
ప్రధానిని వదలని పొగమంచు
పొగమంచు ప్రధాని మోడీని కూడా వదలలేదు. దీని వల్ల ఆయన నాడియా జిల్లా తాహెర్పూర్‌లో జరిగిన ‘పరివర్తన్ సంకల్ప సభ’లో పాల్గొనాల్సిన ప్రధాని మోడీ పాల్గోనలేకపోయారు. మంచు కారణంగా హెలికాప్టర్ ల్యాండింగ్ సాధ్యంకాకపోవడంతో కోల్‌కతా విమానాశ్రయం నుంచే వర్చువల్ (ఆడియో) రూపంలో ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. పశ్చిమ బెంగాల్‌లో ప్రస్తుతం ‘మహా జంగిల్ రాజ్’ కొనసాగుతోందని, అవినీతి–వంశపారంపర్య రాజకీయాలు–రాజకీయ ప్రయోజనాల కోసం కొందరిని సంతృప్తి పరచడం వల్ల రాష్ట్ర అభివృద్ధి నిలిచిపోయిందని ప్రధాని మోడీ తీవ్ర విమర్శలు చేశారు. 2026 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి అవకాశం ఇస్తే డబుల్ ఇంజిన్ ప్రభుత్వం ఏర్పాటు చేసి బెంగాల్‌ను అభివృద్ధి పథంలో ముందుకు నడిపిస్తామని హామీ ఇచ్చారు.
టీఎంసీ నన్ను, బీజేపీని ఎంతగా వ్యతిరేకించినా పరవాలేదు. కానీ బీజేపీని అడ్డుకోవాలనే ఉద్దేశంతో ప్రజలను బంధీలుగా మార్చి బాధపెట్టడం ఎందుకు? అని మోడీ ప్రశ్నించారు. టీఎంసీ పాలనలో కట్ మనీ, కమిషన్ల సంస్కృతి విస్తరించిందని, కేంద్రం నుంచి వచ్చే వేల కోట్ల రూపాయల సంక్షేమ పథకాలు రాష్ట్ర ప్రభుత్వ వైఖరి వల్ల నిలిచిపోతున్నాయని ఆరోపించారు.
గుడ్‌విల్, ప్రణాళికలు, నిధులు అన్నీ ఉన్నా అభివృద్ధి జరగడం లేదు. బీజేపీకి ఒక్క అవకాశం ఇవ్వండి. డబుల్ ఇంజిన్ ప్రభుత్వం వస్తే వేగంగా అభివృద్ధి ఎలా జరుగుతుందో చూస్తారని ఆయన చెప్పారు.
బీహార్ ఫలితాలు బెంగాల్ లోనూ ప్రభావం చూపుతాయి
ఇటీవల బీహార్‌లో ఎన్డీఏ సాధించిన భారీ విజయాన్ని ప్రస్తావిస్తూ, ఆ ఫలితాలు బెంగాల్‌లో కూడా బీజేపీకి అనుకూలంగా మారతాయని వ్యాఖ్యానించారు. గంగా నది బీహార్ నుంచి బెంగాల్‌కు ప్రవహిస్తుంది. బీహార్ ఫలితాలు బెంగాల్ రాజకీయాలపై కూడా ప్రభావం చూపుతాయని అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రజల్లో టీఎంసీ పాలన నుంచి విముక్తి కావాలన్న ఆకాంక్ష కనిపిస్తోందని, వీధులు, గల్లీల్లో ‘బాంచ్తే చాయ్, బీజేపీ తాయ్’ (బతకాలంటే బీజేపీ కావాలి) అనే నినాదం వినిపిస్తోందని మోడీ పేర్కొన్నారు. మతువా సముదాయం అధికంగా నివసించే ప్రాంతంలో సభ జరగడం ప్రాధాన్యత కలిగిందని, హరిచంద్ ఠాకూర్, గురుచంద్ ఠాకూర్‌ల సేవలను ప్రధాని గుర్తు చేశారు. అలాగే ‘జయ్ నితాయ్’ నినాదంతో ప్రజలకు అభివాదం చేస్తూ, చైతన్య మహాప్రభు సేవలను స్మరించారు.
