
ప్రజా సంక్షేమమే లక్ష్యంగా కేరళ బడ్జెట్
రాబోయే అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని కేరళ ఎల్‌డీఎఫ్ ప్రభుత్వం ప్రజాకేంద్రిత బడ్జెట్‌ను ప్రవేశపెట్టింది. 2026–27 ఆర్థిక సంవత్సరానికి గాను ఆర్థిక మంత్రి కేఎన్ బాలగోపాల్ గురువారం అసెంబ్లీలో బడ్జెట్‌ను సమర్పిస్తూ, సామాజిక భద్రతా పెన్షన్లకు మద్దతుగా, కొత్త కమ్యూనిటీ కార్యక్రమాల అమలుకు రూ.14,500 కోట్ల భారీ కేటాయింపును ప్రకటించారు. పినరయ్ విజయన్ నేతృత్వంలో రెండోసారి ఏర్పడిన ప్రభుత్వానికి ఇది ఆరవ బడ్జెట్. ఈ సందర్భంగా రాష్ట్రంలో ప్రతి ఐదేళ్లకోసారి ఉద్యోగుల జీతాలను సమీక్షించే విధానంలో భాగంగా 12వ వేతన సవరణ కమిషన్ ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి వెల్లడించారు.
ఆశా, అంగన్‌వాడీ సిబ్బందికి గౌరవ వేతనాల పెంపు
బడ్జెట్‌లో భాగంగా ఆశా కార్యకర్తలు, అంగన్‌వాడీ వర్కర్లకు నెలకు రూ.1,000 పెంపు, అంగన్‌వాడీ హెల్పర్లకు రూ.500 పెంచుతున్నట్లు తెలిపారు. ప్రీ-ప్రైమరీ టీచర్లు, అక్షరాస్యత మిషన్ కార్యకర్తలకు నెలకు రూ.1,000 పెంపు, పాఠశాలల మధ్యాహ్న భోజన సిబ్బంది రోజువారీ వేతనం రూ.25 పెంచినట్ లుమంత్రి తెలిపారు.
మహిళా భద్రత, గ్రామీణ ఉపాధికి భారీ నిధులు
• ముఖ్యమంత్రి స్త్రీ సురక్ష పథకం కింద రూ.3,700 కోట్లు
• గ్రామీణ ఉపాధి పథకానికి గతేడాదితో పోలిస్తే రూ.1,000 కోట్లు అదనం
• పాఠశాల పిల్లలు సహా అన్ని వర్గాలకు జీవిత, ఆరోగ్య బీమా పథకాలు
• ఆర్ట్స్, సైన్స్ కళాశాలల్లో చదువుతున్న విద్యార్థులకు ఉచిత డిగ్రీ విద్య అని బడ్జెట్‌లో ప్రకటించారు.
మౌలిక సదుపాయాలు, పర్యావరణ పరిరక్షణ
తిరువనంతపురం–కాసరగోడ్ రీజినల్ రాపిడ్ ట్రాన్సిట్ సిస్టమ్ (ఆర్ఆర్టీఎస్) ప్రాథమిక పనులకు రూ.100 కోట్లు, తీరప్రాంత అభివృద్ధికి రూ.150 కోట్లు, అటవీ, వన్యప్రాణి సంరక్షణకు రూ.250 కోట్లకు పైగా కేటాయించారు.
కేంద్రంపై విమర్శలు
బడ్జెట్ ప్రసంగంలో బాలగోపాల్ కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. కేరళకు రావాల్సిన పన్ను వాటాను తగ్గిస్తూ రాష్ట్రాన్ని ‘ఆర్థికంగా తొక్కిపెడుతున్నట్టు’ ఆరోపించారు. నిధుల విడుదల కేంద్రం వివక్ష చూపుతున్నా కేరళ ముందుకు సాగుతోందని వ్యాఖ్యానించారు.
డీఏ బకాయిలు, హౌస్ బిల్డింగ్ అడ్వాన్స్ పునరుద్ధరణ
ఉద్యోగులు, పెన్షనర్లకు పెండింగ్‌లో ఉన్న డీఏ, డీఆర్ బకాయిలన్నింటినీ చెల్లిస్తామని ఈ సందర్భంగా ప్రభుత్వం ప్రకటించింది. ఒక విడతను ఫిబ్రవరి జీతంతో, మిగిలిన మొత్తాన్ని మార్చి జీతంతో చెల్లిస్తామని తెలిపింది. అలాగే ఉద్యోగులకు హౌస్ బిల్డింగ్ అడ్వాన్స్ పథకాన్ని తిరిగి అమలు చేయనున్నారు.
హామీ పెన్షన్ పథకం
నేషనల్ పెన్షన్ సిస్టమ్ (ఎన్పీఎస్)కు బదులుగా హామీ పెన్షన్ పథకాన్ని అమలు చేయనున్నట్లు మంత్రి ప్రకటించారు. ఈ పథకం కింద అర్హులైన ఉద్యోగులకు పదవీ విరమణ తర్వాత చివరి జీతంలో 50 శాతం వరకు పెన్షన్, డీఆర్‌తో కలిపి అందుతుంది. ఎన్పీఎస్ లో ఉన్న ఉద్యోగులు ఈ పథకానికి మారే అవకాశం ఉంటుంది. ఏప్రిల్ 1లోపు పూర్తి మార్గదర్శకాలు విడుదల చేయనున్నట్లు తెలిపారు.
