Let's talk: editor@tmv.in
ప్రజాస్వామ్య పటిష్టతకు ఓటు హక్కు వినియోగమే బలమైన పునాది:సీఎస్ విజయానంద్

ప్రజాస్వామ్య పటిష్టతకు ఓటు హక్కు వినియోగమే బలమైన పునాది:సీఎస్ విజయానంద్

Panthagani Anusha
26 జనవరి, 2026

ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటు హక్కు అత్యంత విలువైనదని అర్హత కలిగిన ప్రతి పౌరుడు తప్పనిసరిగా ఓటరుగా నమోదు చేసుకొని ఓటు హక్కును వినియోగించుకోవాలని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కే. విజయానంద్ తెలిపారు. ఆదివారం విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో నిర్వహించిన 16వ జాతీయ ఓటర్ల దినోత్సవ వేడుకలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. భారత ఎన్నికల సంఘం 1950 జనవరి 25న స్థాపించబడిన సందర్భాన్ని పురస్కరించుకుని ఈ రోజును నిర్వహిస్తున్నామని ఓటింగ్ ప్రక్రియలో పౌరుల భాగస్వామ్యాన్ని పెంచడం ముఖ్యంగా యువతకు వారి హక్కులపై అవగాహన కల్పించడమే ఈ దినోత్సవ ప్రధాన ఉద్దేశ్యమని ఆయన పేర్కొన్నారు.

"నా భారత్ నా ఓటు" థీమ్‌తో చైతన్యం

ఈ ఏడాది "నా భారత్ - నా ఓటు" అనే థీమ్‌తో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని ఓటు వేయడం ప్రతి పౌరుడి బాధ్యత అని, భారతదేశం ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా నిలవడంలో పౌరుల భాగస్వామ్యమే కీలకమని ఆయన స్పష్టం చేశారు. 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరికీ ఓటరు గుర్తింపు కార్డులు అందించేందుకు ఎన్నికల సంఘం నిరంతరం కృషి చేస్తోందని స్వేచ్ఛాయుత నిష్పక్షపాత ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం కట్టుబడి ఉందని వివరించారు.

నమోదు ప్రక్రియలో కీలక మార్పులు

రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వివేక్ యాదవ్ మాట్లాడుతూ, ఓటరు నమోదులో వచ్చిన సానుకూల మార్పులను గురించి మాట్లాడుతూ గతంలో కేవలం జనవరి 1వ తేదీని మాత్రమే ప్రామాణికంగా తీసుకునేవారని ఇప్పుడు కొత్త చట్టం ప్రకారం ఏడాదిలో నాలుగు సార్లు (జనవరి 1, ఏప్రిల్ 1, జూలై 1, అక్టోబర్ 1) నమోదు చేసుకునే అవకాశం ఉందని తెలిపారు. కేవలం కార్డు ఉంటే సరిపోదని ఓటరు జాబితాలో పేరు ఉందో లేదో సీఈఓ వెబ్‌సైట్‌లో సరిచూసుకోవాలని ఆయన సూచించారు. యువతను ప్రోత్సహించడానికి విద్యాసంస్థల్లో ఎలక్టోరల్ లిటరసీ క్లబ్‌లను నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు.

స్వేచ్ఛాయుత ఓటింగ్‌కు కలెక్టర్లదే బాధ్యత

మాజీ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ మాట్లాడుతూ ఓటు వేయడం అనేది ఆర్టికల్ 19 ప్రకారం లభించే వ్యక్తిగత స్వేచ్ఛలో భాగమని సుప్రీంకోర్టు స్పష్టం చేసిందని గుర్తుచేశారు. ఎన్నికల సమయంలో 'మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్'ను రాజీ లేకుండా అమలు చేయాల్సిన బాధ్యత కలెక్టర్లపై ఉందన్నారు. పౌరులు ఎటువంటి భయం లేకుండా ఓటు వేసే వాతావరణాన్ని కల్పించాలని ఒక వ్యక్తి ఎక్కడ నివసిస్తే అక్కడ ఓటు హక్కు పొందే స్వేచ్ఛ ఉండాలని ఆయన అభిప్రాయపడ్డారు.

ఘనంగా అవార్డుల ప్రధానం - నెల్లూరు జిల్లాకు ప్రథమ స్థానం

ఎన్నికల నిర్వహణలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన అధికారులకు ఈ సందర్భంగా అవార్డులు అందజేశారు. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (సర్) ఎలక్షన్ మ్యాపింగ్‌లో ప్రతిభ చాటిన నెల్లూరు జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లకు రాష్ట్ర స్థాయి అవార్డు లభించింది. అదేవిదనగా ఉత్తమ బి.ఎల్.ఓ పర్యవేక్షకుడిగా రాంప్రసాద్, అత్యధిక మ్యాపింగ్ చేసిన బి.ఎల్.ఓగా బొల్లం వెంకట రమణయ్యలకు సీఎస్ అవార్డులు అందజేశారు. చివరగా కొత్త ఓటర్లకు ఎపిక్ కార్డులు పంపిణీ చేసి ప్రలోభాలకు లోనవ్వకుండా ఓటు వేస్తామని అందరితో ప్రతిజ్ఞ చేయించడంతో కార్యక్రమం ముగిసింది. కార్యక్రమంలో ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్, జిల్లా ఎలక్టోరల్ అధికారి డా. జి. లక్ష్మీశ, ఎన్నికల విభాగం అధికారులు, విద్యార్థులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.