్ గురించి మాట్లాడతారు. కానీ బీహార్‌లోకి వచ్చాక తుపాకుల గురించే చెబుతున్నారని వ్యాఖ్యానించారు. ఇది ఏ రకమైన భాష? ప్రధాని అయితే ప్రజలకు ఉపయోగపడే విషయాలు చెప్పాలి. తను చేసిన పనులను వివరించాలి. కానీ ఆయన్నుంచి అలాంటి మాటలు వినిపించడం లేదు అని తేజస్వీ ఎద్దేవా చేశారు. ఎవరికీ ఏ ఆలోచన ఉంటే అదే మాట్లాడతారు.

బీహార్ ముఖ్యమంత్రి నితీశ్‌కుమార్ మోదీ రోడ్‌షోకు హాజరు కాలేదన్న ప్రశ్నకు కూడా తేజస్వీ పెద్దగా ఆశ్చర్యం వ్యక్తం చేయలేదు. బీజేపీ నితీశ్‌కుమార్‌ను తిరిగి ముఖ్యమంత్రి చేయదన్నది అందరికీ తెలుసు అని ఆయన అన్నారు. గతంలో మోదీ బీహార్‌లో మహాఘట్భంధన్ పై దాడి చేస్తూ ఆర్జేడీ–కాంగ్రెస్ పాలనను ‘కట్టా’ క్రూరత, కటుత్వ, కుశాసనం, అవినీతి’గా అభివర్ణించారు. ‘కట్టా’ అంటే చట్టం కూలిపోయే స్థితి, దౌర్జన్యం రాజ్యమేలే ప్రదేశమని ప్రధాని వివరణ ఇచ్చారు.

అవమానాల మంత్రిత్వ శాఖ తెరవాలి: ప్రియాంక గాంధీ

అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో బీహార్‌లోని సోన్‌బార్సాలో సోమవారం జరిగిన బహిరంగ సభలో కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ వాద్రా బీజేపీ పై విరుచుకుపడ్డారు. ఒక ర్యాలీలో ఆమె ప్రసంగిస్తూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వాస్తవ సమస్యలను దాచిపెట్టి ప్రజల దృష్టిని మళ్లీస్తున్నారని, వాద్రా కుటుంబం ప్రధానిని ఎన్నిసార్లు అగౌరవపరిచిందో రికార్డు చేయడానికి "అవమానాల మంత్రిత్వ శాఖ"ను సృష్టించాలని ప్రధానమంత్రికి సూచించారు.

వారు ఎల్లప్పుడూ గత చరిత్ర గురించి మాట్లాడుతారు. ప్రతిపక్షం బీహార్ ప్రజలను అగౌరవపరుస్తుందని ఆరోపిస్తూ ప్రజలను దృష్టి మరల్చడానికి ప్రయత్నం చేస్తారని ఆమె అన్నారు. ఆయన కర్ణాటకకు వెళ్ళినప్పుడు ప్రతిపక్షం కర్ణాటక ప్రజలను అగౌరవపరిచిందని అన్నారు. పశ్చిమ బెంగాల్‌లో కూడా ఇలాంటిదే జరిగింది. ఆయన బీహార్‌కు వచ్చినప్పుడు, మొత్తం ప్రతిపక్షం రాష్ట్ర ప్రజలను అగౌరవపరిచిందని అన్నారు. ప్రధాని మోడీ తనను ఎన్నిసార్లు అవమానించారో రికార్డు చేయడానికి ‘అవమానాల మంత్రిత్వ శాఖ’ని ఏర్పాటు చేయాలని ప్రియాంక గాంధీ సూచించారు. కాంగ్రెస్ పార్టీపై తప్పుడు ఆరోపణలు చేయడం మాని, ఉద్యోగాలు కల్పించడం, అభివృద్ధిని ప్రోత్సహించడం, పెద్ద పరిశ్రమలను స్థాపించడం కోసం ఆయన సమయాన్ని కేటాయించాలని ఆమె గుర్తు చేశారు.

మోడీ తన కుటుంబంపై చేసిన విమర్శలపై ఆమె స్పందిస్తూ నా కుటుంబం ఆయనను ఎప్పుడు అవమానించిందో అన్నదానిపై ప్రత్యేక లైబ్రరీ కూడా ఏర్పాటు చేసుకోవచ్చు. పుస్తకాలతో నింపుకోవచ్చు అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. మహిళల పరిస్థితిపై మాట్లాడుతూ 20 ఏళ్లలో బీజేపీ చేసిన పనిని ఆమె విమర్శించారు. నా చెల్లెళ్లందరూ ఇక్కడే ఉన్నారు. మీరు పొలాల్లో పని చేస్తారు. ఇంటికి తిరిగి వస్తారు, ఇంటి పనులు చేసుకుంటారు, అందరూ తిన్నాక తింటారు. కొన్నిసార్లు అస్సలు తినరు. ఖాళీ కడుపుతో నిద్రపోతారు. పెద్దలను, పిల్లలను జాగ్రత్తగా చూసుకుంటారు. మీరు బాధ్యతల బరువును మోస్తారు. ఎవరు గమనిస్తున్నారు? ఎవరైనా మీకు ఏదైనా ఇచ్చారా? ఇప్పుడు ఎన్నికలు దగ్గర పడుతున్నందున రూ. 10,000 ఇస్తున్నారు. 20 సంవత్సరాలకు ఈ రూ. 10,000 ఎక్కడైనా సంబంధం ఉందా? ఉద్యోగ అవకాశాలు లేవు, విద్యా వ్యవస్థ లేదు. మహిళలు సురక్షితంగా లేరు, వారికి అవకాశాలు లేవు. వారు 20 సంవత్సరాలలో ఏమి చేశారు? అని ప్రియాంక గాంధీ ప్రశ్నించారు.

బీజేపీ నాయకులు మీ గురించి మాట్లాడరు. ఉద్యోగాలు ఇస్తారో లేదో చెప్పరు. దేశానికి ఐపీఎస్, ఐఏఎస్, ఐఎఫ్ఎస్ అధికారులను అందించిన బీహార్‌లోని విద్యావ్యవస్థ ఎందుకు మూతపడిందో చెప్పరు. పరీక్షా పత్రాలు ఎందుకు లీక్ అవుతున్నాయో చెప్పరు. అలా జరగకుండా చూసుకోవడానికి తాము ఏమి చేస్తున్నారో చెప్పరని ఆమె ఆరోపించారు.

ప్రధాని దిగజారి మాట్లాడుతున్నారు: తేజస్వీ యాదవ్ - Tholi Paluku