
ప్రతి ఇంటి అమ్మాయి పారిశ్రామికవేత్తగా ఎదగాలి: చంద్రబాబు
రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడంలో మహిళా పారిశ్రామికవేత్తలు కీలక పాత్ర పోషిస్తారని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. ఆదివారం అమరావతి పరేడ్ గ్రౌండ్స్‌లో నిర్వహించిన అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆయన మాట్లాడుతూ మహిళలు కృషి, ప్రేమ, త్యాగానికి నిలువెత్తు రూపాలని వారిని గౌరవించి సాధికారత కల్పించిన సమాజం మాత్రమే నిజమైన అభివృద్ధిని సాధిస్తుందని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా దేశవ్యాప్తంగా ఉన్న మహిళా లోకానికి ఆయన శుభాకాంక్షలు తెలియజేశారు.
రాష్ట్రంలో మహిళా పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం నిర్దిష్ట లక్ష్యాలతో ముందుకు సాగుతోందని ముఖ్యమంత్రి వెల్లడించారు. ఇప్పటికే ఒక లక్ష మందిని పారిశ్రామికవేత్తలుగా మార్చాలని లక్ష్యంగా పెట్టుకోగా ఆ అంచనాలను మించి ప్రస్తుతం 1.1 లక్షల మంది మహిళలు సూక్ష్మ, చిన్న, మధ్య తరహా వ్యాపారాలను విజయవంతంగా నిర్వహిస్తున్నారని ఆయన హర్షం వ్యక్తం చేశారు. ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లో 34 వేల వ్యాపార సంస్థలు మహిళల సారథ్యంలో నడుస్తుండటం శుభపరిణామమని వచ్చే ఏడాది నాటికి కొత్తగా మరో 5 లక్షల మంది మహిళా పారిశ్రామికవేత్తలను తయారు చేయడమే తమ ప్రభుత్వ తదుపరి లక్ష్యమని ఆయన ప్రకటించారు.
డ్వాక్రా సంఘాల ప్రాముఖ్యతను వివరిస్తూ రాష్ట్రవ్యాప్తంగా 8.3 లక్షల స్వయం సహాయక సంఘాల్లో దాదాపు 84 లక్షల మంది సభ్యులు ఉన్నారని చంద్రబాబు తెలిపారు. మహిళలు సహజంగానే అద్భుతమైన ఆర్థిక నిర్వహణా నైపుణ్యాలు కలిగి ఉంటారని ఇంటి బడ్జెట్‌ను సమర్థంగా నిర్వహించే వారే రేపటి ఆర్థిక మంత్రులుగా రాణిస్తారని పేర్కొన్నారు. మహిళా సంఘాల ఉత్పత్తులకు అంతర్జాతీయ గుర్తింపు తెచ్చేందుకు 'స్వయం బ్రాండ్' ను ప్రతిష్టాత్మకంగా అభివృద్ధి చేస్తామని, దీని ద్వారా మార్కెట్ ప్రాప్తిని విస్తరింపజేస్తామని భరోసా ఇచ్చారు.
రాజకీయంగా కూడా మహిళలకు పెద్దపీట వేయాల్సిన అవసరం ఉందని చట్టసభల్లో 33 శాతం రిజర్వేషన్ల ద్వారా వారికి తగిన ప్రాతినిధ్యం లభిస్తుందని సీఎం పేర్కొన్నారు. భారతదేశంలో ఒక గిరిజన మహిళ రాష్ట్రపతిగా మరొక మహిళ ఆర్థిక మంత్రిగా దేశాన్ని నడిపించడం వారి సామర్థ్యానికి నిదర్శనమని అన్నారు. అదేవిధంగా త్వరలోనే ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు మహిళా చీఫ్ జస్టిస్ వచ్చే అవకాశం ఉందని ఆయన ఈ సందర్భంగా సూచనప్రాయంగా తెలిపారు.
మహిళల రక్షణ విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదని గత ఐదేళ్ల పాలనలో గంజాయి, బ్లేడ్ గ్యాంగ్‌ల వల్ల ఆడబిడ్డలకు భద్రత కరువైందని విమర్శిస్తూ ఇకపై మహిళలను ఇబ్బంది పెట్టే వారిపై ఉక్కుపాదం మోపుతామని స్పష్టం చేశారు. "నా కుటుంబంలోని మహిళల్లాగే రాష్ట్రంలోని ప్రతి ఇంటి అమ్మాయి పారిశ్రామికవేత్తగా ఎదగాలన్నదే నా ఆశ" అని చంద్రబాబు ఆకాంక్షించారు.
