Let's talk: editor@tmv.in
ప్రతి ఏటా జూలైలో హైదరాబాద్‌లో ‘దావోస్’ ఫాలో-అప్ సదస్సు నిర్వహించాలి: సీఎం రేవంత్‌

ప్రతి ఏటా జూలైలో హైదరాబాద్‌లో ‘దావోస్’ ఫాలో-అప్ సదస్సు నిర్వహించాలి: సీఎం రేవంత్‌

Gaddamidi Naveen
22 జనవరి, 2026

వరల్డ్ ఎకనామిక్ ఫోరం వార్షిక సదస్సులో భాగంగా నిర్వహించిన “జాయిన్ ద రైజ్” కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక సంచలన ప్రతిపాదన చేశారు. ప్రతి ఏడాది జనవరిలో దావోస్‌లో జరిగే సదస్సుకు ఫాలో-అప్‌గా, ప్రతి జూలై లేదా ఆగస్టులో హైదరాబాద్‌లో ఒక ప్రత్యేక ఫోరమ్‌ను నిర్వహించాలని ఆయన కోరారు. ఆధునిక వ్యాపార ప్రపంచంలో పెట్టుబడి నిర్ణయాలకు ఏడాది కాలం చాలా ఎక్కువని, అందుకే ఆరు నెలలకోసారి సమీక్షా వేదిక అవసరమని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ ప్రతిపాదనకు గ్లోబల్ బిజినెస్ లీడర్ల నుంచి ఏకగ్రీవ మద్దతు లభించింది.

ఇటీవల నిర్వహించిన తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ అపూర్వ విజయాన్ని సాధించిందని సీఎం గుర్తు చేశారు. ఈ సదస్సు ద్వారా రూ.5.75 లక్షల కోట్లకు పైగా పెట్టుబడులు ఆకర్షించగలిగామని తెలిపారు. సాధారణంగా దావోస్ వేదికపై ఎంఓయూలు కుదుర్చుకుంటామని, అయితే ఈసారి గ్లోబల్ బిజినెస్ సమ్మిట్ విజయంతో రాష్ట్ర దృష్టి, విధానాలను ప్రపంచానికి వివరించడంపైనే దృష్టి పెట్టామని అన్నారు.

2025 డిసెంబరులో భారత్ ఫ్యూచర్ సిటీలో జరిగిన తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్‌లో 2047 దిశగా రాష్ట్ర వృద్ధి రూపరేఖను ప్రదర్శించడంతో పాటు తెలంగాణ ఏఐ ఇన్నోవేషన్ హబ్, తెలంగాణ నెక్స్ట్-జెన్ లైఫ్ సైన్సెస్ పాలసీ 2026–2030లను ఆవిష్కరించిన విషయాన్ని సీఎం గుర్తుచేశారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లో ఫాలో-అప్ ఫోరమ్ నిర్వహణపై వరల్డ్ ఎకనామిక్ ఫోరంతో చర్చలు ప్రారంభించామని సీఎం తెలిపారు.

మంత్రి శ్రీధర్ బాబు, మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సభ్యులుగా ఉన్న ప్రతినిధి బృందం రహదారులు, మెట్రో విస్తరణ, నదులు, సరస్సుల పునరుజ్జీవనం వంటి కీలక ప్రాజెక్టులను వివరించింది. కొత్త ఆర్థిక మండలాలు, కొత్త నగర అభివృద్ధి, మాన్యుఫ్యాక్చరింగ్ జోన్‌లతో తెలంగాణను ‘చైనా+1’ ప్రత్యామ్నాయంగా తీర్చిదిద్దే ప్రణాళికలను వెల్లడించింది.

హైదరాబాద్ గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్లకు కేంద్రంగా ఎదిగిందని, ముసీ నది ఇరువైపులా నైట్ టైమ్ ఎకానమీతో 24 గంటల నగరంగా అభివృద్ధి చేస్తున్నామని సీఎం తెలిపారు. 30 వేల ఎకరాల్లో 50 శాతం గ్రీన్ కవర్‌తో భారత్ ఫ్యూచర్ సిటీని ప్రపంచ స్థాయి స్మార్ట్ సిటీగా తీర్చిదిద్దుతున్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ నటుడు చిరంజీవి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.