Let's talk: editor@tmv.in
ప్రత్యర్థులకు ఓటేస్తే పంజాబ్ మళ్లీ మత్తులో మునిగిపోతుంది: కేజ్రీవాల్

ప్రత్యర్థులకు ఓటేస్తే పంజాబ్ మళ్లీ మత్తులో మునిగిపోతుంది: కేజ్రీవాల్

Pinjari Chand
17 ఫిబ్రవరి, 2026

ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ సోమవారం కాంగ్రెస్, శిరోమణి అకాలి దళ్ (ఎస్ఏడీ), బీజేపీ ప్రభుత్వాలపై తీవ్రంగా విమర్శలు గుప్పించారు. ఈ పార్టీలే పంజాబ్‌ను మత్తు పదార్థాల సమస్యలోకి నెట్టాయని ఆరోపిస్తూ, ప్రజలు వీటికి ఓటేయవద్దని కోరారు. లేకపోతే పంజాబ్ మళ్లీ డ్రగ్స్‌లో మునిగిపోతుందని హెచ్చరించారు. మోగా జిల్లాలోని కిల్లీ చహ్లాన్ గ్రామంలో నిర్వహించిన రాష్ట్ర స్థాయి కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ‘యుద్ధ్ నషియన్ విరుద్ధ్’ (మత్తుపదార్థాలపై యుద్ధం) పేరుతో పంజాబ్ ప్రభుత్వం చేపట్టిన ప్రచార కార్యక్రమాన్ని ప్రోత్సహించేందుకు ఈ ర్యాలీ జరిగింది. ఈ సభలో ముఖ్యమంత్రి భగవంత్ మాన్, ఆప్ నేత మనిష్ సిసోడియా, పంజాబ్ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర పార్టీ నాయకులు పాల్గొన్నారు. ఆదివారం అస్వస్థత కారణంగా మోహాలీలోని ఆసుపత్రిలో చేరిన మాన్, సోమవారం డిశ్చార్జ్ అయి సభకు హాజరయ్యారు.

తన ప్రసంగంలో కేజ్రీవాల్ గ్రామ రక్షణ కమిటీల (వీడీసీస్) పాత్రను ప్రశంసించారు. ప్రతి గ్రామంలో ప్రతి కుటుంబానికి గత ప్రభుత్వాల పాత్ర గురించి తెలియజేయాలని ఆయన పిలుపునిచ్చారు. అకాలి దళ్, బీజేపీ, కాంగ్రెస్ — ఇవే పంజాబ్‌ను డ్రగ్స్‌లోకి నెట్టాయి. అవి అధికారంలో ఉన్నప్పుడు ప్రతి కుటుంబం ప్రభావితమైంది. యువతను, కుటుంబాలను, పంజాబ్ భవిష్యత్తును నాశనం చేశాయని ఆయన ఆరోపించారు. ఈ పార్టీలకు పొరపాటునైనా ఓటేయవద్దని ప్రతి ఇంటికి వెళ్లి చెప్పాలి. లేదంటే పంజాబ్ మళ్లీ డ్రగ్స్‌లో మునిగిపోతుందని కేజ్రీవాల్ హెచ్చరించారు. మొదటిసారి ఒక ప్రభుత్వం డ్రగ్స్ స్మగ్లర్లపై కఠిన చర్యలు తీసుకుంటోందని, వారిని జైలుకు పంపడం, ఇళ్లు కూల్చివేయడం, ఆస్తులు స్వాధీనం చేసుకోవడం జరుగుతోందని ఆయన పేర్కొన్నారు. దేవుడి కృపతో ఇలాంటి ప్రభుత్వం వచ్చింది. త్వరలోనే పంజాబ్ ‘రంగ్లా పంజాబ్’, ‘నషా ముక్త్ పంజాబ్’ అవుతుందన్నారు. 2027లో పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి.

పెద్ద స్మగ్లర్లను అరెస్ట్ చేశాం

2025 మార్చి 1న ప్రారంభమైన ‘యుద్ధ్ నషియన్ విరుద్ధ్’ కార్యక్రమం గురించి కేజ్రీవాల్ ప్రస్తావించారు. మొదట్లో ప్రజలు భయంతో స్మగ్లర్లపై సమాచారం ఇవ్వడానికి సంకోచించారని, కానీ గత సంవత్సరం పంజాబ్ పోలీసులు 2,000 కిలోల మత్తు పదార్థాలు స్వాధీనం చేసుకుని, పెద్ద స్మగ్లర్లను అరెస్టు చేయడంతో ప్రజల్లో విశ్వాసం పెరిగిందని చెప్పారు. వీడీసీల్లో రిటైర్డ్ టీచర్లు, మాజీ సైనికులు, యువకులు, సర్పంచ్‌లు ఉంటారని తెలిపారు. డ్రగ్స్ విక్రయాలపై సమాచారం సేకరించి, గోప్యతతో పోలీసులకు అందిస్తారని చెప్పారు. ఇందుకోసం పంజాబ్ ప్రభుత్వం ఒక మొబైల్ యాప్ కూడా రూపొందించిందని తెలిపారు. మొదట డ్రగ్స్ విక్రయించే వారిపై సమాచారం ఇవ్వాలి. రెండవది, గ్రామంలో మత్తు వ్యసనంతో బాధపడుతున్నవారిని సమీప చికిత్స కేంద్రాలకు తీసుకెళ్లాలని కేజ్రీవాల్ వివరించారు. యువత కోసం ప్రతి గ్రామంలో క్రీడా మైదానాలు నిర్మిస్తున్నట్లు కూడా తెలిపారు.

సభలో మాట్లాడిన పంజాబ్ డీజీపీ గౌరవ్ యాదవ్, గత ఏడాది మార్చి నుంచి చేపట్టిన చర్యల ఫలితంగా 34,000కిపైగా ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేసి, 45,000 మందికి పైగా అరెస్టు చేసినట్లు చెప్పారు. 2025లో 2,000 కిలోలకుపైగా హెరాయిన్ స్వాధీనం చేసుకున్నామని, అది దేశవ్యాప్తంగా ఆ ఏడాది స్వాధీనం చేసిన మొత్తం హెరాయిన్‌లో 66 శాతం అని తెలిపారు. సరిహద్దు ప్రాంతాల్లో బీఎస్‌ఎఫ్ సహకారంతో 260 డ్రోన్లను కూల్చివేశామని పేర్కొన్నారు. డ్రగ్స్ కేసుల్లో 90 శాతం శిక్షార్హత రేటు సాధించామని, ఇది దేశంలోనే అత్యధికమని తెలిపారు. ప్రజల మద్దతుతోనే డ్రగ్స్‌పై యుద్ధంలో విజయం సాధించవచ్చని ఆయన అన్నారు.

ప్రత్యర్థులకు ఓటేస్తే పంజాబ్ మళ్లీ మత్తులో మునిగిపోతుంది: కేజ్రీవాల్ - Tholi Paluku