Let's talk: editor@tmv.in
ప్రతి విద్వేష ప్రసంగాన్ని పర్యవేక్షించడం సాధ్యం కాదు: సుప్రీంకోర్టు

ప్రతి విద్వేష ప్రసంగాన్ని పర్యవేక్షించడం సాధ్యం కాదు: సుప్రీంకోర్టు

Pinjari Chand
26 నవంబర్, 2025

దేశంలో చోటుచేసుకునే ప్రతి చిన్న విద్వేషపూరిత ప్రసంగాల ఘటనను సుప్రీంకోర్టు పర్యవేక్షించే బాధ్యత తీసుకోబోదని స్పష్టం చేసింది. సమాజంలో ఎక్కడెక్కడో జరిగే చిన్న చిన్న సంఘటనలను సుప్రీంకోర్టే పర్యవేక్షించాలన్న అంచనాలు తగవని వ్యాఖ్యానించింది. ఇప్పటికే చట్టాలు, పోలీసు యంత్రాంగం, హైకోర్టులు ఉన్నందున ప్రజలు వాటిని ఆశ్రయించాలని సూచించింది. మంగళవారం జస్టిస్‌ విక్రమ్‌ నాథ్‌, జస్టిస్‌ సందీప్‌ మెహతలతో కూడిన ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది. ఓ వర్గంపై సామాజిక–ఆర్థిక బహిష్కరణ పిలుపులు వస్తున్నాయంటూ దాఖలైన దరఖాస్తును విచారించింది.

ఇది మా పని కాదు

పిటిషన్‌ పేరు పెట్టి మేం చట్టాలు రాయబోం. దేశంలో అనేక ప్రాంతాల్లో జరిగే ప్రతి ఘటనను మేం కూర్చుని పర్యవేక్షణ చేయలేం. హైకోర్టులు, పోలీస్‌ స్టేషన్లు, చట్టాలు అన్నీ ఉన్నాయి అని బెంచ్ వ్యాఖ్యానించింది. దేశవ్యాప్తంగా జరిగే అన్ని ఘటనల్ని సుప్రీంకోర్టు ఎలా పర్యవేక్షిస్తుంది? ముందుగా అధికారులను సంప్రదించండి. చర్యలు తీసుకోకుంటే హైకోర్టుకెళ్లండి అని దరఖాస్తుదారుడికి స్పష్టం చేసింది. మొదట సంబంధిత హైకోర్టును ఆశ్రయించాలని కోర్టు తెలిపింది. అయితే దరఖాస్తుదారుడు మాత్రం అధికారులు చర్యలు తీసుకోవడం లేదనే కారణంతో కోర్టును ఆశ్రయించానని తెలిపారు. కొన్ని వ్యాఖ్యలు వ్యక్తులనుంచే కాకుండా కొంతమంది ప్రజా ప్రతినిధుల నుంచీ వస్తున్నాయని ఆరోపించారు.

ప్రజాప్రయోజనం ఒకే మతానికా? సొలిసిటర్‌ జనరల్‌

దరఖాస్తుదారు తరఫు న్యాయవాది విద్వేషపూరిత ప్రసంగాల ఉదాహరణలను జత చేస్తున్నానని చెప్పగా, సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహత స్పందిస్తూ ప్రజాప్రయోజనం ఒకే మతం వరకే పరిమితం కాదు. అన్ని మతాల్లోనూ తీవ్రమైన విద్వేష పూరిత ప్రసంగాల ఉదాహరణలు ఉన్నాయి. వాటిని కూడా చేర్చండి. ప్రజాహితం అంటే అందరికీ సమానంగా ఉండాలన్నారు. దరఖాస్తుదారు న్యాయవాది మాత్రం, అధికారులు చర్యలు తీసుకోవడం లేదనే కారణంతోనే కోర్టు దృష్టికి విషయాన్ని తీసుకొచ్చామని పేర్కొన్నారు. విద్వేష ప్రసంగాల కేసుల్లో రాష్ట్రాలు చర్యలు తీసుకోకపోతే పోలీసులే సూమోటో కేసులు నమోదు చేయాలని సుప్రీంకోర్టు గతంలో ఆదేశించిందని గుర్తుచేశారు.

