
ప్రధానమంత్రి అధ్యక్షతన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శుల సదస్సు
కేంద్ర-రాష్ట్ర భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయడంపై చర్చించేందుకు, అన్ని రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శుల ఐదవ జాతీయ సదస్సుకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఈ వారాంతంలో అధ్యక్షత వహించనున్నారు.
ఈ ఏడాది సదస్సును 'వికసిత్ భారత్ కోసం మానవ వనరులు' అనే ఇతివృత్తంతో నిర్వహిస్తున్నారు. ఈ సదస్సులో ప్రధానంగా ఐదు అంశాలపై దృష్టి సారించనున్నారు. అవి, ప్రారంభ బాల్య విద్య ,పాఠశాల విద్య, నైపుణ్యాభివృద్ధి, ఉన్నత విద్య, క్రీడలు, ఇతర కార్యకలాపాలు.
ప్రత్యేక సమావేశాలు:
ఈ మూడు రోజుల సదస్సులో (డిసెంబర్ 26-28) కొన్ని కీలక అంశాలపై ఆరు ప్రత్యేక సెషన్లు నిర్వహించనున్నారు. అందులో ముఖ్యంగా రాష్ట్రాల్లో నిబంధనల సరళీకరణ,, పాలనలో సాంకేతికత అవకాశాలు, సవాళ్లు, అగ్రిస్టాక్ స్మార్ట్ సప్లై చైన్, మార్కెట్ అనుసంధానం కాగా మిగిలినవి, ఒక రాష్ట్రం - ఒక ప్రపంచ స్థాయి పర్యాటక కేంద్రం, ఆత్మనిర్భర్ భారత్, స్వదేశీ వస్తువుల ప్రోత్సాహం, లెఫ్ట్ వింగ్ ఎక్స్‌ట్రీమిజం (నక్సలిజం) అనంతర భవిష్యత్తు ప్రణాళికలుగా ఉన్నాయి.
వీటితో పాటు, వారసత్వ సంపద, ప్రాచీన గ్రంథాల పరిరక్షణ, డిజిటలైజేషన్, అలాగే ప్రాథమిక ఆరోగ్య సేవల్లో 'ఆయుష్' వినియోగంపై కూడా చర్చలు జరగనున్నాయి.
నేపథ్యం:
ప్రధానమంత్రి 'సహకార సమాఖ్య' విజన్ ఆధారంగా ఈ సదస్సు జరుగుతోంది. భారతదేశ జనాభాను కేవలం గణాంకాలుగా కాకుండా, దేశాభివృద్ధికి ఉపయోగపడే 'మానవ వనరులుగా' మార్చడమే దీని లక్ష్యం. గత నాలుగు సంవత్సరాలుగా ఈ జాతీయ సదస్సు నిరంతరాయంగా జరుగుతోంది.
మొదటి సదస్సు జూన్ 2022 లో ధర్మశాలలో జరగగా, తదుపరి సదస్సులు జనవరి 2023, డిసెంబర్ 2023 మరియు డిసెంబర్ 2024 న్యూఢిల్లీలో జరిగాయి. ఈ సదస్సులో అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు, కేంద్ర ప్రభుత్వ ఉన్నతాధికారులు, ఆయా రంగాల నిపుణులు పాల్గొంటారు.
