Let's talk: editor@tmv.in
ప్రతి ఎకరాకూ సాగునీరే లక్ష్యం: సీఎం

ప్రతి ఎకరాకూ సాగునీరే లక్ష్యం: సీఎం

Panthagani Anusha
7 ఫిబ్రవరి, 2026

ఆంధ్రప్రదేశ్‌ను అగ్రగామి వ్యవసాయ రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు సమర్థవంతమైన నీటి సంరక్షణే ఏకైక మార్గమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. ప్రతి ఎకరాకు సాగునీరు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని, ఇందులో నీటి వినియోగదారుల సంఘాలు అత్యంత కీలక పాత్ర పోషించాలని ఆయన పిలుపునిచ్చారు. రాష్ట్రంలో అందుబాటులో ఉన్న ప్రతి నీటి చుక్కను ఒడిసిపట్టాల్సిన అవసరం ఉందని వృథాగా పోతున్న ప్రవాహాలను అడ్డుకుని రిజర్వాయర్లు, చెరువులను నింపడంతో పాటు భూగర్భ జల నిల్వలను పెంచాలని సూచించారు. భూమినే ఒక భారీ రిజర్వాయర్‌గా మార్చాలన్నది తమ ప్రభుత్వ సంకల్పమని, దీనివల్ల కరువు కాలంలోనూ సాగునీరు అందుబాటులో ఉంటుందని సీఎం ఆకాంక్షించారు. ఈ మేరకు గురువారం గురువారం జరిగిన నీటి వినియోగదారుల సంఘాల రాష్ట్ర స్థాయి సమావేశంలో ముఖ్యమంత్రి ప్రసంగిస్తూ కీలక విషయాలను వెల్లడించారు.

రాయలసీమ అభివృద్ధిపై ప్రత్యేకంగా దృష్టి సారించిన చంద్రబాబు గతంలో ఆ ప్రాంతంలో ఊట కాలువలు నీటితో కళకళలాడేవని గుర్తుచేశారు. రాయలసీమ రాతి నేలగా మిగిలిపోకూడదనే ఉద్దేశంతోనే హంద్రి–నీవా, గాలేరు–నాగరి వంటి భారీ ప్రాజెక్టులను కూటమి ప్రభుత్వ హయాంలోనే పరుగులు పెట్టించామన్నారు. ముఖ్యంగా తెలుగు గంగ ప్రాజెక్టు ద్వారా రాయలసీమను సస్యశ్యామలం చేయడమే కాకుండా చెన్నై నగర తాగునీటి అవసరాలను తీర్చి పొరుగు రాష్ట్రంతో ఉన్న సత్సంబంధాలను చాటుకున్నామని పేర్కొన్నారు. ఒకప్పుడు ఎడారిని తలపించిన అనంతపురం జిల్లా నేడు పండ్ల తోటల కేంద్రంగా మారిందని, రానున్న రోజుల్లో ఆ జిల్లాను అంతర్జాతీయ స్థాయి హార్టికల్చర్ హబ్‌గా తీర్చిదిద్దుతామని ధీమా వ్యక్తం చేశారు.

నీటి సంరక్షణ కోసం గతంలో తాము చేపట్టిన ‘నీరు–మీరు’, ‘నీరు–చెట్టు’ కార్యక్రమాలు అద్భుత ఫలితాలనిచ్చాయని చంద్రబాబు గుర్తు చేశారు. అనంతపురం జిల్లాలో అమలు చేసిన నీటి సంరక్షణ పద్ధతులను ప్రధాని నరేంద్ర మోదీ సైతం ‘మన్‌కీ బాత్’లో ప్రశంసించారని ఈ సందర్భంగా గుర్తు చేశారు. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 10 లక్షల సోక్‌పిట్ల ఏర్పాటు, డ్రిప్, స్ప్రింక్లర్ వంటి సూక్ష్మ సాగునీటి పద్ధతుల వినియోగం ద్వారా నీటి వృథాను అరికడుతున్నామని తెలిపారు. రాష్ట్రంలోని 40 నదుల నీటిని అనుసంధానించి సమర్థంగా వాడుకుంటే రాష్ట్రంలో కరువు అనే మాటే ఉండదని చివరి ఆయకట్టు రైతుకూ సమానంగా నీరు అందేలా చూడాల్సిన బాధ్యత నీటి వినియోగదారుల సంఘాలు దేనని సీఎం స్పష్టం చేశారు.

ప్రతి ఎకరాకూ సాగునీరే లక్ష్యం: సీఎం - Tholi Paluku