ఇప్పటికే మెకానిజం ఉంది: బెంచ్

ఏ రాష్ట్రంలో సమస్య ఉన్నా, ఆ రాష్ట్ర హైకోర్టును ఆశ్రయించండి. ప్రజాహితం ఉంటే హైకోర్టులు తప్పకుండా చూసుకుంటాయి అని బెంచ్ పునరుద్ఘాటించింది. 2022 అక్టోబర్‌లో ఢిల్లీ, ఉత్తర ప్రదేశ్, ఉత్తరాఖండ్ ఈ మూడు రాష్ట్రాలకు విద్వేష పూరిత ప్రసంగం పై కఠిన చర్యలు తీసుకోవాలని సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలను కూడా దరఖాస్తుదారు గుర్తుచేశారు. అస్సాం మంత్రి ఒకరు బిహార్‌ ఎన్నికలపై చేసిన వ్యాఖ్యల్ని కూడా ఉదాహరణగా చూపించారు. ఇది 1989 భగల్‌పూర్‌ ఘటనలను గుర్తు చేస్తున్నదని న్యాయవాది వాదించారు. దీంతో ఈ మొత్తం అంశాన్ని కోర్టు డిసెంబర్‌ 9కు వాయిదా వేసింది.

ఇస్కాన్ స్కూళ్లలో లైంగిక* *వేధింపుల ఆరోపణలు

బాలల హక్కుల కమిషన్‌ను* *ఆశ్రయించండి

ఇస్కాన్‌ ఆధ్వర్యంలో నడుస్తున్న పాఠశాలల్లో బాలలపై లైంగిక వేధింపులు జరిగినట్టుగా ఆరోపణలు చేస్తూ దర్యాప్తు కోరిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. ఈ విషయాన్ని నేషనల్‌ కమిషన్‌ ఫర్‌ ప్రొటెక్షన్‌ ఆఫ్‌ చైల్డ్‌ రైట్స్‌ (ఎన్సీపీసీఆర్)ను ఆశ్రయించాలని పిటిషన్‌ దారులకు సూచించింది. మంగళవారం జస్టిస్‌ బి.వీ. నాగరత్న, జస్టిస్‌ ఆర్. మహాదేవన్‌ల డివిజన్‌ బెంచ్‌ ఈ వ్యాఖ్యలు చేసింది. పిటిషన్‌దారులు తమ ఫిర్యాదులను ఎన్సీపీసీఆర్, అలాగే ఉత్తర ప్రదేశ్‌, పశ్చిమ బెంగాల్‌ స్టేట్‌ చైల్డ్‌ రైట్స్‌ కమిషన్ వద్ద మళ్లీ సమర్పించవచ్చని కోర్టు తెలిపింది.

ఏం ఆరోపిస్తున్నారు?

రజ్నీష్‌ కపూర్‌ తదితరులు దాఖలు చేసిన పిటిషన్‌లో ఇస్కాన్ ఆధ్వర్యంలో నడుస్తున్న పాఠశాలల్లో తీవ్ర లైంగిక, శారీరక వేధింపులు జరిగినట్టు, అంతర్గత రికార్డుల్లో ఇందుకు సంబంధించిన ఆధారాలు ఉన్నాయని, ప్రభుత్వ అధికారులకు ఇచ్చిన ఫిర్యాదులకు స్పందన లేని సంగతిని వివరించారు. రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 21 ప్రకారం పిల్లలకు ఉన్న ప్రాథమిక హక్కులు కాపాడడంలో ప్రతివాదులు 1 నుంచి 11 వరకూ తమ రాజ్యాంగ, చట్టపరమైన బాధ్యతలను నిర్వర్తించలేదు అని పేర్కోన్నారు.

200కు పైగా పిల్లలు బాధితులా?

పిటిషన్‌ దారులు సమర్పించిన పత్రాల ప్రకారం దేశవ్యాప్తంగా ఇస్కాన్ నడిపే సంస్థల్లో 200 మందికి పైగా పిల్లలు వ్యవస్థాగతంగా లైంగిక, శారీరక, మానసిక వేధింపులకు గురయ్యారని, వీటిలో కొందరు ఇస్కాన్‌లో ఉన్న కీలక నేతలే నిందితులుగా ఉన్నట్టు ఆరోపించారు. ఈ ఆరోపణలన్నింటినీ సంబంధిత పిల్లల హక్కుల కమిషన్ల ముందు ఉంచాలని సుప్రీంకోర్టు పిటిషన్‌దారులకు సూచించింది.