
ప్రతి జమ్మూకశ్మీర్ వాసి ఉగ్రవాది కాదు: ఒమర్ అబ్దుల్లా
ఢిల్లీలోని ఎర్రకోట సమీపంలో జరిగిన పేలుడుతో 12 మంది ప్రాణాలు కోల్పోవడంపై జమ్మూ–కశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఈ దారుణ చర్యను ఆయన తీవ్రంగా ఖండించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మానవత్వం ఉన్న మతం ఏదీ నిరపరాధుల రక్తపాతాన్ని కోరుకోదు. ఇది చాలా ఖండించదగిన విషయం. ఇంత దారుణంగా అమాయకులను చంపడాన్ని ఏ మతం కూడా సమర్థించదు. దర్యాప్తు కొనసాగుతుంది, కానీ మనం ఒక విషయం గుర్తుంచుకోవాలి. జమ్మూ కాశ్మీర్‌లో ఉన్న ప్రతి నివాసి ఉగ్రవాది కాదు. లేదా ఉగ్రవాదులతో సంబంధం ఉన్న వాళ్లు కాదు. జమ్మూ కాశ్మీర్‌లోని ప్రతి నివాసిని, ప్రతి కాశ్మీరీ ముస్లింను ఒకే భావజాలంతో చూసి, వారిలో ప్రతి ఒక్కరూ ఉగ్రవాది అని అనుకున్నప్పుడు, ప్రజలను సరైన మార్గంలో ఉంచడం కష్టమని సిఎం అబ్దుల్లా ఇక్కడ విలేకరులతో అన్నారు. శాంతి–సౌభ్రాతృత్వం కోరుకునే వారు కాదని భావించడం తప్పుడు ఆలోచన అని అన్నారు.
కొద్ది మంది మాత్రమే ఈ ప్రాంతంలో శాంతిని భ్రష్టు పట్టిస్తున్నారు. వారిని శిక్షించాలి, కానీ అమాయకులను అనవసరంగా ఇబ్బందులు పెట్టకూడదు. ప్రతి కశ్మీరీ ముస్లింను ఒకే తాటిపైకి తీసుకురావడ తప్పు. అలా చేస్తే సరైన మార్గంలో ఉన్నవారిని కూడా తప్పుదోవ పట్టించడమే అవుతుంది అని అన్నారు.
ఇక నిందితులు చదువుకున్న వర్గానికి చెందినవారని ప్రశ్నించగా, ఆయన తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఉన్నత చదువులు చదివిన వారే ఇలాంటి పనులు చేయరని ఎవరు చెప్పారు? ఇంతకు ముందు ప్రొఫెసర్లు, వైద్యులు కూడా ఇలాంటి ఘటనల్లో పట్టుబడ్డారు. ఒకసారి ఉద్యోగం నుంచి తొలగించారంటే సరిపోతుందా? ఆ తర్వాత విచారణ, చర్యలు ఎందుకు తీసుకోలేదు? అని ఆయన ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వానికి, భద్రతా బలగాలకు మేం పూర్తిగా సహకారం ఇస్తున్నాం. పరిస్థితి సాధారణంగా ఉండేలా కృషి చేస్తామని వివరించారు.
సమాచారం ప్రకారం, ఢిల్లీ పేలుడు కుట్రకు సంబంధించి జమ్మూకశ్మీర్‌కు చెందిన పలువురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ గుంపు దేశవ్యాప్తంగా పలు దాడులు జరపాలనే యత్నంలో ఉన్నట్లు అనుమానిస్తున్నారు. ప్రధాన నిందితుడు డాక్టర్ ఉమర్ ఉన్ నబీ ఢిల్లీలోకి బడార్పూర్ సరిహద్దు నుంచి కారులో ప్రవేశిస్తున్న సీసీటీవీ ఫుటేజ్ బయటపడింది. టోల్‌గేట్ వద్ద ఆగి డబ్బు చెల్లిస్తున్న దృశ్యాలు అందులో కనిపిస్తున్నాయి. దర్యాప్తు సంస్థలు ఉమర్, డాక్టర్ ముజమ్మిల్ వద్ద నుంచి స్వాధీనం చేసుకున్న డైరీల్లో నవంబర్ 8 నుంచి 12 వరకు దాడి ప్రణాళిక వివరాలు రాసి ఉన్నట్లు వెల్లడించాయి. అందులో జమ్మూకశ్మీర్, ఫరీదాబాద్ ప్రాంతాలకు చెందిన సుమారు 25 మంది పేర్లు ఉన్నట్లు సమాచారం.