అక్రమ చొరబాటుదారుల కోసమే టీఎంసీ
అక్రమ చొరబాటుదారుల అంశంపై టీఎంసీపై తీవ్ర ఆరోపణలు చేసిన మోడీ, బెంగాల్‌లో చొరబాటుదారులకు టీఎంసీ రక్షణ ఇస్తోంది. వారిని గుర్తించకుండా ఉండేందుకే ఎస్‌ఐఆర్ ప్రక్రియకు వ్యతిరేకంగా నిలుస్తోందని అన్నారు.
పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ) ద్వారా పీడిత శరణార్థులకు పౌరసత్వం ఇవ్వాలని బీజేపీ ప్రయత్నిస్తోందని, టీఎంసీ మాత్రం తప్పుడు ప్రచారంతో భయపెడుతోందని ఆరోపించారు. ‘గో బ్యాక్ మోడీ’ పోస్టర్లపై స్పందిస్తూ, ఆ నినాదం చొరబాటుదారుల కోసం ఉండాలి. కానీ టీఎంసీకి వారిని ఒక్క మాట కూడా అనే ధైర్యం లేదని విమర్శించారు.
పార్లమెంట్‌లో ‘బంకిం దా’ వివాదాన్ని ప్రస్తావిస్తూ, ‘వందేమాతరం’ రచయిత బంకిం చంద్ర చటోపాధ్యాయను ఋషి బంకిం బాబుగా కొనియాడారు. జాతీయ గీతానికి 150 ఏళ్ల వేడుకలు జరుగుతున్నాయని గుర్తు చేస్తూ, 21వ శతాబ్దపు వికసిత భారత్‌కు ‘వందేమాతరం’ స్ఫూర్తి కావాలని అన్నారు. త్రిపురలో బీజేపీ పాలనలో జరిగిన వేగవంతమైన అభివృద్ధిని ఉదాహరణగా చూపుతూ, బెంగాల్‌లో మాత్రం టీఎంసీ పాలనలో అభివృద్ధి గ్రాఫ్ పడిపోయిందని ఆరోపించారు. కమ్యూనిస్టులను ఓడించిన తర్వాత ప్రజలు టీఎంసీపై ఆశలు పెట్టుకున్నారు. కానీ టీఎంసీ, వామపక్షాల చెడు లక్షణాలన్నీ తనలోనే కలిపేసుకుందని విమర్శించారు.బెంగాల్ కోసం బీజేపీ ప్రణాళికను త్వరలో ప్రజల ముందుంచుతామని, రాష్ట్రానికి తిరిగి వచ్చి మరింత స్పష్టంగా వివరించనున్నట్లు ప్రధాని తెలిపారు.
అస్సాంలో రూ.10,600 కోట్ల ఎరువుల ప్లాంట్‌కు నేడు శంకుస్థాపన
ప్రధాని నరేంద్ర మోడీ ఆదివారం అస్సాంలోని డిబ్రూగఢ్ జిల్లాలో రూ.10,600 కోట్ల వ్యయంతో నిర్మించనున్న బ్రౌన్‌ఫీల్డ్ అమ్మోనియా–యూరియా ఎరువుల ప్లాంట్‌కు శంకుస్థాపన చేయనున్నారు. ఈ ప్రాజెక్టు ద్వారా అస్సాం సహా పరిసర ఈశాన్య రాష్ట్రాల ఎరువుల అవసరాలకు గణనీయమైన ఊతం లభించనుంది. రెండు రోజుల పర్యటన నిమిత్తం శనివారం అస్సాంకి చేరుకున్న ప్రధాని మోడీ, ఈ పర్యటనలో మొత్తం రూ.15,600 కోట్ల విలువైన పలు అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించనున్నారు. అస్సాం అసెంబ్లీ ఎన్నికలకు సుమారు మూడు నెలల ముందు ఈ పర్యటన జరగడం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది.
