
ప్రజా సమస్యల పరిష్కారమే కూటమి ప్రభుత్వ లక్ష్యం: మంత్రి కొల్లు రవీంద్ర
కూటమి ప్రభుత్వం ప్రజల కోసం పనిచేస్తున్న నిజమైన ప్రజాస్వామ్య ప్రభుత్వం అని రాష్ట్ర గనులు, భూగర్భ వనరులు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. స్థానిక బృందావన థియేటర్ సమీపంలో ఉన్న నియోజకవర్గ టీడీపీ కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన ప్రజాదర్బార్‌లో ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు.
ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులు, సమస్యలను మంత్రి స్వయంగా విని, వాటిని పరిష్కరించేందుకు బాధ్యత వహిస్తామని హామీ ఇచ్చారు. అర్జీలను సంబంధిత అధికారులకు పంపించి, త్వరితగతిన స్పందించేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు.
వారానికి ఒకసారి ప్రజాదర్బార్ కార్యక్రమం నిర్వహిస్తున్నామని మంత్రి వెల్లడించారు. అదేవిదంగా కార్యక్రమం సందర్భంగా సుమారు 110 అర్జీలు అందాయని తెలిపారు. వాటిలో ఇళ్ల స్థలాలు, పింఛన్లు సంబంధిత అంశాలే ఎక్కువగా ఉన్నట్లు చెప్పారు. ప్రజలు ఈ వేదికను సక్రమంగా వినియోగించుకోవాలని సూచించారు.
తాజా మొంథా తుపాను సందర్భంగా ప్రభుత్వం అప్రమత్తంగా పనిచేసి ప్రాణనష్టం జరగకుండా కాపాడిందని మంత్రి రవీంద్ర వివరించారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో జరిగిన నష్టం,చెట్లు కూలడం, విద్యుత్ స్తంభాలు, ట్రాన్స్‌ఫార్మర్లు దెబ్బతినడం వంటి సమస్యలను త్వరగా పరిష్కరించి విద్యుత్ సరఫరా పునరుద్ధరించామని చెప్పారు. ప్రజలకు అవసరం వచ్చిన ప్రతి సందర్భంలో ప్రభుత్వం పక్కగా ఉంటుందని సమస్యలు పరిష్కరించడంలో పరిపాలన వ్యవస్థ మరింత బలోపేతం అవుతోందని పేర్కొన్నారు.
కార్యక్రమంలో మచిలీపట్నం వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కుంచె దుర్గాప్రసాద్ (నాని), మాజీ మున్సిపల్ చైర్మన్ మోటమర్రి బాబా ప్రసాద్, జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ గొర్రెపాటి గోపీచంద్, మాజీ ఎంపీపీ కాగిత వెంకటేశ్వరరావు, మాజీ జడ్పీటీసీ లంకే నారాయణ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
