
ప్రతిభకు వైకల్యం అడ్డుకాదు: ఎమ్మెల్యే గళ్ళా మాధవి
కంటి చూపు లేకపోయినా అచంచల ఆత్మవిశ్వాసంతో మైదానంలో దూసుకుపోతున్న అంధుల క్రికెట్ క్రీడాకారుల ప్రతిభ సమాజానికి స్ఫూర్తిదాయకమని గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గళ్ళా మాధవి పేర్కొన్నారు. నగరంలోని 52వ డివిజన్ అరండల్‌పేట పిచ్చుకలగుంట మైదానంలో ఆంధ్రప్రదేశ్ అంధుల అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఇంటర్ స్టేట్ క్రికెట్ టోర్నమెంట్‌ను ఆమె సోమవారం ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఎమ్మెల్యే మాట్లాడుతూ విభిన్న ప్రతిభావంతుల కోసం ఇలాంటి క్రీడా వేదికలను సిద్ధం చేయడం అభినందనీయమన్నారు. అంధుల క్రికెట్‌ను ప్రత్యక్షంగా వీక్షించాలనే ఆసక్తితో ఈ కార్యక్రమానికి హాజరయ్యానని శారీరక వైకల్యం అనేది కేవలం శరీరానికే పరిమితం తప్ప ప్రతిభకు కాదని క్రీడాకారులు నిరూపిస్తున్నారని ఆమె ప్రశంసించారు.
ఇక ఈ టోర్నీలో ఆంధ్రప్రదేశ్, మధ్యప్రదేశ్ జట్లు తలపడటం విశేషమని గెలుపు–ఓటముల కంటే పట్టుదలతో ఆడటమే ముఖ్యమని క్రీడాకారులకు సూచించారు. అంధుల క్రికెట్‌లో భారతదేశం వరల్డ్ కప్ సాధించడం దేశానికి గర్వకారణమని గుర్తుచేశారు. అర్జున అవార్డు గ్రహీత అజయ్ వంటి క్రీడాకారులు అంతర్జాతీయ స్థాయిలో అంధుల క్రికెట్‌కు గుర్తింపు తీసుకువచ్చారని నేటి తరం వారిని ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు.
కాగా పారా ఒలింపిక్స్ వంటి వేదికలపై విభిన్న ప్రతిభావంతులు విశేష ప్రతిభ కనబరుస్తున్నారని ఇలాంటి క్రీడలకు ప్రభుత్వం, సమాజం నుంచి మరింత ప్రోత్సాహం అందాల్సిన అవసరం ఉందన్నారు. అంధుల క్రికెట్ అసోసియేషన్ చేస్తున్న కృషిని అభినందిస్తూ ఇలాంటి టోర్నమెంట్ల నిర్వహణకు స్వచ్ఛంద సంస్థలు, దాతలు పెద్ద ఎత్తున ముందుకు రావాలని పిలుపునిచ్చారు.
