.jpg)
ప్రదీప్ హీరో మెటీరియల్ కాదా?
చాలా వరకు పోలికల్లో హీరో ధనుష్‌లా కనిపించే మరో తమిళ యువ హీరో ఇటీవల కాలంలో అటు తమిళ ఇండస్ట్రీ, ఇటు తెలుగు చిత్రపరిశ్రమలో మంచి గుర్తింపు దక్కించుకున్నాడు. అతడి పేరే ప్రదీప్ రంగనాథన్. రెండు మూడు సినిమాలతోనే ప్రత్యేక క్రేజ్ దక్కించుకున్న ప్రదీప్ చుట్టూ చక్కర్లు కొట్టే వివాదాలు కూడా సినిమారంగంలో సంచలన వార్తలవుతున్నాయి. ఈ యువ తమిళ యాక్టర్ అనుకునో, అనుకోకుండానో పక్క హీరోలనూ ఇరుకున పెడుతున్నాయి. అసలు విషయంలోకి వెళ్తే..
ఇటీవల తెలుగు సినీ జర్నలిస్టులు అడుగుతున్న ప్రశ్నలు వివాదాస్పదంగా మారుతున్నాయి. కొందరు సెలబ్రెటీలు మనకెందుకులే అని వాళ్లని వదిలేస్తుంటే మరికొందరు ధైర్యం చేసి తప్పుని తప్పు అని చెబుతున్నారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మంచు లక్ష్మి డ్రెస్సింగ్ గురించి ఓ సీనియర్ జర్నలిస్టు ప్రశ్నించగా.. నీకెంత ధైర్యం అంటూ ఆమె అక్కడికక్కడే కడిగి పారేసింది. అంతటితో ఆగకుండా తనను అవమానించేలా ప్రశ్నించారంటూ మా అసోసియేషన్‌కి, ఫిల్మ్ ఛాంబర్‌కి ఫిర్యాదు చేసింది. దీంతో దిగొచ్చిన ఆ సీనియర్ జర్నలిస్టు బేషరతుగా ఆమెకు క్షమాపణ చెబుతూ వీడియో రిలీజ్ చేశారు. ఆ వివాదం సద్దుమణిగి ఒక్కరోజు కూడా కాలేదు ఓ లేడీ జర్నలిస్టు తమిళ హీరో ప్రదీప్ రంగనాథన్‌ని అడగకూడని ప్రశ్న అడిగి వివాదంలో చిక్కుకున్నారు. తాజాగా మరో తెలుగు సినిమా జర్నలిస్ట్ విలేకర్ల సమావేశంలో హీరోని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు వివాదస్పదమయ్యాయి.
‘డ్యూడ్’ సినిమా ప్రమోషన్లలో భాగంగా హైదరాబాద్‌లో ప్రెస్‌మీట్ నిర్వహించిన సమయంలో ఓ లేడీ జర్నలిస్టు మాట్లాడుతూ.. ‘మీరు లుక్ పరంగా హీరో మెటీరియల్ కాదు. కానీ రెండు సినిమాలకే ఇంత సక్సెస్ వచ్చిదంటే అది మీ హార్డ్ వర్కా.. లేక అదృష్టమా? అని ఆమె ప్రశ్నించారు. దానికి ఏం సమాధానం చెప్పాలా ప్రదీప్ రంగనాథన్ ఆలోచిస్తుండగా పక్కనే ఉన్న శరత్‌కుమార్ మైక్ అందుకున్నారు. నేను 170 సినిమాల్లో నటించాను. ప్రదీప్ హీరో మెటీరియల్ కాదని మీరెలా చెప్పగలరు. ఇక్కడున్న ప్రతి ఒక్కరూ హీరో మెటీరియలే. హీరో అంటే ఫలానా లక్షణాలు ఉండాలని ఏమీ లేదు. ఈ సమాజానికి మేలు చేసే ప్రతి వ్యక్తి హీరోనే’ అని సమాధానం ఇచ్చారు. ఈ నేపథ్యంలోనే ఆ మహిళా జర్నలిస్టుపై పెద్దయెత్తున ట్రోల్స్ మొదలయ్యాయి. ఆ మహిళా రిపోర్టర్ అందంపైన కూడా సోషల్ మీడియాలో సినిమా అభిమానులు నిలదీశారు.
అలా వ్యాఖ్యలు చేయడం తప్పే!
గతంతో పోల్చుకుంటే సినిమా రంగంలో అనేక మార్పులు చోటు చేసుకుంటున్న సంగతి తెలిసిందే. ఒకప్పుడు హీరో అంటే ఇలా ఉండాలి. ఆరడుగుల అందగాడై ఉండాలి. కొనతేలిన ముక్కు, నిమ్మపండు శరీర ఛాయ, గిరజాల జుట్టు ఇలాంటి లక్షణాలుగల వాళ్ళే హీరోగా చెలామణి అయ్యేందుకు అవకాశం ఉండేది. కానీ ఆ ట్రెండ్ ఏనాడో అంతరించిపోయింది అన్నట్టుగా, ఇప్పుడు సినిమా హీరో అంటే ప్రత్యేకమైన డిజైన్ అవసరంలేదు.
హీరో మెటీరియల్ అంటే ఇలానే ఉండాలనే పాత కాలపు భాష్యాలకు కూడా కాలం చెల్లింది. నాలుగడుగల ఎత్తున్న అబ్బాయిని హీరోగా పెట్టి బాక్సాఫీస్ దగ్గర కాసుల వర్షం కురిపించే సినిమాల ట్రెండ్ మొదలయ్యింది. అలా అనుకోకుండానో, అనుకునో హీరోలైన వాళ్ళను లెక్కేసుకుంటే అనేక మంది నవతరం హీరోలు వెండితెర కల్చర్ ని మార్చేసిన వాళ్ళు చాలా మంది ఉణ్నారు. ఇక్కడ హీరోకంటే కథే ముఖ్యమనే ట్రెండే బాగా నడుస్తోంది. భాషా బేధాలు లేకుండా తమదైన నటనతో స్టార్ డమ్ హీరోలు సైతం ట్రెండ్ సెట్ చేస్తున్నారు.
కానీ తాజాగా ఓ ఛానల్ మహిళా రిపోర్టర్ ‘హీరో మెటీరియల్ కాదు’ అనే మాట ఇప్పుడు దక్షిణాది సినిమా పరిశ్రమలో సంచలనాలకు కారణమైంది. బాధ్యతగల మీడియా ప్రతినిధిగా ఉండి ఓ సక్సస్ ఫుల్ హీరోగా ఇప్పుడిప్పుడే పేరు తెచ్చుకుంటున్న పరాయి భాష నటుడ్ని తెలుగు నేలపై ‘నీది హీరో మెటీరియల్ కాదు కదా.. మరి ఎలా? సక్సస్ అయ్యారు.’ అని హీరో ప్రదీప్ రంగనాథ్ ని అడగడాన్ని మీడియా రంగం కూడా తప్పుపడుతోంది. తమిళ నటుడిని అలా అడగడం మన స్థానిక నటులు కూడా తప్పు పడుతున్నారు.
