Let's talk: editor@tmv.in
ప్రతిభావంతులైన భారతీయుల వల్ల అమెరికా ఎంతో లాభపడింది: ఎలాన్ మస్క్

ప్రతిభావంతులైన భారతీయుల వల్ల అమెరికా ఎంతో లాభపడింది: ఎలాన్ మస్క్

Shaik Mohammad Shaffee
2 డిసెంబర్, 2025

ప్రపంచ కుబేరుడు, స్పేస్‌ఎక్స్, టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్ హెచ్-1బీ వీసా కార్యక్రమానికి గట్టి మద్దతు ఇచ్చారు. భారతదేశం నుండి అమెరికాకు వస్తున్న టాలెంటెడ్ నిపుణులతో అమెరికా అపారంగా లాభపడిందని ఆయన స్పష్టం చేశారు. ఈ విషయాన్ని మస్క్, జెరోధా సహ వ్యవస్థాపకుడు నిఖిల్ కామత్ 'పీపుల్ బై డబ్ల్యూటీఎఫ్' అనే పోడ్‌కాస్ట్‌లో తెలియజేశారు. "అమెరికాకు వచ్చిన ప్రతిభావంతులైన భారతీయుల వల్ల అమెరికాకు ఎంతో ప్రయోజనం చేకూరింది" అని మస్క్ చెప్పారు. ఈ వీసా కార్యక్రమాన్ని పూర్తిగా నిలిపివేయడం అమెరికాకు చాలా నష్టాన్ని కలిగిస్తుందని ఆయన హెచ్చరించారు.

హెచ్-1బీ వీసా కార్యక్రమాన్ని కొన్ని ఔట్‌సోర్సింగ్ కంపెనీలు దుర్వినియోగం చేస్తున్న మాట నిజమేనని మస్క్ అంగీకరించారు. "వ్యవస్థను దుర్వినియోగం చేయడాన్ని మనం ఆపాలి" అని చెప్పారు. అయితే ఈ కారణంగా మొత్తం హెచ్-1బీ కార్యక్రమాన్నే మూసివేయాలని భావించే ఆలోచనను తాను గట్టిగా వ్యతిరేకిస్తున్నట్లు తెలిపారు. "కొందరు ఈ కార్యక్రమాన్ని మూసివేయాలని కోరుకుంటున్నారు. కానీ, అలా చేయడం అమెరికాకు ఎంత నష్టమో వారు గ్రహించడం లేదు" అని మస్క్ వ్యాఖ్యానించారు.

హెచ్-1బీ వీసా అనేది, స్పెషాలిటీ వృత్తుల్లో, అంటే ఇంజనీరింగ్, ఐటీ, వైద్యం వంటి ప్రత్యేక నైపుణ్యం అవసరమయ్యే ఉద్యోగాలలో విదేశీ నిపుణులను తాత్కాలికంగా నియమించుకోవడానికి అమెరికా కంపెనీలకు అవకాశం ఇస్తుంది. ఈ వీసాదారులలో భారతీయులే అత్యధికంగా ఉంటారు.

వీసా సంస్కరణలు, వలస విధానాలపై భిన్న వాదనలు

అమెరికా ప్రభుత్వం హెచ్-1బీ వీసా దుర్వినియోగాన్ని అరికట్టేందుకు చర్యలు తీసుకుంటున్న సమయంలో మస్క్ ఈ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. సెప్టెంబర్‌లో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కొత్త హెచ్-1బీ వీసాలపై ఏకంగా లక్ష డాలర్లు వన్‌-టైమ్ ఫీజు విధించే ప్రతిపాదన చేశారు. ఇది భారతీయ నిపుణులపై ప్రభావం చూపింది.

అమెరికా వలస వ్యతిరేక దేశంగా మారుతోందా అనే ప్రశ్నకు మస్క్ బదులిస్తూ, ఈ అంశంపై భిన్నమైన ఆలోచనా విధానాలు ఉన్నాయని, ఎవరిలోనూ ఏకాభిప్రాయం లేదని తెలిపారు. అయితే జో బైడెన్ పరిపాలనలో సరిహద్దు నియంత్రణలు లేకుండా వలసలు విపరీతంగా పెరిగాయని ఆయన ఆరోపించారు. సరిహద్దు నియంత్రణ లేకపోతే, అదొక దేశం అనిపించుకోదని మస్క్ స్పష్టం చేశారు.

కొందరేమో విదేశీయులు అమెరికా ఉద్యోగాలను లాగేసుకుంటున్నారని ఆందోళన చెందుతుంటే, మస్క్ మాత్రం తన అనుభవంలో సమర్థులైన నిపుణుల కొరత ఎప్పుడూ ఉంటుందని చెప్పారు. తన కంపెనీల్లో ప్రపంచంలోనే అత్యంత ప్రతిభావంతులైన వ్యక్తులను నియమించుకుంటున్నామని, వారికి మార్కెట్ సగటు కంటే ఎక్కువ వేతనం ఇస్తున్నామని తెలిపారు.

యువ భారతీయ పారిశ్రామికవేత్తలకు మస్క్ సందేశం

యువ భారతీయ పారిశ్రామికవేత్తలకు మస్క్ ఒక కీలక సందేశం ఇచ్చారు. "మీరు తీసుకునే దానికంటే ఎక్కువగా అందించడానికి ప్రయత్నించండి. సమాజానికి ఉపయోగపడే వ్యక్తిగా ఉండండి. మీరు ఏదైనా విలువైనదాన్ని సృష్టించాలనుకుంటే, ఉపయోగకరమైన ఉత్పత్తులు, సేవలు అందించడానికి ప్రయత్నించండి. అలా చేస్తే డబ్బు అనేది దానికదే వస్తుంది” అని మస్క్ సూచించారు.