
ప్రధానిపై వ్యాఖ్యల కేసులో గాయని నేహాసింగ్ రాథోర్‌కు నోటీసులు
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసినట్లు నమోదైన కేసులో జానపద గాయని నేహా సింగ్ రాథోర్‌కు ఉత్తరప్రదేశ్ పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఈ కేసు 2025లో వారణాసిలో నమోదు కాగా, చార్జ్‌షీట్ దాఖలు ప్రక్రియలో భాగంగా బుధవారం నోటీసు ఇచ్చినట్లు పోలీసులు తెలిపారు. లంకా పోలీస్ స్టేషన్ ఇన్‌ఛార్జి రాజ్‌కుమార్ శర్మ మాట్లాడుతూ ప్రధాని పై దూషణాత్మక వ్యాఖ్యలు చేసిన ఆరోపణలపై రాథోర్‌పై కేసు నమోదు చేశామని చెప్పారు. కేసుకు సంబంధించి చార్జ్‌షీట్ దాఖలు చేసే ప్రక్రియలో భాగంగానే నోటీసు జారీ చేశామని స్పష్టం చేశారు.
ఈ పరిణామంపై స్పందించిన నేహా సింగ్ రాథోర్ సోషల్ మీడియా వేదిక ‘ఎక్స్’లో పోస్టు చేస్తూ— లక్నోలోని హజ్రత్‌గంజ్ పోలీస్ స్టేషన్ నుంచి సమన్లు అందిన తర్వాత, వారణాసి లంకా పోలీస్ సిబ్బంది తన నివాసానికి కూడా వచ్చారని తెలిపారు. నన్ను వేధించేందుకు చూపుతున్న శ్రమ, వేగం, పాట్నాకు చెందిన ఆ అమ్మాయికి న్యాయం అందించేందుకు చూపి ఉంటే బాగుండేది. ఇలాగేనా ‘ఆడపిల్లల రక్షణ’? అంటూ వ్యాఖ్యానించారు. అయితే పోలీసులు మాత్రం, 2025లో నమోదైన కేసుకు సంబంధించిన చట్టపరమైన ప్రక్రియ ప్రకారమే నోటీసు ఇచ్చామని స్పష్టం చేశారు. ఇదిలా ఉండగా 2025లో జమ్మూకశ్మీర్‌లోని పహల్గామ్ ఉగ్రదాడి (26 మంది పర్యాటకులు మృతి)పై సోషల్ మీడియాలో చేసిన పోస్టుకు సంబంధించి నేహా సింగ్ రాథోర్‌పై లక్నో పోలీసులు మరో ప్రత్యేక విచారణ చేపడుతున్నారు. ఈ కేసులో ఏప్రిల్ 27న ఎఫ్‌ఐఆర్ నమోదు కాగా, ఆమె సుప్రీంకోర్టును ఆశ్రయించడంతో జనవరి 7న అరెస్టు నుంచి తాత్కాలిక రక్షణ లభించింది.
