Let's talk: editor@tmv.in
ప్రత్యేక రైళ్లు ఎక్కడ?: రాహుల్ గాంధీ

ప్రత్యేక రైళ్లు ఎక్కడ?: రాహుల్ గాంధీ

Pinjari Chand
26 అక్టోబర్, 2025

కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ శనివారం కేంద్ర ప్రభుత్వంపై తీవ్రంగా విమర్శలు గుప్పించారు. ఛాత్ పండుగ సందర్భంగా సొంత రాష్ట్రమైన బీహార్ కు వెళుతున్న కార్మికులు రైళ్లలో ఎదుర్కొంటున్న ఇబ్బందులను ప్రస్తావిస్తూ అధిక రద్దీని ఆయన ఎత్తిచూపారు.

ఎక్స్ లో తన ఖాతాలో రాహుల్ గాంధీ ఈ విధంగా పోస్ట్ చేశారు ఇది పండుగల కాలం దీపావళి, భాయ్ దూజ్, ఛాత్. బీహార్ ప్రజలకు ఇవి కేవలం భక్తి పండుగలు మాత్రమే కాదు. స్వగ్రామం చేరుకోవాలనే ఉత్సాహం, సొంత నేల, కుటుంబ ప్రేమ, ఊరి పై మమకారం. కానీ ఇప్పుడు ఆ ఉత్సాహం బాధగా మారింది. బీహార్ వైపు వెళ్లే రైళ్లు కిటకిటలాడుతున్నాయి. టికెట్లు దొరకడం అసాధ్యంగా మారింది. ప్రయాణం మనుషులకే పెద్ద ముప్పుగా మారింది. కొన్ని రైళ్లలో సామర్థ్యానికి మించి 200 శాతం ఎక్కువగా ప్రయాణికులు ఉన్నారు. తలుపుల నుంచి వేలాడుతూ, పైకప్పుల మీద కూర్చుని వెళ్తున్నారు. వీరు బాధితులు కాదు, ఎన్డీయే ప్రభుత్వ మోసపూరిత విధానాలకు సజీవ సాక్ష్యాలు అని పేర్కొన్నారు.

“డబుల్ ఇంజిన్ ప్రభుత్వ వాగ్దానాలు విఫలమయ్యాయి, అవి ఖాళీ అని నిరూపితమయ్యాయి. 12,000 ప్రత్యేక రైళ్లు ఎక్కడ? ప్రతి ఏడాది పరిస్థితి మరింత దారుణంగా ఎందుకు మారుతోంది? బీహార్ ప్రజలు ప్రతి సంవత్సరం ఇలాంటి అవమానకరమైన పరిస్థితుల్లో స్వగ్రామం ఎందుకు చేరుకోవాలి? రాష్ట్రంలో ఉద్యోగాలు, గౌరవప్రదమైన జీవితం ఉంటే, వేల కిలోమీటర్ల దూరం తిరగాల్సిన అవసరం ఉండేది కాదని రాహుల్ గాంధీ గుర్తు చేశారు.

ఇది మరో బహిరంగ అబద్దం: లాలూ ప్రసాద్ యాదవ్

బీహార్ మాజీ ముఖ్యమంత్రి, ఆర్జేడీ అధినేత లాలు ప్రసాద్ యాదవ్ కూడా కేంద్రంపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఛాత్ పండుగ సందర్భంగా దేశంలోని 13,198 రైళ్లలో 12,000 రైళ్లు బీహార్ కోసం నడుస్తాయని కేంద్రం చెప్పిన వాగ్దానాన్ని ఆయన సిగ్గులేని అబద్ధం గా ఆరోపించారు.

అబద్ధాల రాజు, ఉత్తర ప్రగల్భాలు పలికే నాయకుడు. పన్నెండు వేల రైళ్లు బీహార్‌ కోసం నడుస్తాయని చెప్పాడు. ఇది కూడా మరో బహిరంగ అబద్ధమే అని లాలు యాదవ్ ఎక్స్‌లో రాశారు.

గత ఏడాది కంటే ఎక్కవే నడుపుతున్నాం: రైల్వే శాఖ

భారత రైల్వే శాఖ విడుదల చేసిన అధికారిక ప్రకటన ప్రకారం ఈ సంవత్సరం అక్టోబర్ 1 నుంచి నవంబర్ 30 వరకు పండుగల రద్దీని దృష్టిలో ఉంచుకుని దేశవ్యాప్తంగా 12,000కిపైగా ప్రత్యేక రైళ్లు నడుపుతున్నాం. ఇప్పటివరకు మొత్తం 11,865 ట్రిప్‌లు (916 రైళ్లు) ప్రకటించామని, వీటిలో 9,338 రిజర్వ్‌డ్, 2,203 అన్‌రిజర్వ్‌డ్ ట్రిప్‌లు ఉన్నాయని రైల్వేశాఖ పేర్కొంది.

ఇది గత సంవత్సరం నడిచిన 7,724 ప్రత్యేక రైళ్లతో పోలిస్తే గణనీయంగా పెరిగిందని, పండుగల కాలంలో ప్రజలకు సౌకర్యవంతమైన ప్రయాణానికి భారత రైల్వే శాఖ కట్టుబడి ఉందని తెలిపింది.