
ప్రజాసేవలో ప్రధాని మోదీకి అరుదైన మైలురాయి: తెలంగాణ బీజేపీ హర్షం
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సుదీర్ఘ ప్రజా సేవలో సరికొత్త రికార్డును సృష్టించినందుకు తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు ఎన్. రామచందర్ రావు ఆదివారం ఆయనకు అభినందనలు తెలియజేశారు. ముఖ్యమంత్రిగా, ప్రధానమంత్రిగా కలిపి మోదీ అత్యధిక కాలం సేవలందించిన నేతగా నిలవడంపై పార్టీ హర్షం వ్యక్తం చేసింది.
రామచందర్ రావు మాట్లాడుతూ, నరేంద్ర మోదీ ముఖ్యమంత్రిగా, ప్రధానమంత్రిగా కలిపి మొత్తం 8,931 రోజుల ప్రజా సేవను పూర్తి చేసుకున్నారని తెలిపారు. ఈ క్రమంలో సిక్కిం మాజీ ముఖ్యమంత్రి పవన్ కుమార్ చామ్లింగ్ పేరిట ఉన్న రికార్డును మోదీ అధిగమించారని ఆయన పేర్కొన్నారు. ఇది భారత రాజకీయ చరిత్రలోనే ఒక అద్భుతమైన మైలురాయి అని, తెలంగాణ ప్రజల తరపున ఆయనకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలుపుతూ, మోదీ నిండు నూరేళ్లు ఆరోగ్యంగా ఉండాలని ఆకాంక్షించారు.
ఇదే వేదికపై మూసీ నది పునరుజ్జీవనం - వాస్తవాలు అనే అంశంపై జరిగిన కార్యక్రమంలో ఆయన కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. మూసీ నది ప్రక్షాళనను బీజేపీ సమర్థిస్తుందని, అయితే కాంగ్రెస్ ప్రభుత్వం దీనిని అమలు చేస్తున్న తీరును తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని ఆయన స్పష్టం చేశారు. సరైన కారణం లేకుండానే వేలాది మందిని నిరాశ్రయులను చేస్తున్నారని, ప్రభుత్వం నది ప్రక్షాళన కంటే నది చుట్టూ రియల్ ఎస్టేట్ అభివృద్ధిపైనే ఎక్కువ దృష్టి పెట్టిందని ఆరోపించారు. నిర్వాసితులకు అండగా బీజేపీ పోరాడుతుందని, బాధితుల పక్షాన నిలబడతామని రామచందర్ రావు హామీ ఇచ్చారు.
