
ప్రతి రైతుకు మద్దతుగా ఉంటాం
ఇటీవల భారీవర్షాలతో, వరదలతో నష్టపోయిన వారిని, ముఖ్యంగా రైతులను ఆదుకోవడానికి మహారాష్ట్ర ప్రభుత్వం సహాయ ప్యాకేజిని ప్రకటించింది. మంగళవారం డిప్యూటీ సీఎంలు అజిత్ పవార్, ఏక్ నాథ్ షిండేలతో కలిసి సీఎం ఫడ్నవీస్ విలేకరుల సమావేశంలో వివరాలను వెల్లడించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ రైతులు ఆర్థికంగా, మానసికంగా చాలా నష్టపోయారు. వారిని వంద శాతం పూర్తిగా ఆదుకోలేకపోయినప్పటికీ వారు వారి కాళ్లపై నిలబడేలా ప్రభుత్వం సహాయం చేస్తుందన్నారు. వర్షాల బారినపడి నష్టపోయిన ప్రతి ఒక్కరికి ఆర్థికంగా మద్దతుగా ఉంటామన్నారు. సుమారు రూ. 31,628 కోట్ల సహాయ ప్యాకేజీని ప్రకటించారు. బాధితరైతులకు రూ.10 వేల నగదును తక్షణం అందించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
68 లక్షల హెక్టార్లకు సహాయం
రాష్ట్రంలో వరదలు, భారీ వర్షాల కారణంగా 68 లక్షల హెక్టార్లకు పైగా పంటలు దెబ్బతిన్నాయని ముఖ్యమంత్రి ఫడ్నవీస్ తెలిపారు. మహారాష్ట్రలోని 36 జిల్లాలు ఉంటే 29 జిల్లాలు వరద ప్రభావానికి గురయ్యాయన్నారు. దాదాపు కోటి హెక్టార్లలో పంటలు సాగవుతున్నాయని, వీటిలో 68 లక్షల హెక్టార్లకు పైగా పంటలు దెబ్బతిన్నాయి. ఎక్కువగా నాందేడ్ లో సుమారు 6.20 లక్షల హెక్టార్ల పంట నష్టం జరిగింది. వాషీం జిల్లాలో సుమారు 1.64 లక్షలు, యావత్మల్లో 1.64 లక్షలు, ధరాశివ్ 1.50 లక్షలు, బుల్దానా 89,782 హెక్టార్లు, అకొలలో 43,828 హెక్టార్లు, సొలాపూర్ లో 47,266, హింగోలిలో 40,000 హెక్టార్లు ప్రభావం చెందాయి. 2,059 రెవెన్యూ సర్కిళ్లలో ఇరవై తొమ్మిది జిల్లాలు, 253 తాలూకాలకు పరిహార ప్యాకేజీ అందిస్తామని ముఖ్యమంత్రి తెలిపారు. సహాయ ప్యాకేజీలో హెక్టారుకు రూ. 47,000 నగదు అందిస్తామని, ఉపాధి హామీ పథకం నుంచి హెక్టారుకు అదనంగా రూ.3 లక్షలు అందేలా చర్యలు తీసుకుంటామన్నారు. భారీ వర్షాల కారణంగా రైతులు తీవ్రంగా నష్టపోయారు. గ్రామీణ ప్రాంతాల్లో అయితే పశువులు, ఇళ్లు, తదితర మౌలిక సదుపాయాలు దెబ్బతిన్నాయన్నారు. వరదల వలన కొంతమంది మరణించారు. చాలా మంది గాయపడ్డారని, వారిని కూడా ఆదుకుంటామని భరోసానిచ్చారు.
దెబ్బతిన్న ఇండ్లకు ప్యాకేజీ
భారీ వర్షాలు, వరదల వలన కూలిపోయిన, పాక్షికంగా దెబ్బతిన్న ఇళ్లను నిర్మించడానికి మద్దతునిస్తామని, నష్టపోయిన దుకాణదారులకు కూడా రూ.50 వేలు ఇస్తామన్నారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఇళ్లను నిర్మించి ఇస్తామని తెలిపారు. ఎన్డీఆర్ఎఫ్ నిబంధనల ప్రకారం, కేవలం మూడు జంతువులకు మాత్రమే పరిహారం అందే వీలుంటుంది. కానీ రాష్ట్ర ప్రభుత్వం ఈ నిబంధనను రద్దు చేసి, చనిపోయిన ప్రతి జంతువుకు పరిహారం అందిస్తుందని ముఖ్యమంత్రి తెలిపారు. ఈ సందర్భంగా చెరుకు రైతులను ఆదుకుంటామని, మద్దతు ధర కల్పిస్తామని తెలిపారు. దీన్ని చెరుకు ఫ్యాక్టరీ యజమానులు వ్యతిరేకిస్తున్నారు. అయినా రైతుల ప్రయోజనం కోసం తదుపరి నిర్ణయాలు తీసుకుంటామని సీఎం వివరించారు.
