Let's talk: editor@tmv.in
ప్రజాస్వామ్య బలోపేతానికి ‘సర్’ కీలకం: సీఈసీ

ప్రజాస్వామ్య బలోపేతానికి ‘సర్’ కీలకం: సీఈసీ

Pinjari Chand
22 జనవరి, 2026

ఓటర్ జాబితా ప్రత్యేక సవరణ(ఎస్ఐఆర్, సర్)పై ప్రతిపక్ష పార్టీలు ప్రశ్నలు లేవనెత్తుతున్న నేపథ్యంలో, ప్రక్షాళన(ప్యూర్)చేసిన ఓటర్ల జాబితానే ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేసే ప్రధాన సాధనమని ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) జ్ఞానేశ్ కుమార్ బుధవారం స్పష్టం చేశారు. భారత మండపంలో జరిగిన అంతర్జాతీయ ఎన్నికల నిర్వహణ సంస్థల సదస్సు ప్రారంభ సమావేశంలో ఆయన మాట్లాడారు. గతేడాది బీహార్‌లో నిర్వహించిన ఓటర్ల జాబితా పునఃసమీక్ష సందర్భంగా ఒక్క ఫిర్యాదూ నమోదు కాలేదని తెలిపారు. ఓటర్లను జాబితాలో చేర్చడంపై గానీ, తొలగింపుపై గానీ ఎలాంటి అభ్యంతరాలు రాకపోవడం గమనార్హమని అన్నారు. అదేవిధంగా బీహార్ శాసనసభ ఎన్నికలు రెండు దశల్లో నిర్వహించినప్పటికీ, రాష్ట్రంలోని దాదాపు లక్ష పోలింగ్ కేంద్రాల్లో ఒక్కచోట కూడా రీపోలింగ్ కు ఆదేశించలేదని ఆయన వివరించారు. చట్టం ప్రకారం అర్హుడైన ప్రతి ఓటరుని కలుపుకొని రూపొందించిన ప్రక్షాళన చేసిన ఓటరు జాబితా ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయడానికి అత్యవసరం. అలాంటి జాబితా ఆధారంగా జరిగే అన్ని ఎన్నికలు ప్రజాస్వామ్యానికి మరింత బలం చేకూరుస్తాయని సీఈసీ జ్ఞానేశ్ కుమార్ అన్నారు.

బీహార్‌ ఓటర్ జాబితా ప్రక్షాళన కఠినమైన ప్రజా పర్యవేక్షణ మధ్య నిర్వహించారని ఆయన చెప్పారు. ఓటర్ జాబితా సమగ్ర ప్రక్షాళన నుంచి ఎన్నికల నిర్వహణ వరకు స్థానిక ఎన్నికల యంత్రాంగం అత్యంత సమర్థవంతంగా పనిచేసిందని ఆయన ప్రశంసించారు. ప్రత్యేక ఓటర్ జాబితా సమగ్ర ప్రక్షాళన (ఎస్ఐఆర్) ప్రక్రియ ఓట్లను మానిప్యులేట్ చేయడానికి తీసుకున్న చర్య అని ఆరోపిస్తూ ప్రతిపక్ష పార్టీలు కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీయే ప్రభుత్వం, ఎన్నికల కమిషన్‌పై తీవ్ర విమర్శలు చేస్తున్నాయి. అయితే ప్రభుత్వం, ఎన్నికల కమిషన్ ఈ ఆరోపణలను ఖండించాయి. గతేడాది నవంబర్ 4 నుంచి అండమాన్–నికోబార్ దీవులు, లక్షద్వీప్, ఛత్తీస్‌గఢ్, గోవా, గుజరాత్, కేరళ, మధ్యప్రదేశ్, పుదుచ్చేరి, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో ఎస్ఐఆర్ రెండో దశ ప్రారంభమైంది. అస్సాంలో మాత్రం ప్రత్యేకంగా మరో ‘స్పెషల్ రివిజన్’ ప్రక్రియ కొనసాగుతోంది.

