Let's talk: editor@tmv.in
ప్రతిభ సామాన్య ప్రజల్లో కూడా ఉంది: శరద్‌పవార్

ప్రతిభ సామాన్య ప్రజల్లో కూడా ఉంది: శరద్‌పవార్

Pinjari Chand
15 డిసెంబర్, 2025

ప్రత్యేకమైన సామాజిక లేదా ఆర్థిక నేపథ్యాలు ఉన్నవారికే ప్రతిభ, నాయకత్వం పరిమితం కాదని ఎన్సీపీ (ఎస్పీ) అధ్యక్షుడు శరద్ పవార్ స్పష్టం చేశారు. సాధారణ కుటుంబాల నుంచి వచ్చిన ప్రతిభావంతులను గుర్తించి, వారికి తగిన అవకాశాలు కల్పిస్తే సమాజంలో సానుకూల మార్పు సాధ్యమవుతుందని అన్నారు. ఆదివారం యశ్వంత్‌రావు చవాన్ సెంటర్‌లో నిర్వహించిన ‘శరద్ పవార్ ఇన్‌స్పైర్ ఫెలోషిప్’ అవార్డుల కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఈ ఫెలోషిప్ యశ్వంత్‌రావు చవాన్ జీవితం, విలువలను ఆధారంగా చేసుకుని రూపొందించారని తెలిపారు. ఫెలోషిప్ కార్యక్రమం ద్వారా మహారాష్ట్ర అంతటా అటువంటి వ్యక్తులను గుర్తించి, వారు ఎదగడానికి ఒక వేదికను ఇచ్చినందుకు యశ్వంతరావు చవాన్ ప్రతిష్ఠాన్ చేసిన కృషిని ఆయన ప్రశంసించారు.

చవాన్ సాధారణ నేపథ్యం నుంచి వచ్చి మహారాష్ట్ర తొలి ముఖ్యమంత్రిగా, కేంద్ర రక్షణ, ఆర్థిక, విదేశాంగ మంత్రిగా దేశానికి సేవలందించారని గుర్తు చేశారు. ప్రతిభ కొద్దిమందికే సొంతమయ్యే ఆస్తి కాదు. అది సామాన్య ప్రజల్లో కూడా ఉందని పవార్ అన్నారు.

వ్యవసాయం రంగంలోనూ ఏఐ ప్రాధాన్యత పెరుగుతోంది

వ్యవసాయ రంగంలో కృత్రిమ మేధస్సు (ఏఐ) ప్రాధాన్యత పెరుగుతోందని పేర్కొన్న ఆయన, ఏఐ ఆధారిత సాంకేతికతల ద్వారా నీరు, ఎరువుల వినియోగం తగ్గించి 25–30 శాతం వరకు పంట దిగుబడి పెంచవచ్చని తెలిపారు. నాసిక్ జిల్లాలోని సహ్యాద్రి ఫార్మర్స్ ప్రొడ్యూసర్ కంపెనీ ఉదాహరణను ప్రస్తావిస్తూ, సమిష్టి ప్రయత్నాలతో యువ రైతులను వ్యవస్థాపకులుగా తీర్చిదిద్దిన విధానాన్ని ప్రశంసించారు.ఫెలోషిప్ అవార్డు గ్రహీతలను అభినందించిన పవార్, గ్రామం నుంచి జిల్లా స్థాయి వరకు మార్పు తీసుకురావడంలో వారు కీలక పాత్ర పోషిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. మంచి పనులతో పాటు బలమైన సంస్థలను నిర్మించడంపై దృష్టి పెట్టాలని సూచించారు.

కార్యక్రమం అనంతరం మీడియాతో మాట్లాడిన ఎన్సీపీ (ఎస్పీ) వర్కింగ్ ప్రెసిడెంట్ సుప్రియా సూలే, వచ్చే ఏడాది నుంచి ఈ ఫెలోషిప్‌ను మహిళలకే ప్రత్యేకంగా ప్రారంభించనున్నట్లు తెలిపారు. వ్యవసాయం, విద్య, సామాజిక మార్పు వంటి రంగాలపై దృష్టి సారిస్తుందని చెప్పారు.

శక్తి బిల్లు తేస్తే కేంద్రానికి మద్దతిస్తాం

ఇటీవల ముగిసిన రాష్ట్ర శాసనసభ శీతాకాల సమావేశాలపై విమర్శలు గుప్పించిన సూలే, కీలక అంశాలపై సరైన చర్చ జరగలేదన్నారు. మహిళలపై నేరాలు, వరకట్న మరణాలు పెరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేస్తూ, ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ బలమైన విధాన నిర్ణయాలు తీసుకోవాలని కోరారు. సామాజిక మార్పు తీసుకురావడానికి పార్టీలకు అతీతంగా ఐక్యత సాధించాలని ఆమె పిలుపునిచ్చారు, ఇటువంటి అంశాలపై ప్రతిపక్షంతో కలిసి పనిచేయడంలో పాలక వర్గం ముందుండాలని అన్నారు. ప్రతిపాదిత శక్తి చట్టాన్ని ప్రస్తావిస్తూ మోడీ నేతృత్వంలోని ప్రభుత్వం 11 సంవత్సరాలుగా అధికారంలో ఉందని, అయితే ఈ చట్టాన్ని ఇంకా పార్లమెంటు ముందుకు తీసుకురాలేదని సూలే తెలిపారు. కేంద్రం పార్లమెంటులో బిల్లు తీసుకువస్తే తమ పార్టీ పూర్తిగా మద్దతిస్తుందని స్పష్టం చేశారు.

ప్రతిభ సామాన్య ప్రజల్లో కూడా ఉంది: శరద్‌పవార్ - Tholi Paluku