ఆటో కార్మికులకు గ్రీన్ ట్రాన్సిషన్ పథకం
ఆటో కార్మికులను ఆదుకోవడానికి పర్యావరణ హిత చర్యలు చేపడుతున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఎలక్ట్రిక్ ఆటోలు కొనుగోలు చేస్తే పాత పెట్రోల్/డీజిల్ ఆటోను స్క్రాప్ చేయడంపై రూ.40,000 వరకు ఒకసారి బోనస్, ఎంపిక చేసిన ప్రభుత్వ బ్యాంకుల నుంచి తీసుకునే రుణాలపై 2శాతం వడ్డీ సబ్సిడీ ఇవ్వనుంది. ఈ పథకాలకు రూ.20 కోట్లు కేటాయించారు. అలాగే రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 5,000కిపైగా అనధికార ఆటో స్టాండ్లను స్మార్ట్ మైక్రో హబ్‌లుగా మార్చేందుకు మరో రూ.20 కోట్లు కేటాయించారు. సౌరశక్తితో చార్జింగ్ సదుపాయాలు కల్పించనున్నారు.
మహిళల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి
మహిళల ఆరోగ్య సంరక్షణలో భాగంగా జిల్లా ఆసుపత్రుల్లో మెనోపాజ్ క్లినిక్‌ల ఏర్పాటు కోసం రూ.3 కోట్లు కేటాయించారు. హార్మోనల్ సమస్యలు, మానసిక ఒత్తిడి, ఎముకల ఆరోగ్యం వంటి అంశాలపై ఒకేచోట చికిత్స, కౌన్సెలింగ్ అందించనున్నారు. ఈ తరహా క్లినిక్‌లను ప్రారంభించిన తొలి రాష్ట్రం మహారాష్ట్ర కాగా, కేరళ ఆ బాటలో అడుగులు వేస్తోంది.
పాఠశాల విద్యార్థులకు జీవన–ప్రమాద బీమా
అసంఘటిత కార్మికులకు విస్తృత రక్షణ
కేరళ 2026–27 బడ్జెట్‌లో భాగంగా పాఠశాల విద్యార్థులు, హరిత కర్మ సేన సభ్యులు, ఆటోరిక్షా–టాక్సీ డ్రైవర్లు, లాటరీ కార్మికులు సహా అసంఘటిత రంగంలోని కార్మికులకు జీవన, ప్రమాద బీమా పథకాలు అమలు చేయనున్నట్లు ఆర్థిక మంత్రి కేఎన్ బాలగోపాల్ ప్రకటించారు. ఈ బీమా పథకాలను రాష్ట్ర బీమా శాఖ సహకారంతో, ప్రభుత్వ ఆర్థిక మద్దతుతో అమలు చేయనున్నారు. ఇప్పటివరకు అధికారిక బీమా రక్షణకు దూరంగా ఉన్న వర్గాలకు ఇది భద్రతగా నిలుస్తుందని మంత్రి తెలిపారు.
పాఠశాల విద్యార్థులకు ప్రత్యేక బీమా
1వ తరగతి నుంచి 12వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులకు జీవన లేదా ప్రమాద బీమా కల్పించేందుకు ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది.
ఈ పథకానికి ప్రతి ఏడాది రూ.15 కోట్లు ఖర్చు అవుతాయని, అదే మొత్తాన్ని బడ్జెట్‌లో కేటాయించినట్లు బాలగోపాల్ వెల్లడించారు.
ఫిబ్రవరి 1 నుంచి మెడిసెప్ 2.0
ప్రస్తుతం సుమారు 11 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు వర్తిస్తున్న ఆరోగ్య బీమా పథకం మెడిసెప్ ను మరింత విస్తరించిన రూపంలో మెడిసెప్ 2.0గా ఫిబ్రవరి 1 నుంచి అమల్లోకి తీసుకువస్తామని మంత్రి తెలిపారు. వయస్సు పరిమితి, వైద్య పరీక్షల అడ్డంకులు లేకుండా మరిన్ని చికిత్స ప్యాకేజీలు, ఆసుపత్రులు అందుబాటులోకి వస్తాయని ఆయన చెప్పారు. ప్రభుత్వ రంగ సంస్థలు, సహకార సంస్థల్లో పనిచేస్తున్న ఉద్యోగులు, పెన్షనర్ల కోసం కూడా మెడిసెప్ తరహా ఆరోగ్య బీమా పథకం రూపొందించనున్నట్లు ప్రకటించారు.
అనేక వర్గాలకు
వెల్ఫేర్ బోర్డుకు సభ్యులుగా ఉన్న ఆటోరిక్షా, టాక్సీ కార్మికులకు తక్కువ ప్రీమియంతో అందుబాటు ఆరోగ్య బీమా పథకం అమలు చేయనున్నారు. అలాగే ప్రస్తుతం 42 లక్షల కుటుంబాలకు ఉచిత వైద్యం అందిస్తున్న కరుణ్య ఆరోగ్య సురక్ష పథకం పరిధిలో లేని కుటుంబాల కోసం కూడా కొత్త ఆరోగ్య బీమా పథకం ప్రవేశపెట్టనున్నారు. ఈ పథకానికి రూ.50 కోట్లు బడ్జెట్‌లో కేటాయించారు. తక్కువ మొత్తాన్ని చెల్లించి ఈ పథకంలో చేరవచ్చని మంత్రి తెలిపారు. రాష్ట్రంలోని మత్స్యకారులందరికీ గ్రూప్ ఇన్సూరెన్స్ పథకం అమలుకు రూ.10 కోట్లు కేటాయించినట్లు బాలగోపాల్ వెల్లడించారు.
