
ప్రతి ఇంటికి తాజా, ఆరోగ్యకరమైన పాల ఉత్పత్తులందించడమే మా లక్ష్యం: నారా భువనేశ్వరి
హెరిటేజ్ ఫుడ్స్ ఉత్పత్తుల నాణ్యతపై గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో జరుగుతున్న అసత్య ప్రచారాలపై సంస్థ వైస్ చైర్‌పర్సన్, మేనేజింగ్ డైరెక్టర్ నారా భువనేశ్వరి తీవ్రంగా స్పందించారు. సంస్థ ప్రతిష్టను దెబ్బతీసేలా రాజకీయ ప్రేరేపిత ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో ఆమె గురువారం రాత్రి ‘ఎక్స్’ (ట్విట్టర్) వేదికగా ఒక వీడియో సందేశాన్ని విడుదల చేశారు. ప్రతి ఇంటికి తాజా స్వచ్ఛమైన ఆరోగ్యకరమైన పాల ఉత్పత్తులను అందించడమే తమ సంస్థ ప్రథమ లక్ష్యమని ఆమె పునరుద్ఘాటించారు.
25 దశల్లో నాణ్యత పరీక్షలు
తమ సంస్థలో నాణ్యత ప్రమాణాల విషయంలో ఎక్కడా రాజీ పడే ప్రసక్తే లేదని భువనేశ్వరి స్పష్టం చేశారు. "హెరిటేజ్ సంస్థ నుండి బయటకు వచ్చే ప్రతి ఉత్పత్తి దాదాపు 25 రకాల కఠినమైన నాణ్యత పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియను 500 మందికి పైగా నిపుణులు అడుగడుగునా పర్యవేక్షిస్తారు. ప్రభుత్వం నిర్దేశించిన ప్రమాణాల కంటే కఠినమైన భద్రత, పరిశుభ్రత విధానాలను మేము పాటిస్తున్నాం అని ఆమె పేర్కొన్నారు. అత్యాధునిక సాంకేతికతతో అత్యున్నత ప్రమాణాలతో ఉత్పత్తులను సిద్ధం చేస్తున్నట్లు పేర్కొన్నారు.
తిరుమల తిరుపతి దేవస్థానానికి నెయ్యి సరఫరా చేసిన వివాదాస్పద సంస్థతో హెరిటేజ్‌కు సంబంధం ఉందంటూ వస్తున్న వార్తలను ఆమె పూర్తిగా ఖండించారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కుటుంబం ప్రమోట్ చేసిన సంస్థ కావడంతోనే ప్రతిపక్షాలు కావాలని లక్ష్యంగా చేసుకుని దుష్ప్రచారం చేస్తున్నాయని మండిపడ్డారు. రూ.4 లక్షల పెట్టుబడితో ప్రారంభమైన హెరిటేజ్ నేడు రూ. 4,000 కోట్ల టర్నోవర్‌కు చేరిందంటే అది కేవలం వినియోగదారుల నమ్మకం,మేము అందెంచె నాణ్యత వల్లనే సాధ్యమైందని ఆమె గుర్తుచేశారు.
ప్రస్తుతం తొమ్మిది రాష్ట్రాల్లో సుమారు 3 లక్షల మంది పాడి రైతులతో కలిసి హెరిటేజ్ పనిచేస్తోందని భువనేశ్వరి తెలిపారు. రైతులకు సరసమైన ధరలు కల్పించడం, పారదర్శకమైన విధానాలతో సకాలంలో చెల్లింపులు చేయడమే తమ వ్యవస్థకు వెన్నెముక అని పేర్కొన్నారు. రైతుల సంక్షేమం, వినియోగదారుల ఆరోగ్యమే తమ లక్ష్యాలని ఈ ప్రయాణంలో ఎటువంటి అడ్డంకులు ఎదురైనా వెనక్కి తగ్గేది లేదని స్పష్టం చేశారు. తప్పుడు ప్రచారాలను నమ్మే ముందు వాస్తవాలను పరిశీలించాలని ఆమె ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
