
ప్రజాస్వామ్యానికి స్పీకరే కీలకం.. తటస్థతే ఆ పదవికి అలంకారం!
పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో స్పీకర్ పదవి చాలా పవిత్రమైనది. సభలో గొడవలు జరుగుతున్నప్పుడు ఆయన ఏ పక్షం వైపు మొగ్గు చూపకుండా, ప్రశాంతంగా ఒక నిష్పక్షపాతమైన తీర్పు ఇచ్చే వ్యక్తిలా ఉండాలి. రాజకీయాల్లో ఎంత అనుభవం ఉన్నా, స్పీకర్ కుర్చీలో కూర్చున్న వెంటనే తన పాత పార్టీని, సొంత ఇష్టాయిష్టాలను పూర్తిగా మర్చిపోవాలి. చట్టప్రకారం స్పీకర్ పదవి చేపట్టగానే తన పార్టీ రంగులను విడిచిపెట్టి, అందరినీ సమానంగా చూడాలి. కానీ ప్రస్తుత రాజకీయాల్లో ఈ ఆదర్శాలు కేవలం మాటలకే పరిమితమై, ఆచరణలో కనిపించడం లేదన్న విమర్శలు వస్తున్నాయి.
ఇటీవల లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాను పదవి నుంచి తొలగించాలని ప్రతిపక్షాలు ప్రవేశపెట్టిన అభిశంసన తీర్మానం దేశవ్యాప్తంగా ఒక పాత చర్చను మళ్ళీ తెరపైకి తీసుకొచ్చింది. ఈ చర్యను ప్రభుత్వం కేవలం 'రాజకీయ నాటకం'గా కొట్టిపారేయగా, ప్రతిపక్షం మాత్రం దీనిని రాజ్యాంగబద్ధమైన అవసరంగా పేర్కొంది. లోక్‌సభలో సంఖ్యాబలం ఉన్న కారణంగా ఈ తీర్మానం ముజవాణి ఓటు ద్వారా వీగిపోయింది. అయితే పార్లమెంటరీ గణితంలో సంఖ్యలు గెలవవచ్చు కానీ, ఆ తీర్మానం లేవనెత్తిన ప్రశ్నలు మాత్రం సజీవంగానే ఉన్నాయి. ఒక రెఫరీ తాను ఒకప్పుడు ఆడిన జట్టును నిజంగా మర్చిపోయి వ్యవహరించగలరా అన్న సందేహం ఇప్పుడు మరింత బలపడింది.
ప్రతిపక్షాల ప్రధాన ఫిర్యాదు ఏమిటంటే—సభాపతి అధికార పక్షం పట్ల అపారమైన సహనాన్ని చూపుతూ, విపక్ష సభ్యుల పట్ల అత్యంత కఠినంగా వ్యవహరిస్తున్నారని. రాజకీయాల్లో 'కనిపించే దృక్పథమే' అసలైన నిజం. కీలకమైన జాతీయ సమస్యలపై చర్చ కోరుతూ ప్రతిపక్షాలు ఇచ్చే నోటీసులు నిబంధనల సాకుతో పక్కకు వెళ్తుంటే, ప్రభుత్వ బిల్లులు మాత్రం ఎటువంటి అడ్డంకులు లేకుండా అత్యంత వేగంగా ఆమోదం పొందుతున్నాయి. రెఫరీ విజిల్ ఒకేవైపు మొగుతున్నప్పుడు, ఆ ఆట నియమబద్ధంగా సాగుతుందన్న నమ్మకం ఆటగాళ్లలో క్రమంగా సన్నగిల్లుతుంది.
సభ్యులపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవడంలో కూడా స్పీకర్ ఒక పక్షానికే కొమ్ముకాస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. సభలో గొడవ జరిగినప్పుడు ప్రతిపక్ష సభ్యులు నినాదాలు చేస్తే వెంటనే వారిని సభ నుంచి పంపించేస్తున్నారు (సస్పెండ్ చేస్తున్నారు). కానీ, అదే సమయంలో అధికార పక్ష సభ్యులు అడ్డు తగిలినా వారిపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని విమర్శకులు ప్రశ్నిస్తున్నారు. స్పీకర్ ఆఫీసు తీరు చూస్తుంటే విమానాశ్రయాల్లోని తనిఖీ కేంద్రంలా అనిపిస్తోంది. అక్కడ కొందరు సులభంగా వెళ్ళిపోతుంటే, విపక్ష సభ్యులు మాత్రం ప్రతి విషయంలోనూ ఎంతో ఓపికతో పరీక్షలు ఎదుర్కోవాల్సి వస్తోంది
భారతదేశం ఈ స్పీకర్ వ్యవస్థను బ్రిటన్‌లోని 'హౌస్ ఆఫ్ కామన్స్' సంప్రదాయం నుంచి స్వీకరించింది. అక్కడ స్పీకర్‌గా ఎన్నికైన వ్యక్తి తన పార్టీకి రాజీనామా చేసి, పూర్తి తటస్థంగా వ్యవహరిస్తారు. మాజీ స్పీకర్ జాన్ బెర్కో వంటి వారు బ్రెగ్జిట్ వంటి క్లిష్ట సమయాల్లో ప్రభుత్వానికి ఇబ్బంది కలిగినా సరే, సభలో చర్చలకే ప్రాధాన్యత ఇచ్చి పీఠం గౌరవాన్ని కాపాడారు. భారత తొలి స్పీకర్ జి.వి. మావళంకర్ కూడా ఇదే సిద్ధాంతాన్ని బలంగా నమ్మేవారు. స్పీకర్ అధికారం సంఖ్యాబలం మీద కాదు, సభలోని ప్రతి ఒక్క సభ్యుడి విశ్వాసం మీద ఆధారపడి ఉండాలని ఆయన నెలకొల్పిన ప్రమాణాలు నేటికీ ఆదర్శప్రాయం.
కేవలం ఎన్నికలు జరిగినంత మాత్రాన అది నిజమైన ప్రజాస్వామ్యం అనిపించుకోదు. ఎన్నికల్లో ఓడిపోయిన వారికి కూడా న్యాయం జరుగుతుందన్న నమ్మకం కలిగినప్పుడే ప్రజాస్వామ్యం బతుకుతుంది. వ్యవస్థలు ఒక్కసారిగా నాశనం కావు.. వాటిపై నమ్మకం తగ్గి అనుమానం మొదలైనప్పుడు మెల్లమెల్లగా బలహీనపడతాయి. సభలో గొడవలు జరిగినప్పుడు వాటిని ఆపే ఒక శాంతి కేంద్రంలా స్పీకర్ కుర్చీ ఉండాలి. కానీ, ఆ కుర్చీలో ఉన్నవారే వివాదాల్లో చిక్కుకుంటే మొత్తం ప్రజాస్వామ్యానికే ప్రమాదం. ఆటలో రెఫరీ మీదనే అనుమానం వస్తే.. ఇక ఆ ఆట పద్ధతిగా సాగే చర్చలా ఉండదు, కేవలం ఒకరిపై ఒకరు అరుచుకునే గందరగోళంలా మిగిలిపోతుంది.
