
ప్రజాసేవలో ప్రధాని మోడీ రికార్డు
దేశ రాజకీయాల్లో అరుదైన మైలురాయిగా నిలిచే విధంగా ప్రధాని నరేంద్రమోడీ ప్రజా జీవితంలో 8,931 రోజులు పూర్తి చేయడం పట్ల కేంద్ర హోంమంత్రి అమిత్‌షా ప్రశంసలు కురిపించారు. ఇదే సమయంలో సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేశ్‌యాదవ్ ఈ రికార్డును తక్కువ చేసి చూపిస్తూ ప్రభుత్వ పనితీరుపై ప్రశ్నలు లేవనెత్తారు.
మోడీపై షా ప్రశంసలు
ప్రధాని మోడీ 8,930 రోజుల రికార్డును అధిగమించి, సిక్కిం మాజీ ముఖ్యమంత్రి పవన్‌కుమార్ చామ్లింగ్ కంటే ఎక్కువకాలం ప్రజా సేవలో కొనసాగిన నాయకుడిగా నిలిచారని అమిత్ షా తెలిపారు. సేవ, కృషి, అంకితభావం కలిసిన మైలురాయి ఇది. మోడీ దశాబ్దాల సేవ దేశ పరిపాలనలో కొత్త యుగాన్ని తీసుకొచ్చిందని షా ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. పేదల సంక్షేమం, అభివృద్ధి, అంతర్జాతీయ వేదికలపై భారత ప్రతిష్ఠ పెంపు వంటి అంశాల్లో మోడీ పాత్ర విశేషమని ఆయన అన్నారు. 24 సంవత్సరాలుగా ఒక్క రోజు కూడా విరామం లేకుండా సేవ చేయడం ఆయన నిబద్ధతకు నిదర్శనమని కొనియాడారు. మోడీ 2001 అక్టోబర్ 7న గుజరాత్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించి, 2014 మే 26న ప్రధాని అయ్యే వరకు ఆ పదవిలో కొనసాగారు. అనంతరం మూడు సార్లు ప్రధానిగా ఎన్నికై ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టుకున్నారు. ఈ సందర్భంగా కేంద్రమంత్రులు, బీజేపీ పాలిత ప్రాంతాల ముఖ్యమంత్రులు, ఎన్డీయే భాగస్వామ్య ముఖ్యమంత్రులు మోడీకి శుభాకాంక్షలు తెలిపారు.
అఖిలేష్ యాదవ్ విమర్శలు
ఇక, ఈ రికార్డు ప్రాధాన్యతపై ప్రశ్నలు లేవనెత్తిన అఖిలేష్ యాదవ్ రోజుల సంఖ్య కాదు, ఫలితాలే ముఖ్యం అన్నారు. దేశ అభివృద్ధి సూచికలు, వ్యక్తి ప్రాతిపదిక ఆదాయం, నిరుద్యోగం, అవినీతి, మహిళల భద్రత వంటి అంశాల్లో పరిస్థితి మెరుగైందా అనే దానిపై సమీక్ష అవసరమని అన్నారు. విదేశాంగ విధానంపై కూడా ఆయన తీవ్ర విమర్శలు గుప్పించారు. యుద్ధం వస్తే మనం ఎవరిపై ఆధారపడాలి? విమానాలు ఫ్రాన్స్ నుంచి, కమ్యూనికేషన్ ఇజ్రాయెల్ నుంచి, మరికొన్ని చైనా నుంచి — ఇది ఎలా బలమైన విదేశాంగ విధానం అవుతుంది? అని ప్రశ్నించారు. ఇరాన్‌తో సంబంధాలు బలహీనపడ్డాయని, పాత మిత్రదేశాలు దూరమయ్యాయని ఆయన ఆరోపించారు. ఇటీవల శ్రీలంక సమీపంలో అంతర్జాతీయ జలాల్లో అమెరికా సబ్‌మరైన్ దాడితో ఇరాన్ యుద్ధనౌక మునిగిన ఘటనను ప్రస్తావిస్తూ అఖిలేష్, ఇలాంటి సందర్భాల్లో భారత్ పాత్ర ఏమిటి? అని ప్రశ్నించారు.
