Let's talk: editor@tmv.in
ప్రతి రంగంలో బలమైన భారత్‌ను నిర్మించాలి: అజిత్ దోవల్

ప్రతి రంగంలో బలమైన భారత్‌ను నిర్మించాలి: అజిత్ దోవల్

Pinjari Chand
11 జనవరి, 2026

దేశ భద్రతను కేవలం సరిహద్దులకే పరిమితం చేయకుండా, ఆర్థిక, సామాజిక సహా ప్రతి రంగంలో భారత్‌ను బలంగా తీర్చిదిద్దాల్సిన అవసరం ఉందని జాతీయ భద్రతా సలహాదారు (ఎన్ఎస్ఏ) అజిత్ దోవల్ అన్నారు. గతంలో దేశం ఎదుర్కొన్న దాడులు, పరాధీనతతో కూడిన బాధాకరమైన చరిత్రకు ప్రతీకారం తీర్చుకోవాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు. శనివారం ఇక్కడ నిర్వహించిన వికసిత్ భారత్ యంగ్ లీడర్స్ డైలాగ్ ప్రారంభ కార్యక్రమంలో గౌరవ అతిథిగా పాల్గొన్న దోవల్, మహాత్మా గాంధీ, సుభాష్ చంద్రబోస్, భగత్ సింగ్ వంటి స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను గుర్తు చేస్తూ యువతకు సందేశం ఇచ్చారు. దేశవ్యాప్తంగా వచ్చిన సుమారు 3,000 మంది యువ ప్రతినిధులను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు.

సమరయోధుల త్యాగాల ఫలితమే

మీరు స్వతంత్ర భారతదేశంలో జన్మించడం మీ అదృష్టం. నేను పరాధీన భారతదేశంలో పుట్టాను. మన పూర్వీకులు స్వాతంత్ర్యం కోసం ఎన్నో కష్టాలు, బాధలు ఎదుర్కొన్నారని 81 ఏళ్ల ఐబీ మాజీ డైరెక్టర్ అయిన దోవల్ అన్నారు. భగత్ సింగ్ వంటి వారు ఉరిశిక్షకు గురయ్యారు, సుభాష్ చంద్రబోస్ జీవితాంతం పోరాటం చేశారు, మహాత్మా గాంధీ సత్యాగ్రహం చేశారు. వారి త్యాగాల ఫలితంగానే మనకు స్వేచ్ఛ లభించిందని చెప్పారు. ప్రతీకారం అనే పదం మంచిది కాదేమో కానీ, అది ఒక గొప్ప శక్తిగా మారుతుందని దోవల్ వ్యాఖ్యానించారు. మన చరిత్రకు ప్రతీకారం తీర్చుకోవాలి. సరిహద్దుల భద్రతలోనే కాకుండా, ఆర్థికంగా, సామాజిక అభివృద్ధిలో, ప్రతి రంగంలో భారత్‌ను మహోన్నతంగా తీర్చిదిద్దాలని స్పష్టం చేశారు.

ఈ సందర్భంగా యువతను భవిష్యత్ నాయకులుగా దోవల్ అభివర్ణించారు. బలమైన నాయకత్వం ఎంత కీలకమో చెప్పేందుకు నెపోలియన్ మాటలను ఉదహరించారు. నెపోలియన్ ‘గొర్రె నాయకత్వంలోని వెయ్యి సింహాలంటే నాకు భయం లేదు, కానీ సింహం నాయకత్వంలోని వెయ్యి గొర్రెలంటే నాకు భయం’. నాయకత్వం అంత కీలకం అని అన్నారు. ఈ తరహా నాయకత్వాన్ని ప్రధాని నరేంద్ర మోడీ ప్రదర్శిస్తున్నారని చెప్పారు. భారత సమాజం ఒకప్పుడు ప్రగతిశీల సమాజమని, ఇతర నాగరికతలపై లేదా వారి దేవాలయాలపై దాడులు చేయలేదని దోవల్ పేర్కొన్నారు. కానీ భద్రత విషయంలో మనకు స్వీయ అవగాహన లేకపోవడం వల్ల చరిత్ర మనకు గుణపాఠం చెప్పింది. ఆ పాఠాన్ని మనం నేర్చుకున్నామా? అని ప్రశ్నించారు. ఆ గుణపాఠాన్ని యువత మరిచిపోతే దేశానికి అది విషాదకరమని హెచ్చరించారు. యువత ఆ చరిత్రను గుర్తుంచుకోవాలి. అప్పుడే దేశ భవిష్యత్తు సురక్షితంగా ఉంటుందని ఆయన అన్నారు.