Let's talk: editor@tmv.in
ప్రజాస్వామ్య పరిరక్షణకు పోరాటం కొనసాగిస్తాం: కేటీఆర్

ప్రజాస్వామ్య పరిరక్షణకు పోరాటం కొనసాగిస్తాం: కేటీఆర్

Gaddamidi Naveen
25 ఫిబ్రవరి, 2026

మున్సిపల్ ఎన్నికల ఫలితాల అనంతరం రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ పరిస్థితులు, అరెస్టులపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిప్పులు చెరిగారు. ఆదిలాబాద్ జిల్లా జైలులో ఉన్న మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్, ఇతర పార్టీ నాయకులను పరామర్శించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం అప్రజాస్వామికంగా వ్యవహరిస్తోందని, పోలీసు యంత్రాంగాన్ని వాడుకుని ప్రతిపక్షాలను వేధిస్తోందని మండిపడ్డారు.

రాష్ట్రవ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ ప్రజల తీర్పును గౌరవించలేదని ఆయన ఆరోపించారు. తమ పార్టీ అభ్యర్థులను బెదిరించడం, దాడులకు దిగడం, అధికార యంత్రాంగాన్ని ఉపయోగించడం వంటి చర్యలకు కాంగ్రెస్ పాల్పడిందని కేటీఆర్ విమర్శించారు. మంచిర్యాల జిల్లా క్యాతన్‌పల్లి మున్సిపాలిటీలో బీఆర్ఎస్‌కు 10 స్థానాలు, సీపీఐకి 4 స్థానాలు రావడంతో మొత్తం 14 స్థానాలతో మెజారిటీ ఉన్నప్పటికీ, కేవలం 7 స్థానాలు గెలిచిన కాంగ్రెస్ అప్రజాస్వామికంగా అధికారం దక్కించుకునే ప్రయత్నం చేసిందన్నారు.

సీఎం రేవంత్ రెడ్డి సూచనల మేరకు స్థానిక మంత్రి వివేక్‌తో కలిసి అధికారులు అరాచకంగా వ్యవహరించారని కేటీఆర్ ఆరోపించారు. క్యాతన్‌పల్లిలో తమ మహిళా కౌన్సిలర్లపై అసభ్య ప్రవర్తన జరిగినా బాధ్యులపై చర్యలు తీసుకోలేదన్నారు. జనగామలో దళిత మహిళా కౌన్సిలర్‌ను బలవంతంగా లాగడం వంటి ఘటనలు ప్రజాస్వామ్యానికి మచ్చతెస్తాయని ఆయ‌న‌ వ్యాఖ్యానించారు.

ఈ ఘటనలను ప్రశ్నించినందుకే బాల్క సుమన్‌తో పాటు ఇతర నేతలపై అక్రమ కేసులు పెట్టి జైలుకు పంపించారని కేటీఆర్ ఆరోపించారు. అయితే కాంగ్రెస్, బీజేపీ నేతలు తీవ్ర పదజాలంతో దూషించినా వారిపై కేసులు నమోదు చేయలేదని అన్నారు. రాష్ట్ర డీజీపీ శివధర్ రెడ్డి ఒక పార్టీకి ఒక న్యాయం, మరొక పార్టీకి మరో న్యాయం చేస్తున్నారని విమర్శించారు. కాకి బుక్ ఉంటుందని డైలాగులు చెప్పిన డీజీపీకి, పోలీసులను బూతులు తిట్టిన బీజేపీ నేత అరవింద్, కాంగ్రెస్ నేత జగ్గారెడ్డిలు కనిపించడం లేదా అని ప్రశ్నించారు.

క్యాతన్‌పల్లిలో కౌన్సిలర్లకు కోట్ల రూపాయల ప్రలోభాలు చూపించినా వారు లొంగలేదని, పార్టీ నాయకత్వానికి అండగా నిలిచారని కేటీఆర్ పేర్కొన్నారు. ఉద్యమ కాలంలో అనేకసార్లు జైలు జీవితం గడిపిన సుమన్‌ను అక్రమ కేసులతో భయపెట్టలేరని ఆయ‌న తెలిపారు. ఎన్నికల సంఘం రాజ్యాంగబద్ధంగా వ్యవహరించి క్యాతన్‌పల్లి, ఇబ్రహీంపట్నం, ఖానాపూర్ ప్రాంతాల్లో పారదర్శకంగా మళ్లీ ఎన్నికలు నిర్వహించాలని ఆయన డిమాండ్ చేశారు. సీసీ కెమెరాల పర్యవేక్షణలో ఎన్నికలు జరిపి గెలిచిన వారికి ప్రమాణ స్వీకారం చేయించాలని కోరారు.

అక్రమ కేసులు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యే కోవ లక్ష్మి సహా పార్టీ నేతలకు న్యాయం జరుగుతుందని, అధికార దుర్వినియోగానికి పాల్పడిన వారిని భవిష్యత్తులో వదిలిపెట్టబోమని కేటీఆర్ హెచ్చరించారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడే పోరాటం కొనసాగుతుందని ఆయన తెలిపారు.

ప్రజాస్వామ్య పరిరక్షణకు పోరాటం కొనసాగిస్తాం: కేటీఆర్ - Tholi Paluku