Let's talk: editor@tmv.in
ప్ర‌జావాణిలో హైడ్రాకు 52 ఫిర్యాదులు

ప్ర‌జావాణిలో హైడ్రాకు 52 ఫిర్యాదులు

Gaddamidi Naveen
28 అక్టోబర్, 2025

క‌బ్జాలు జ‌రుగుతుంటే న‌గ‌ర ప్ర‌జ‌లు చూస్తూ ఊరుకోవ‌డంలేదు. నేరుగా హైడ్రా కార్యాల‌యానికి వ‌చ్చి ప్ర‌జావాణిలో ఫిర్యాదు చేస్తున్నారని హైడ్రా కమిషనర్‌ రంగనాథ్ పేర్కొన్నారు. ఈ సంద‌ర్భంగా కమిషనర్ మాట్లాడుతూ. ర‌హ‌దారి బంద్ అయితే ఫొటోలు తీసి మ‌రీ చూపిస్తున్నారు. చెరువుల్లో ఆక్ర‌మ‌ణ‌లు జ‌రుగుతుంటే వీడియోలు పెడుతున్నారు. ఎవ‌రెవ‌రికి ఫిర్యాదు చేశారో కూడా చెప్పి సాక్ష్యాల‌ను చూపిస్తున్నారు. ద‌శాబ్దాల నాటి స‌మ‌స్య‌లకు గంట‌ల్లో, రోజుల్లో ప‌రిష్కారం చూపుతున్నారంటూ హైడ్రాకు తెలుపుతున్నారని ఆయ‌న పేర్కొన్నారు. ఆ న‌మ్మ‌కంతో వ‌స్తున్నామంటూ ప‌లువురు ఫిర్యాదు చేస్తున్నారు.

సోమ‌వారం హైడ్రా ప్ర‌జావాణికి 52 ఫిర్యాదులందాయి. చాలామంది బాహాటంగా ఫిర్యాదు చేస్తుంటే.. మ‌రి కొంత‌మంది త‌మ వివ‌రాలు బ‌య‌ట‌పెట్ట‌వ‌ద్ద‌ని విచార‌ణాధికారుల‌కు సూచిస్తున్నారని తెలిపారు. బాలాన‌గ‌ర్ మండ‌లం కూక‌ట్‌ప‌ల్లిలోని హ‌స్మ‌త్‌పేట విలేజ్‌లో ప్ర‌భుత్వానికి చెందాల్సిన 10 ఎక‌రాలు క‌బ్జా చేసేస్తున్నారంటూ హైడ్రాకు ఫిర్యాదు అందిందని తెలిపారు. తూములు మూసేసి.. అలుగులు ఎత్తు పెంచ‌డంతో చెరువు పై భాగంలో ఉన్న భూములు, లే ఔట్‌లు నీట మున‌గుతున్నాయ‌ని కొంత‌మంది, చెరువుల్లో మ‌ట్టి పోసి ఎక‌రాల‌కొద్దీ క‌బ్జా చేస్తున్నారంటూ మ‌రికొంత‌మంది ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుల‌ను హైడ్రా క‌మిష‌న‌ర్ ఏవీ రంగ‌నాథ్‌ నేరుగా ప‌రిశీలించి సంబంధిత అధికారుల‌కు ప‌రిష్కార బాధ్య‌త‌ల‌ను అప్ప‌జెప్పారు.

ఫిర్యాదులు ఇలా..

శంషాబాద్ మండ‌లంలోని పెద్ద‌గోల్కొండ గ్రామం ప‌రిధిలోని స‌ర‌సింహ‌కుంట తూములు మూసేసి.. అలుగు ఎత్తు పెంచ‌డం వ‌ల్ల ఎఫ్‌టీఎల్ కంటే ఎక్కువ నీరు నిలిచి త‌మ పంట పొలాలు మునిగిపోయాయ‌ని ఆ గ్రామ ప్ర‌జ‌లు హైడ్రా ప్ర‌జావాణిలో ఫిర్యాదు చేశారు. వాస్త‌వంగా చెరువు ఎంత విస్తీర్ణంలో ఉందో అంతే నీరు నిండేలా చూసి త‌మ పొలాల‌ను ర‌క్షించాల‌ని కోరారు. చెరువు స్థాయికి మించి నిండ‌డంతో ఆ నీరు ఔట‌ర్ రింగు రోడ్డు ఎగ్జిట్ 15 వ‌ద్ద స‌ర్వీసు రోడ్డును ముంచెత్తుతోంద‌ని.. దీంతో రాక‌పోక‌ల‌కు ఇబ్బంది క‌లుగుతోంద‌ని ఫిర్యాదులో పేర్కొన్నారు.

సంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్ మున్సిపాలిటీ, మండ‌లంలోని బీరంగూడ‌లో ఉన్న శాంబుని కుంట క‌బ్జాల‌కు గురి అవుతోంద‌ని స్థానికులు ఫిర్యాదు చేశారు. స‌ర్వే నంబ‌రు 756లో ఉన్న ఈ చెరువు వాస్త‌వ విస్తీర్ణం 22.11 ఎక‌రాలు కాగా.. ప్ర‌స్తుత‌తం ఆరేడు ఎకరాల‌కు ప‌రిమిత‌మైంద‌ని వాపోయారు. చెరువులో మ‌ట్టిపోసి ఆక్ర‌మ‌ణ‌ల‌కు పాల్ప‌డుతున్నార‌ని హైడ్రా చ‌ర్య‌లు తీసుకోక‌పోతే ఆ చెరువు క‌నుమ‌రుగౌతుంద‌ని ఫిర్యాదులో పేర్కొన్నారు.

సాగ‌ర్‌రోడ్డులో ఉన్న య‌శోద‌న‌గ‌ర్ కాల‌నీలో శివారు ఇంటి స్థ‌లాల వారు రోడ్డును క‌లిపేసుకుని దారి లేకుండా చేస్తున్నార‌ని య‌శోద‌న‌గ‌ర్ కాల‌నీ రెసిడెంట్స్ అసోసియేష‌న్ ప్ర‌తినిధులు ఫిర్యాదు చేశారు. మ‌రో రోడ్డును ఆక్ర‌మించేసి 107 గ‌జాల ప్లాట్ స్థ‌లంగా చూపిస్తున్నార‌ని పేర్కొన్నారు. దీంతో లే ఔట్‌లోని ర‌హ‌దారులు దాటాలంటేనే కిలోమీట‌ర్లు ప్ర‌యాణించాల్సి వ‌స్తోంద‌ని వారు వాపోయారు.

కూక‌ట్‌ప‌ల్లి ప్రాంతంలో ప‌రికి చెరువులో సుమారు 12 ఎక‌రాల మేర రాత్రికి రాత్రి మ‌ట్టిపోసి నింపుతున్నార‌ని.. నంబ‌రు ప్లేటు లేని వాహ‌నాల‌ను వినియోగిస్తున్నార‌ని అక్క‌డి నివాసితులు ఫిర్యాదు చేశారు. 18 అంత‌స్తుల అపార్టుమెంట్ ను నిర్మించి అమ్మేసేందుకు సిద్ధం అవుతున్నార‌ని.. వెంట‌నే హైడ్రా ఆపాల‌ని కోరారు. లేని ప‌క్షంలో అందులో ప్లాట్లు కొన్న వారు మోస‌పోయే ప్ర‌మాదం ఉంద‌ని ఫిర్యాదులో పేర్కొన్నారు.

అమీన్‌పూర్ పెద్ద చెరువులోకూడా మ‌ట్టిపోసి.. భ‌వ‌న నిర్మాణాలు చేప‌డుతున్నార‌ని.. అడ్డుకున్న త‌మపై దాడి చేయ‌డ‌మే కాకుండా స్థానిక పోలీసు స్టేష‌న్లో కేసులు పెట్టి భ‌య‌భ్రాంతుల‌కు గురి చేస్తున్నార‌ని ప‌లువురు ఫిర్యాదు చేశారు.

మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లాలోని బాలానగర్ మండలం, హస్మత్‌పేట్ గ్రామంలో ఉన్న ప్రభుత్వ భూమి ఆక్రమణల‌పై ఓల్డ్ బోయిన్‌పల్లి నివాసులు హైడ్రా ప్రజావాణి లో ఫిర్యాదు చేశారు. సర్వే నంబర్ 1లోని 28.28 ఎకరాల ప్రభుత్వ భూమిని స్థానిక రాజకీయ నాయకులు ఆక్రమించినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. నిజాం కాలం నాటి చారిత్ర‌క ప్రాధాన్యం ఉన్న ఈ భూమిని 1953లో పురావ‌స్తు శాఖ గ‌జిట్ బుక్ లో కూడా యాడ్ చేసింది. కూకట్‌పల్లి నియోజకవర్గానికి చెందిన స్థానిక నాయ‌కుల‌తో పాటు వారి అనుచరులు ఈ భూమిని రియల్ ఎస్టేట్ వెంచర్‌గా మలచి చిన్నచిన్న ప్లాట్లుగా అమ్మేస్తున్నార‌ని ఫిర్యాదులో పేర్కొన్నట్లు హైడ్రా అధికారులు తెలిపారు.