
ప్రజా సేవల్లో పారదర్శకత, నాణ్యతే ప్రదానం: డిప్యూటీ సీఎం
రాష్ట్రంలో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి పాలనను మరింత పారదర్శకంగా, సమర్థవంతంగా ప్రజలకు చేరువ చేసేందుకు ఉప ముఖ్యమంత్రి, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి పవన్ కళ్యాణ్ వ్యవస్థాగత సంస్కరణలకు శ్రీకారం చుట్టారు. ఈ దిశగా ఆయన తన క్యాంపు కార్యాలయంలో ఉన్నతాధికారులతో ఉన్నతస్థాయి సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. గ్రామీణాభివృద్ధి , గ్రామీణ నీటి సరఫరా శాఖల పనితీరును మెరుగుపరచడం, ప్రజలకు అందే సేవల నాణ్యత పెంచడంపై ప్రధానంగా దృష్టి సారించారు.
పాలనా వ్యవస్థ పునర్నిర్మాణంపై చర్చ
సమావేశంలో ఉప ముఖ్యమంత్రి, ఉన్నతాధికారులు ఫీల్డ్ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు పరిపాలనా నిర్మాణంలో సమూల మార్పులు, సిబ్బంది ప్యాటర్న్, హోదాలలో అవసరమైన మార్పులపై విస్తృతంగా చర్చించారు. గ్రామీణ ప్రాంతాలలో అభివృద్ధి పనులు వేగవంతం కావాలని, ప్రతి పని ప్రజల సంతృప్తిని పెంచేలా సంస్కరణలు అమలులోకి రావాలని పవన్ కళ్యాణ్ ఈ సందర్భంగా స్పష్టం చేశారు. కేవలం పథకాల అమలు మాత్రమే కాకుండా, మౌలిక సదుపాయాల అందించడం ముఖ్యమని ఆయన అధికారులకు దిశానిర్దేశం చేశారు.
'స్వచ్చ రథం', 'మ్యాజిక్ డ్రెయిన్' పైలెట్లపై ప్రత్యేక దృష్టి
ఈ సందర్భంగా ఉప మంత్రి రాష్ట్రంలో ప్రారంభించిన 'స్వచ్చ రథం' కార్యక్రమం, 'మ్యాజిక్ డ్రెయిన్' పైలెట్ ప్రాజెక్టుల పురోగతిని ప్రత్యేకంగా పరిశీలించారు. స్వచ్చ రథం ద్వారా గ్రామాల్లో ఇళ్ల వద్దే పొడి వ్యర్థాలను సేకరించి, వాటికి బదులుగా ఉచితంగా నిత్యావసర వస్తువులు అందించే విధానం గ్రామస్థుల నుంచి మంచి స్పందన పొందుతున్నట్లు అధికారులు వివరించారు. ఈ ప్రక్రియ ప్రజల్లో వ్యర్థాల వర్గీకరణపై అవగాహన కల్పిస్తూ, గ్రామాల పరిశుభ్రతను మెరుగుపరుస్తోందని పేర్కొన్నారు.
అదేవిధంగా గ్రామాల్లో మురుగు నీటి సమస్యకు శాశ్వత పరిష్కారంగా చేపట్టిన 'మ్యాజిక్ డ్రెయిన్' పైలెట్ ప్రాజెక్టును ఉప ముఖ్యమంత్రి అభినందించారు. పెద్ద రాళ్ల నుంచి గులకరాళ్ల వరకు పొరలు వేసి మురుగు నీటిని శుద్ధి చేసుకునే ఈ పద్ధతి తక్కువ ఖర్చుతో, పర్యావరణ హితంగా ఉండటం ముఖ్య విశేషమని అధికారులు తెలిపారు. సాంప్రదాయ డ్రైన్ల కంటే ఇది 75 శాతం తక్కువ ఖర్చుతో అమలవుతోందని, ఎన్టీఆర్ జిల్లాలోని సోమవరం వంటి గ్రామాల్లో ఈ విధానం భూగర్భజలాల రీచార్జ్‌కు, దోమల పెరుగుదల తగ్గడానికి సహాయపడుతోందని వివరించారు.
జల జీవన్ మిషన్ అమలులో పటిష్టత
గ్రామీణ ప్రాంతాల్లో శుభ్రమైన తాగునీరు అందించడంలో జల జీవన్ మిషన్ కీలక పాత్ర పోషిస్తోందని పవన్ కళ్యాణ్ అన్నారు. ప్రతి ఇంటికి నాణ్యమైన నీటిని అందించేందుకు గ్రామీణ నీటి సరఫరా శాఖలో సాంకేతిక, సంస్థాగత మార్పులు తీసుకురావాలని సూచించారు. ప్రతి గ్రామంలో ఐదుగురు మహిళలకు జల్ సహేలీలు'గా శిక్షణ ఇచ్చి, ఫీల్డ్ టెస్ట్ కిట్లతో నీటి నాణ్యతను పరీక్షించే విధానాన్ని మరింత పటిష్టం చేయాలని ఆదేశించారు. అంతేకాక ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ ఆధారిత సెన్సర్లతో నీటి ప్రవాహం, భూగర్భజల మట్టం, ఫ్లోరైడ్–ఆర్సెనిక్ వంటి కలుషిత ప్రమాణాలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని సూచించారు.
ఉపాధి హామీ పనుల్లో పారదర్శకత కీలకం
ఉపాధి హామీ కింద చేపట్టే పనుల్లో శాశ్వత ఆస్తుల సృష్టికి ప్రాధాన్యత ఇవ్వాలని ఉప ముఖ్యమంత్రి తెలిపారు. ప్రత్యేకించి నీటి సంరక్షణ, నీటి వనరుల అభివృద్ధి వంటి పనులపై దృష్టి సారించాలని పేర్కొన్నారు. గ్రామసభ తీర్మానాల ఆధారంగా పనులు జరగాలని, సోషల్ ఆడిట్లు అత్యంత పారదర్శకంగా నిర్వహించాలని అధికారులను ఆదేశించారు, ఉద్యోగ కార్డుల జారీ, పనుల కేటాయింపు వంటి చట్టపరమైన నిబంధనలు ఖచ్చితంగా అమలయ్యేలా చూడాలని అన్నారు.
వారం రోజుల్లో మరో సమీక్షా సమావేశం నిర్వహించి పురోగతిని పరిశీలించనున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో కమిషనర్ కృష్ణ తేజ,ఓ ఎస్ డి వెంకట కృష్ణతో పాటు పలు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
