Let's talk: editor@tmv.in
‘ప్రత్యేక వ్యూహాత్మక భాగస్వామ్యం’ స్థాయికి భారత్-ఇజ్రాయెల్ బంధం

‘ప్రత్యేక వ్యూహాత్మక భాగస్వామ్యం’ స్థాయికి భారత్-ఇజ్రాయెల్ బంధం

Shaik Mohammad Shaffee
27 ఫిబ్రవరి, 2026

భారత్, ఇజ్రాయెల్ మధ్య దశాబ్దాల కాలంగా కొనసాగుతున్న చెక్కుచెదరని మైత్రి సరికొత్త శిఖరాలకు చేరుకుంది. ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలను 'ప్రత్యేక వ్యూహాత్మక భాగస్వామ్యం' స్థాయికి పెంచుతూ చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నారు. ఇజ్రాయెల్ పర్యటనలో భారత ప్రధాని నరేంద్ర మోడీ, ఆ దేశ ప్రధాని బెన్యామిన్ నెతన్యాహుతో గురువారం జరిపిన విస్తృత స్థాయి చర్చల అనంతరం ఈ కీలక ప్రకటన వెలువడింది. మానవత్వం ఎప్పుడూ యుద్ధానికి బలికాకూడదని ఉద్ఘాటించిన మోడీ.. గాజాలో శాంతి స్థాపనకు జరుగుతున్న ప్రయత్నాలకు భారత్ పూర్తి మద్దతును ప్రకటించారు.

17 కీలక ఒప్పందాలపై సంతకాలు

భారత్, ఇజ్రాయెల్ మధ్య కుదిరిన చారిత్రాత్మక ఒప్పందాల్లో భాగంగా కృత్రిమ మేధ, క్వాంటం కంప్యూటింగ్, కీలక ఖనిజాల వంటి అత్యాధునిక సాంకేతిక రంగాల్లో పరస్పర సహకారాన్ని పెంపొందించుకోవడంతో పాటు, త్వరలోనే స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాన్ని ఖరారు చేయాలని, ఇజ్రాయెల్‌లో భారత ‘యూపీఐ’ సేవలను అందుబాటులోకి తీసుకురావాలని నిర్ణయించారు. వ్యవసాయ రంగంలో విప్లవాత్మక మార్పుల కోసం దేశవ్యాప్తంగా ‘విలేజెస్ ఆఫ్ ఎక్సలెన్స్’ ఏర్పాటు చేయాలని, ప్రస్తుతం ఉన్న ఎక్సలెన్స్ కేంద్రాల సంఖ్యను 100కు పెంచాలని లక్ష్యంగా పెట్టుకోవడమే కాకుండా.. డిజిటల్ హెల్త్, విద్య, పెట్టుబడులు, తయారీ, సంస్కృతి, సముద్ర వారసత్వం వంటి మొత్తం 17 కీలక రంగాల్లో ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేసేలా ఇరు దేశాల అగ్రనేతలు ఒప్పందాలు కుదుర్చుకున్నారు.

రక్షణ రంగంలో సరికొత్త అధ్యాయం

రక్షణ రంగంలో ఇరు దేశాలు కేవలం కొనుగోలుదారు-విక్రేత స్థాయి నుంచి సంయుక్త అభివృద్ధి, సంయుక్త ఉత్పత్తి దిశగా అడుగులు వేయాలని నిర్ణయించాయి. భారత్ స్వదేశీ సాంకేతికతతో అభివృద్ధి చేస్తున్న 'సుదర్శన చక్ర' ఎయిర్ డిఫెన్స్ షీల్డ్‌లో ఇజ్రాయెల్‌కు చెందిన ప్రఖ్యాత 'ఐరన్ డోమ్' సాంకేతికతను జోడించే అంశంపై చర్చలు జరిగాయి. రక్షణ పరికరాల తయారీలో సాంకేతిక పరిజ్ఞాన బదిలీకి ఇరు దేశాలు అంగీకరించాయి.

మానవత్వమే ముఖ్యం: గాజా శాంతిపై మోడీ

పశ్చిమాసియాలో శాంతి, స్థిరత్వం భారత భద్రతా ప్రయోజనాలకు అత్యంత కీలకమని ప్రధాని మోడీ స్పష్టం చేశారు. "మానవత్వం ఎప్పుడూ సంఘర్షణకు బలికాకూడదు. గాజా శాంతి ప్రణాళిక శాంతికి కొత్త మార్గాన్ని చూపింది. దీనికి భారత్ సంపూర్ణ మద్దతు ఇస్తుంది" అని ఆయన పేర్కొన్నారు. చర్చల ద్వారానే పరిష్కారం సాధ్యమని, గ్లోబల్ సౌత్ దేశాల ఆకాంక్ష కూడా ఇదేనని మోడీ గుర్తుచేశారు.

ఉగ్రవాదంపై రాజీలేని పోరాటం

ఉగ్రవాదాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని ఇరు దేశాలు పునరుద్ఘాటించాయి. "భారత్, ఇజ్రాయెల్ ఉగ్రవాదానికి, దాని మద్దతుదారులకు వ్యతిరేకంగా భుజం భుజం కలిపి పోరాడుతున్నాయి. భవిష్యత్తులోనూ ఇదే దృక్పథంతో ముందుకు సాగుతాం" అని మోడీ స్పష్టం చేశారు. అమెరికా-ఇరాన్ ఉద్రిక్తతలు సహా ప్రాంతీయ అంశాలపై కూడా ఈ భేటీలో చర్చ జరిగింది.

ప్రాంతీయ అనుసంధానం.. ఐ2యూ2

భారత్-మధ్యప్రాచ్యం-యూరప్ ఆర్థిక కారిడార్ అమలుపై ఇరు నేతలు చర్చించారు. అలాగే భారత్, ఇజ్రాయెల్, యూఏఈ, అమెరికా భాగస్వామ్యంతో కూడిన ' ఐ2యూ2 ' ఫ్రేమ్‌వర్క్‌లో భాగంగా సహకారాన్ని మరింత వేగవంతం చేయాలని నిర్ణయించారు. "భవిష్యత్తు ఆవిష్కరణలదే.. ఆ ఆవిష్కరణల దిశగా భారత్-ఇజ్రాయెల్ కలిసి ప్రయాణిస్తాయి" అని నెతన్యాహు ఆకాంక్షించారు.

‘ప్రత్యేక వ్యూహాత్మక భాగస్వామ్యం’ స్థాయికి భారత్-ఇజ్రాయెల్ బంధం - Tholi Paluku