Let's talk: editor@tmv.in
ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారు: వైఎస్ జగన్

ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారు: వైఎస్ జగన్

Panthagani Anusha
7 జనవరి, 2026

ఆంధ్రప్రదేశ్‌లో ప్రజాస్వామ్యం తీవ్రంగా దెబ్బతింటోందని వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. ఇటీవల జరిగిన మండల పరిషత్ అధ్యక్ష (ఎంపీపీ) ఉపఎన్నికల్లో చోటుచేసుకున్న పరిణామాలే ఇందుకు నిదర్శనమని ఆయన విమర్శించారు. చిన్నస్థాయి ఎన్నికల్లో సైతం బెదిరింపులు, అపహరణలు, దాడులకు పాల్పడటం రాష్ట్రంలో అరాచక పాలనకు అద్దం పడుతోందని ధ్వజమెత్తారు. ఈ మేరకు నెల్లూరు, అనంతపురం జిల్లాలో జరిగిన పరిణామాలను ప్రస్తావిస్తూ ప్రజాస్వామ్యం ఎటుపోతోందని ఆయన 'ఎక్స్' వేదికగా నిలదీశారు.

నెల్లూరు జిల్లా వింజమూరు, అనంతపురం జిల్లా బొమ్మనహాల్ మండలాల్లో ప్రజాస్వామ్యాన్ని నాశనం చేశారని జగన్ ఆరోపించారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎన్నికలను ఒక ప్రజాస్వామ్య ప్రక్రియలా కాకుండా, బలప్రయోగ ప్రదర్శనగా మార్చేశారని విమర్శించారు. వింజమూరు, బొమ్మనహాల్ ఎంపీపీ ఉపఎన్నికలను తక్షణమే రద్దు చేయాలని, స్వేచ్ఛాయుతమైన వాతావరణంలో తిరిగి ఎన్నికలు నిర్వహించాలని ఆయన డిమాండ్ చేశారు. టీడీపీ అహంకారపూరిత పాలనలో సామాన్యుల ఓటుకు విలువ లేకుండా పోతోందని ఆవేదన వ్యక్తం చేశారు.

ముఖ్యంగా నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గంలో వైఎస్సార్‌సీపీ ఎంపీటీసీ సభ్యులపై జరిగిన దాడులను జగన్ తీవ్రంగా ఖండించారు. ఓటు వేయడానికి వెళ్తున్న ప్రజాప్రతినిధులను అడ్డుకుని వారిపై భౌతిక దాడులకు తెగబడ్డారని పేర్కొన్నారు. ఈ దాడిలో ఒక మహిళా ఎంపీటీసీ సభ్యురాలికి గాయాలై రక్తస్రావం కావడం అత్యంత దురదృష్టకరమని దీనికి తోడు ఒక సభ్యుడిని అపహరించడమే కాకుండా మరొకరిని పోలీసులు అదుపులోకి తీసుకోవడం వెనుక వైఎస్సార్‌సీపీ గళాన్ని నొక్కేసే కుట్ర దాగి ఉందని ఆయన ఆరోపించారు.

పోలీసుల తీరుపై జగన్ తీవ్ర అసహనం వ్యక్తం చేస్తూ ఈ దాడులు జరుగుతున్న సమయంలో శాంతిభద్రతలను కాపాడాల్సిన పోలీసులు అధికార కూటమి నేతల ఒత్తిడికి తలొగ్గి ప్రేక్షకులుగా మారిపోయారని విమర్శించారు. పోలీసు యంత్రాంగాన్ని రాజకీయ ప్రయోజనాల కోసం దుర్వినియోగం చేస్తూ ప్రజాస్వామ్య వ్యవస్థలను నిర్వీర్యం చేస్తున్నారని పేర్కొన్నారు. మరోవైపు అనంతపురం జిల్లా బొమ్మనహాల్‌లో కూడా తమ పార్టీ ఎంపీటీసీలను నిర్బంధించి బలవంతంగా ఎన్నికను పూర్తి చేశారని తెలిపారు.

కాగా రాష్ట్రంలో నెలకొన్న ఈ పరిస్థితులపై వైఎస్సార్‌సీపీ ఇప్పటికే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లింది. పార్టీ నేత ఎల్. అప్పి రెడ్డి రాష్ట్ర ఎన్నికల కమిషనర్, డీజీపీకి లేఖ రాస్తూ.. ఉపఎన్నికల్లో జరిగిన అక్రమాలపై ఫిర్యాదు చేశారు. ఎన్నికల నిర్వహణలో పోలీసుల జోక్యం, విధి నిర్వహణలో వైఫల్యంపై విచారణ జరపాలని కోరారు. అయితే ప్రధాన ప్రతిపక్షం చేస్తున్న ఈ తీవ్ర ఆరోపణలపై అధికార తెలుగుదేశం పార్టీ నుంచి ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.

ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారు: వైఎస్ జగన్ - Tholi Paluku