Let's talk: editor@tmv.in
ప్రతిపక్షాలు చదవకుండానే పరీక్షలు రాయాలనుకుంటున్నాయి: నఖ్వీ

ప్రతిపక్షాలు చదవకుండానే పరీక్షలు రాయాలనుకుంటున్నాయి: నఖ్వీ

Pinjari Chand
30 నవంబర్, 2025

ఉత్తరప్రదేశ్‌లోని రాంపూర్‌లో ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ (ఎస్ఐఆర్) పై ప్రతిపక్షాలు లేవనెత్తుతున్న ఆరోపణలపై బిజెపి సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి ముఖ్తార్ అబ్బాస్ నఖ్వీ శనివారం తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ప్రతిపక్షాలను ‘చదువుకోకుండానే పరీక్ష రాయాలనుకునే విద్యార్థులతో’ పోల్చారు. విఫలమైతే ప్రశ్నపత్రం తప్పని, పరీక్షకుడిపై నిందలు వేస్తారని ఎద్దేవా చేశారు. వీరు చదువుకోకుండానే పరీక్షల్లో ఉత్తీర్ణులవ్వాలనుకునే విద్యార్థిలా ప్రవర్తిస్తున్నారు. విద్యార్థి సామర్థ్యం లేకుండా పదోన్నతి, సర్టిఫికెట్ కోరుకుంటాడు. అతను విఫలమైతే, ప్రశ్నాపత్రం సిలబస్ లో లేని అంశాలు అడిగారని చెప్పి తన అసమర్థతను కప్పిపుచ్చుకుంటాడని, అలాగే ప్రతిపక్షాలు కూడా అని విమర్శించారు.

బ్యాచిలర్ ఆఫ్ డిఫీట్ వీరికి వరం

ఇక్కడ బూత్ లెవల్ ఆఫీసర్ (బీఎల్వో) కి తన ఓటరు ధృవీకరణ ఫారమ్‌ను సమర్పించిన తర్వాత నఖ్వీ విలేకరులతో మాట్లాడారు. బీఏ, బీకాం, బీఎస్సీ కాదు వీరికి బీడీ బ్యాచిలర్ ఆఫ్ డిఫీట్ (ఓటమిలో డిగ్రీ)కి మాత్రమే అర్హులని చలోక్తి విసిరారు. ఈ 'బ్యాచిలర్ ఆఫ్ డిఫీట్' డిగ్రీని ఒక వరంలా చూపుతూ, ఈ వారసత్వపు నాయకులు ప్రజాస్వామ్యాన్ని కించపరిచే విధ్వంసక నాటకంలో నిమగ్నమై ఉన్నారని నఖ్వీ ఎద్దేవా చేశారు. అలాగే ‘నాచ్ న జానే ఆంగన్ తేఢా’ అనే హిందీ సామెతను ఉదహరించారు. నాట్యం రాకపోతే వేదికనే నిందించే చెడ్డ నృత్యకారుడిలా ప్రవర్తిస్తున్నారని వ్యంగ్యాస్త్రం సంధించారు. బీహార్ ఎన్నికల్లో కూడా ఇదే ‘వలస ఓటర్లు, ఓటు దొంగతనం’ అనే కల్పిత కుట్రతో విఫలమయ్యారని, ఇప్పుడు మళ్లీ అదే పాత రికార్డు వాయిస్తున్నారని మండిపడ్డారు. ఎస్ఐఆర్ అనేది రాజ్యాంగబద్ధమైన, నిరంతరం జరుగుతున్న ప్రక్రియ అని, అర్హులైన ఓటర్లను కాపాడి, అనర్హుల పేర్లను తొలగించే పని మాత్రమేనని స్పష్టం చేశారు. బీహార్‌ ఎన్నికల సమయంలో కూడా ఓట్ల దోపిడీ అంటూ అబద్దపు కథనాలు చెప్పినా ప్రజలు గట్టిగా బుద్ధి చెప్పారని నఖ్వీ గుర్తుచేశారు. ఎస్ఐఆర్ పై కాంగ్రెస్‌ అండ్ కంపెనీ చేస్తున్న దుష్ప్రచారం ‘రాజకీయ కాలుష్యం’ తప్ప మరొకటి కాదన్నారు. భూమి లేని ఈ భూస్వాములు, ప్రభువులు ప్రజాస్వామ్యాన్ని రాజవంశానికి బందీగా చేయడానికి కుట్ర పన్నారు అని విమర్శించారు.

మతం పేరుతో తప్పుదోవ పట్టిస్తున్నారు

కొన్ని పార్టీలు మతం పేరుతో ‘తప్పుదోవ పట్టించడం, బెదిరించడం, బ్లాక్‌మెయిల్ చేయడం’ ద్వారా నేరపూరిత అరాచకం సృష్టిస్తున్నాయని ఆరోపించారు. ఢిల్లీ పేలుళ్ల కేసులో అల్ ఫలాహ్ యూనివర్శిటీపై వస్తోన్న ఆరోపణల నేపథ్యంలో, విద్యా సంస్థలు ఉగ్రవాదం-సాంకేతికత అనుసంధానంపై అత్యంత అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. ఉగ్ర కుట్రల పట్ల అప్రమత్తంగా, జాగ్రత్తగా ఉండటం అన్ని విద్యా సంస్థల నైతిక విధి అని ఆయన అన్నారు.

పాకిస్తాన్‌ను ‘ఉగ్రవాదాన్ని జాతీయ పరిశ్రమగా, ఉగ్రవాదులను జాతీయ ఆస్తిగా’భావించే దేశంగా తీవ్రంగా ఖండించారు.

ప్రతిపక్షాలు చదవకుండానే పరీక్షలు రాయాలనుకుంటున్నాయి: నఖ్వీ - Tholi Paluku