
ప్రతి ఇంటికి కాంగ్రెస్ పార్టీ బాకీ పడింది
కాంగ్రెస్ పార్టీ ప్రజలకు వేలకోట్ల రూపాయలు బాకీ పడింది. పథకాల పేరుచెప్పి ఓట్లు వేయించుకుని ఇప్పుడు ఎగ్గొడుతోంది. దీంతో తెలంగాణలోని ప్రతి వ్యక్తికీ.. ప్రతి ఇంటికి కాంగ్రెస్ పార్టీ డబ్బు బాకీ పడిందని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. ముందు ఆ బాకీ డబ్బులు ఇచ్చాకనే ఓట్లు అడగాలని అయన డిమాండ్ చేసారు.
సిద్దిపేట క్యాంప్ కార్యాలయంలో అయన కాంగ్రెస్ బాకీ కార్డు విడుదల చేసారు. అనంతరం జరిగిన సభలో కాంగ్రెస్ తీరును అయన ఎండగట్టారు.
ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఏం బాకీ పడింది? ఒక్కొక్క మహిళకు ఎంత బాకీ పడింది? ఒక్కొక్క రైతుకు ఎంత బాగి పడింది? ఒక్కొక్క ఇంటికి ఎంత బాకీ పడ్డదో తెలిసేలా బాకీ కార్డు విడుదల చేస్తున్నాం. వివిధ ప్రాంతాల్లో పనిచేస్తున్న వారు పండుగకు ఊర్లకు వస్తారు. ఈ తరుణంలో సిద్దిపేట నియోజకవర్గంలో ప్రతి ఇంటికి బాకీ కార్డు పంపిణీ చేయాలి. గ్రామ నాయకులు, గ్రామ శాఖ అధ్యక్షులు, మాజీ సర్పంచులు, ఎంపీటీసీలు, సీనియర్ నాయకులు అందరు కలిసి ప్రతి ఇంటికి పోయి ఈ బాకీ కార్డుని అందజేసి కాంగ్రెస్ పార్టీ ఆ ఇంటికి ఎంత బాకీ పడిందో వివరించాలి. కాంగ్రెస్ మోసాలను, కాంగ్రెస్ పాలనను ఎండగట్టాలి. ప్రతి ఇంట్లో ఈ చర్చ జరగాలి. ' అని కార్యకర్తలకు సూచించారు.
''రైతుబంధు రూ. 15000 ఇస్తామన్నారు..పోయిన వానకాలం రైతు బంధు మొత్తానికే ఎగ్గొట్టిండు. పోయిన యాసంగిలో మూడెకరాల వారికి ఇచ్చిండు మిగతా వాళ్లందరికీ ఎగ్గొట్టిండు. ఇప్పుడు పంచాయతీ ఎన్నికలు ఉన్నాయని రూ. 12,000 ఇచ్చిండు. మిగతా మూడు వేలు ఎగ్గొట్టిండు. ప్రతి రైతుకు కాంగ్రెస్ పార్టీ రూ. 75 వేలు రైతుబంధు బాకీ పడింది. రైతుబంధు రైతుకి ఇస్తాం. కౌలు రైతుకి ఇస్తామన్నారు. ఒక రూపాయి అయినా కౌలు రైతుకు ఇచ్చారా? కరోనా వచ్చినా కేసీఆర్ గారు ఎమ్మెల్యేలు, మంత్రుల జీతాలు బంద్ పెట్టిండు గాని రైతులకు రైతుబంధు ఆపలేదు.
పెద్ద పెద్ద రైతులకు మాత్రమే కేసీఆర్ రైతు బంధు ఇస్తున్నారు అని అన్నీ అబద్దాలే అన్నాడు. మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏం చేస్తున్నాడు.రాష్ట్రంలో సీలింగ్ ఉంది. 54 ఎకరాల కంటే ఎవరికీ ఎక్కువ భూమి ఉండదు. 25 ఎకరాల మీద ఎంతమందికి తెలంగాణలో భూమి ఉంది అని లెక్క తీస్తే మూడు శాతం మాత్రమే ఉన్నారు. 97 శాతం మంది రైతులు 10 ఎకరాల లోపే ఉన్నారు. కుర్చీలో కూర్చుంటే కేసీఆర్ చేసింది కరెక్ట్ అని రేవంత్ రెడ్డికి అర్థమైంది. 200 ఉన్న పెన్షన్ ని కేసీఆర్ 2000 చేసిండు.
కాంగ్రెస్ 4000 పెన్షన్ ఇస్తా అన్నది ఈరోజు వరకు లేదు.'' అని హరీష్ వివరించారు. ఇంకా హరీష్ మాట్లాడుతూ అత్తకు, కోడలు ఇద్దరికీ ఇస్తామన్నారు. రేవంత్ రెడ్డివి అన్నీ గజినీకాంత్ మాటలు.. ఇంటికొక మహిళకు రేవంత్ రెడ్డి రూ. 44వేలు బాకీ పడిండు. 44000 ఇచ్చినంకనే కాంగ్రెస్ వాళ్ళు ఎవరైనా ఓటు అడగాలి. అంతా మోసం. గాంధీల మాట చెప్పి సంతకాలు పెట్టి బాండ్ పేపర్ రాసిచ్చి ఇంటింటికి పంచిన్రు.
ఒక దిక్కు రేవంత్ రెడ్డి సంతకం, మరోదిక్కు భట్టి విక్రమార్క సంతకం పెట్టి గ్యారంటీ పేపర్లు పంచిర్రు. 100 రోజుల్లో ఇస్తామని చెప్పి 700 రోజులైనా ఇప్పటివరకు ఒక్క హామీ నెరవేర్చలేదు. ఇచ్చిన హామీల అమలు గురించి ఎవరైనా అడుగుతారేమో అని రాహుల్ గాంధీ తెలంగాణ ముఖం చూడట్లేదు. రేవంత్ రెడ్డిని ఎవడు నమ్మిటట్టు లేడని రాహుల్ గాంధీ వచ్చి మాటిచ్చాడు. 4,000 పెన్షన్ ఇప్పిచ్చే గ్యారెంటీ నాది అన్నాడు రాహుల్ గాంధీ. వందరోజుల్లో హామీలు అమలు చేస్తామన్నావు ఏమైంది. ' అంటూ హరీష్ నిలదీశారు.