రాష్ట్రాల్లో నిర్వహించిన చివరి ఎస్ఐఆర్ నే కట్-ఆఫ్ తేదీగా పరిగణిస్తారని, ఇదే విధంగా బీహార్ లో 2003 ఓటర్ జాబితాను ఎన్నికల కమిషన్ సమీక్షకు ఆధారంగా ఉపయోగించిందని అధికారులు తెలిపారు. చాలా రాష్ట్రాల్లో ఓటర్ల జాబితా ప్రత్యేక ప్రక్షాళన చివరిసారి 2002 నుంచి 2004 మధ్య జరిగింది. ఎస్ఐఆర్ ప్రధాన ఉద్దేశం అక్రమ విదేశీ వలసదారులను గుర్తించి తొలగించడం. బంగ్లాదేశ్, మయన్మార్ వంటి దేశాల నుంచి వచ్చిన అక్రమ వలసదారులపై పలు రాష్ట్రాల్లో కఠిన చర్యలు కొనసాగుతున్న నేపథ్యంలో ఈ ప్రక్రియకు ప్రత్యేక ప్రాధాన్యం ఏర్పడింది.

70 దేశాల ప్రతినిధులు హాజరు

భారత ఎన్నికల కమిషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న భారత్ అంతర్జాతీయ ప్రజాస్వామ్యం, ఎన్నికల నిర్వహణ సదస్సు–2026కు ప్రపంచవ్యాప్తంగా 70 దేశాల నుంచి వచ్చిన అంతర్జాతీయ ప్రతినిధులకు ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ బుధవారం స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఎన్నికల కమిషనర్లు డా. సుఖ్‌బీర్ సింగ్ సంధు, డా. వివేక్ జోషి కూడా పాల్గొన్నారు. ఢిల్లీలోని భారత్ మండపంలో ఈ అంతర్జాతీయ సదస్సు జరుగుతోంది.

మూడు రోజుల పాటు సాగనున్న ఈ కార్యక్రమంలో ఎన్నికల నిర్వహణ సంస్థలు పాల్గొనే సాధారణ సమావేశాలు, ప్లీనరీ సెషన్లు నిర్వహించనున్నారు. వీటిలో ప్రారంభ సమావేశం, ఈఎంబీ నేతల ప్లీనరీ, ఈఎంబీ వర్కింగ్ గ్రూప్ సమావేశాలు, అలాగే ప్రపంచ స్థాయి ఎన్నికల సమస్యలు, అంతర్జాతీయ మాదిరి ఎన్నికల ప్రమాణాలు, ఎన్నికల ప్రక్రియల్లో వినూత్న ఆవిష్కరణలు, ఉత్తమ విధానాలపై చర్చించే అంశాల సమావేశాలు ఉంటాయి. సదస్సులో 36 అంశాల ఆధారిత వర్కింగ్ గ్రూపులు ఏర్పాటు చేశారు. వీటికి రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల ప్రధాన ఎన్నికల అధికారులు నాయకత్వం వహిస్తుండగా, జాతీయ, అంతర్జాతీయ స్థాయి విద్యావేత్తలు మద్దతు అందిస్తున్నారు. ఈ గ్రూప్ చర్చల్లో 4 ఐఐటీలు, 6 ఐఐఎంలు, 12 జాతీయ న్యాయ విశ్వవిద్యాలయాలు, ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మాస్ కమ్యూనికేషన్ వంటి ప్రముఖ విద్యాసంస్థలు కూడా భాగస్వామ్యం అవుతున్నాయి.

ఈ సదస్సు సందర్భంగా భారత ఎన్నికల కమిషన్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఎన్నికల నిర్వహణ సంస్థలతో 40కు పైగా ద్వైపాక్షిక సమావేశాలు నిర్వహించనుంది. వీటి ద్వారా ప్రపంచవ్యాప్తంగా ఎన్నికల సంస్థలు ఎదుర్కొంటున్న సవాళ్లు, పరస్పర సహకారం వంటి అంశాలపై చర్చలు జరగనున్నాయి.

అదేవిధంగా, ఎన్నికలకు సంబంధించిన పూర్తి సమాచారం, సేవలను ఒకే చోట అందించే ECINET అనే భారత ఎన్నికల కమిషన్ డిజిటల్ వేదికను అధికారికంగా ప్రారంభించనున్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద ఎన్నికల ప్రక్రియ అయిన లోక్‌సభ 2024 ఎన్నికల నిర్వహణపై రూపొందించిన డాక్యుమెంటరీ సిరీస్ ‘ఇండియా డిసైడ్స్’నుప్రదర్శించనున్నారు. ప్రజాస్వామ్యం, ఎన్నికల నిర్వహణ రంగంలో భారత్ నిర్వహిస్తున్న అత్యంత పెద్ద అంతర్జాతీయ సదస్సు ఇదే అని అధికారులు తెలిపారు.