
ప్రజావాణికి రెండేళ్లు: 74 శాతం ఫిర్యాదులు పరిష్కరించాం - డిప్యూటీ సీఎం భట్టి
జ్యోతిరావు ఫూలే ప్రజాభవన్‌లో శుక్రవారం నిర్వహించిన ప్రజావాణి రెండవ వార్షికోత్సవ కార్యక్రమం రాష్ట్రంలో ప్రజాపాలనకు మరో మైలురాయిగా నిలిచింది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆధ్వర్యంలో కొనసాగుతున్న ప్రజావాణి కార్యక్రమం, ప్రజల సమస్యలను నేరుగా విని తక్షణ పరిష్కారాలు చూపే సమర్థ వేదికగా గుర్తింపు పొందుతోంది. ఈ వార్షికోత్సవ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు పొన్నం ప్రభాకర్, జూపల్లి కృష్ణారావు ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మాట్లాడుతూ, దేశంలోనే ప్రజల గోడును ఇంత క్రమబద్ధంగా విని పరిష్కరిస్తున్న కార్యక్రమం మరెక్కడా లేదని తెలిపారు. ప్రజావాణి ద్వారా ప్రభుత్వం ప్రజలకు మరింత దగ్గరై, బాధ్యతాయుతమైన పరిపాలన అందిస్తోందని ఆయన పేర్కొన్నారు. ఇది ప్రజాస్వామ్యానికి బలమైన ఉదాహరణగా నిలుస్తోందని అన్నారు. ఇప్పటి వరకు ప్రజావాణి ద్వారా అందిన దరఖాస్తుల్లో దాదాపు 74 శాతం సమస్యలు పరిష్కారమయ్యాయని డిప్యూటీ సీఎం వెల్లడించారు. ఇది ప్రజల పట్ల ప్రభుత్వానికి ఉన్న నిబద్ధతకు నిదర్శనమని పేర్కొన్నారు. ఈ విజయానికి కారణమైన అన్ని శాఖల అధికారులకు ఈ సందర్భంగా హృదయపూర్వక అభినందనలు తెలిపారు.
భవిష్యత్తులో ప్రజావాణి కార్యక్రమాన్ని మరింత పారదర్శకంగా, వేగవంతంగా అమలు చేయడానికి సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ సాంకేతిక సహకారంతో రాష్ట్ర, జిల్లా స్థాయిలో ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌ను ప్రవేశపెట్టనున్నట్లు తెలిపారు. దీని ద్వారా ప్రజల ఫిర్యాదుల నమోదు, పరిశీలన, పరిష్కార ప్రక్రియ మరింత సమర్థవంతంగా సాగనుందని ఆయన పేర్కొన్నారు.
ఆర్టీసీ ఉద్యోగులు, డబుల్ బెడ్రూం లబ్ధిదారుల ఇంట వెలుగులు: మంత్రి పొన్నం
ప్రజల ఫిర్యాదులను సమర్థంగా పరిష్కరించినందుకు అధికారుల సేవలను ఈ సందర్భంగా కొనియాడారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. ప్రజావాణి వేదికగా గతంలో ఆర్టీసీలో శాశ్వతంగా సర్వీసు నుంచి తొలగించబడిన 242 మంది ఉద్యోగులను తిరిగి విధుల్లోకి తీసుకోవడం పట్ల ఆర్టీసీ ఉద్యోగులు సంతోషం వ్యక్తం చేశారు. ఇది తమ జీవితాల్లో కొత్త ఆశలు నింపిందని వారు మంత్రి పేర్కొన్నారు.
అలాగే, ప్రజావాణి ద్వారా సుదీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న 1750 మంది డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల లబ్ధిదారుల సమస్యలు పరిష్కారమై, వారికి ఇళ్ల కేటాయింపు జరగడం పట్ల లబ్ధిదారులు ఆనందం వ్యక్తం చేశారని. ఇది తమ కల నెరవేరిన క్షణమని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా ఆదిలాబాద్ జిల్లాలో దళిత రైతుల సమస్యల పరిష్కారం, అలాగే విదేశాల్లో ఉన్న గల్ఫ్ బాధితుల సమస్యల పరిష్కారానికి ప్రజావాణి తీసుకున్న చర్యలు వివరించారు. ప్రజావాణి ప్రజల జీవితాల్లో సానుకూల మార్పులకు దోహదపడుతోందని మంత్రి పేర్కొన్నారు.
