
ప్రతి హామీ నెరవేర్చడమే ప్రభుత్వ లక్ష్యం: మంత్రి అచ్చెన్నాయుడు
ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని అక్షరాలా అమలు చేయడమే కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని రాష్ట్ర మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. శనివారం శ్రీకాకుళం జిల్లా నిమ్మాడలోని తన క్యాంపు కార్యాలయంలో పంచాయతీ రాజ్, ఏపీఎస్ ఐడీసీ శాఖల అధికారులతో ఆయన ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. నియోజకవర్గంలో ప్రస్తుతం కొనసాగుతున్న అభివృద్ధి పనులు, వాటి పురోగతిని సమీక్షించడంతో పాటు క్షేత్రస్థాయిలో ఎదురవుతున్న సమస్యలపై అధికారులతో సుదీర్ఘంగా చర్చించారు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిధులతో చేపడుతున్న అన్ని మౌలిక సదుపాయాల కల్పన పనులను మార్చి నెలాఖరులోగా యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని అధికారులను మంత్రి ఆదేశించారు. గ్రామాల్లో మట్టి రహదారులు కనిపించకూడదన్నదే ప్రభుత్వ సంకల్పమని, అన్నిచోట్లా సీసీ రోడ్లు, డ్రైనేజీ పనులను వేగవంతం చేయాలని సూచించారు. పనుల నాణ్యత విషయంలో ఎక్కడా రాజీ పడకూడదని, ప్రజాధనం దుర్వినియోగం కాకుండా చూడాలని స్పష్టం చేశారు. విధుల్లో నిర్లక్ష్యం వహించే అధికారులపై కఠిన చర్యలు తప్పవని ఈ సందర్భంగా ఆయన హెచ్చరించారు.
రైతు సంక్షేమానికి పెద్దపీట వేస్తూ సాగునీటి ప్రాజెక్టులపై మంత్రి ప్రత్యేక దృష్టి సారించారు. గత ఐదేళ్ల కాలంలో చిన్నాభిన్నమైన ఇరిగేషన్ వ్యవస్థను మళ్లీ పునర్నిర్మించి ప్రతి ఎకరాకు సాగునీరు అందిస్తామన్నారు. ఇందులో భాగంగా సంతబొమ్మాళి మండలం వాడ్రాడ, కొండపేట ప్రాంతాల్లో కొత్తగా రెండు లిఫ్ట్ ఇరిగేషన్ పథకాల ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. అలాగే మదనగోపాల సాగరం ప్రాజెక్టుకు సంబంధించిన పెండింగ్ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు.
ఇదే సందర్భంలో ఏపీపీఎస్సీ గ్రూప్-2 ఫలితాల్లో అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ గా ఎంపికైన పట్టుపురం పంచాయతీ కొండపేట గ్రామానికి చెందిన కె. రమేష్‌ను మంత్రి అభినందించారు. సామాన్య కుటుంబ నేపథ్యం నుంచి వచ్చి పట్టుదలతో గ్రూప్-2 సాధించడం అభినందనీయమని, రమేష్ విజయం నేటి యువతకు స్ఫూర్తిదాయకమని కొనియాడారు. అనంతరం నిర్వహించిన గ్రీవెన్స్ కార్యక్రమంలో ప్రజల నుంచి వినతులు స్వీకరించిన మంత్రి వాటిని నిర్ణీత గడువులోగా పరిష్కరించాలని అధికారులకు డెడ్ లైన్ విధించారు.
