Let's talk: editor@tmv.in
ప్రజా సమస్యల పరిష్కారమే ప్రభుత్వ లక్ష్యం: మంత్రి పొన్నం ప్రభాకర్
ప్రజా సమస్యల పరిష్కారమే ప్రభుత్వ లక్ష్యం: మంత్రి పొన్నం ప్రభాకర్

ప్రజా సమస్యల పరిష్కారమే ప్రభుత్వ లక్ష్యం: మంత్రి పొన్నం ప్రభాకర్

Gaddamidi Naveen
29 జులై, 2026

ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలకు వేగవంతమైన, పారదర్శకమైన పరిష్కారం అందించడమే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని హైదరాబాద్ జిల్లా ఇంచార్జి, రవాణా& బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. మంగళవారం హైదరాబాద్‌లోని ప్రజా భవన్‌లో నిర్వహించిన 'ప్రజావాణి' కార్యక్రమాన్ని ఆయన స్వయంగా పరిశీలించారు.

ఈ సందర్భంగా విచ్చేసిన బాధితుల నుంచి మంత్రి స్వయంగా వినతిపత్రాలను స్వీకరించారు. అనంతరం సంబంధిత శాఖల అధికారులతో నేరుగా ఫోన్‌లో మాట్లాడి, ప్రజల ఫిర్యాదులపై తక్షణమే స్పందించి పరిష్కరించాలని ఆదేశించారు. ముఖ్యంగా భూ సమస్యలు, ఇందిరమ్మ ఇళ్లు, డబుల్ బెడ్‌రూమ్ గృహాల కేటాయింపు, రెవెన్యూ, మున్సిపల్, సంక్షేమ శాఖలకు సంబంధించిన దరఖాస్తులను పరిశీలించి, అర్హులైన ప్రతి ఒక్కరికీ న్యాయం చేయాలని సూచించారు.

విదేశాల్లో ఉపాధి, ఇతర కారణాలతో ఇబ్బందులు పడుతున్న తెలంగాణ వాసుల కోసం ఏర్పాటు చేసిన 'ప్రవాసి ప్రజావాణి' వినతులను కూడా మంత్రి సమీక్షించారు. వివిధ శాఖల సమన్వయంతో విదేశాల్లోని మన వారి సమస్యలను వేగంగా పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ప్రజావాణి నిర్వహణ, అందుతున్న వినతుల స్థితిగతులపై తెలంగాణ రాష్ట్ర ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ చిన్నారెడ్డి, ప్రజావాణి నోడల్ అధికారి విద్యాసాగర్‌లతో మంత్రి మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు.

ప్రజావాణికి వచ్చే ప్రతి వినతిని బాధ్యతాయుతంగా పరిశీలించి, నిర్ణీత కాలపరిమితిలో పరిష్కరించాలని, పారదర్శకమైన సేవలు అందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి పొన్నం ప్రభాకర్ పునరుద్ఘాటించారు.

ట్యాగ్‌లు
PonnamPrabhakarPrajaVaniHyderabadTelanganaTelanganaGovernmentPublicGrievancesCitizenServicesGoodGovernance
ప్రజా సమస్యల పరిష్కారమే ప్రభుత్వ లక్ష్యం: మంత్రి పొన్నం ప్రభాకర్ - Tholi Paluku