Let's talk: editor@tmv.in
ప్రజాపాలన జనరంజకమా? ప్రజా సంకటమా

ప్రజాపాలన జనరంజకమా? ప్రజా సంకటమా

Pinjari Chand
1 సెప్టెంబర్, 2026

తెలంగాణలో కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి వెయ్యి రోజుల పాలనను నేడు పూర్తి చేసుకుంటోంది. దీంతో‘ప్రజాపాలన’పై రాష్ట్రంలో వాడీవేడి రాజకీయ చర్చ ఊపందుకుంది. ఎన్నికల సమయంలో ఇచ్చిన ఆరు గ్యారంటీలు, గుప్పించిన అనేక హామీలు, వివిధ డిక్లరేషన్ల అమలుపై అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. హామీలను పూర్తిస్థాయిలో అమలు చేయలేదంటూ బీఆర్‌ఎస్‌, బీజేపీ ఇతర పార్టీలు దుమ్మెత్తిపోస్తుండగా, ప్రభుత్వం మాత్రం తాము అధికారంలోకి వచ్చిన తర్వాత పలు కీలక నిర్ణయాలు, సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టామని చెబుతోంది. ప్రభుత్వం నేటి వరకు ఎన్ని హామీలను అమలు చేసింది? ప్రతిపక్షాలు విమర్శిస్తున్నట్లు ఇచ్చిన గ్యారంటీలను ఎన్నింటిని విస్మరించింది? అన్నది ఓ సారి ఆత్మావలోకనం చేసుకుంటే ఇది ఎంతవరకు ప్రజాపాలన లేక ప్రజా సంకట పరిపాలన అన్నది అవగతమవుతుంది.

చేసింది చాలా ఉన్నా.. చెప్పుకోలేని పరిస్థితి

ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అనేక అభివృద్ధి, సంక్షేమ పథకాలను అమలు చేస్తోంది. వీటిని ప్రజల్లోకి తీసుకెళ్లడంలో కాంగ్రెస్‌ విఫలమవుతోంది. రుణమాఫీ, మహలక్ష్మీ, గృహజ్యోతి,సన్నబియ్యం, కొత్త రేషన్ కార్డులు ఇవ్వడం, సన్నవడ్లకు రూ. 500 బోనస్, రాజీవ్‌ ఆరోగ్య శ్రీ కవరేజీ పరిమితి పెంపు, ఇందిరమ్మ ఇళ్లు, వ్యవసాయ కూలీలకు ఇస్తున్న ఆత్మీయ భరోసా, తదితర పథకాలను గురించి ప్రచారం చేసుకోవడంలో సతమతమవుతోంది. ఈ పథకాలు అన్ని వర్గాలకు ఇస్తుండడం మంచి పరిణామమే అయినప్పటికీ క్షేత్రస్థాయిలోకి తీసుకెళ్​లడంలో తడబడుతోంది. పావలా పనికి వంద రూపాయల విస్తృత ప్రచారం చేసుకుంటున్న ఈ రోజుల్లో కాంగ్రెస్‌ మాత్రం ఆపసోపాలు పడుతోంది. అలాగే రాష్ట్రంలో విద్య, వైద్యానికి సంబంధించి పలు ఆస్పత్రులను, ఇంటి గ్రేటెడ్‌ రెసిడెన్షియల్‌ పాఠశాలలను ప్రారంభించడం, రవాణా పరంగా మౌలిక వసతులు కల్పించడానికి హ్యమ్‌ రోడ్లను తీసుకు రావడం లాంటి అభివృద్ధి పనులను చేపట్టినప్పటికీ పబ్లిసిటీ చేసుకోవడంలో ఆయాస పడుతోంది. ముఖ్యంగా ‘కులగణన’ నేడు దేశంలో ఆదర్శంగా నిలుస్తోన్న సర్వేను కూడా ప్రజల్లోకి తీసుకుపోలేకపోవడం ప్రభుత్వ అసమర్థతను ఎత్తి చూపుతోంది.

ఆరు గ్యారంటీలపై ప్రతిపక్షాల విస్తృత చర్చ

2023 అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్‌ ప్రకటించిన ఆరు గ్యారంటీల్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కోసం ప్రవేశపెట్టిన ‘మహాలక్ష్మీ’ పథకం, ఆరోగ్యశ్రీ పరిమితి పెంపు వంటి కొన్ని హామీలను ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే అమలు చేసింది. అలాగే రైతు రుణమాఫీకి కూడా ప్రభుత్వం భారీగా నిధులు విడుదల చేసింది. సుమారు 25 లక్షల మంది అన్నదాతలకు రూ. 2 లక్షల చొప్పున దాదాపు రూ.20 వేల కోట్ల రుణమాఫీ చేశామని ఘనంగా చెప్పుకుంటోంది. రైతు భరోసా ఏడాదికి రూ.15 వేలు ఇస్తామని, రూ.12 వేలు ఇచ్చి సేద తీరుతోంది. అది కూడా సరిగా ఇవ్వడం లేదన్న ఆవేదన రైతుల్లో ప్రబలంగా నెలకొని ఉంది. కౌలు రైతులను ఆదుకుంటామన్న హామీ కూడా మేనిఫెస్టో మీద రాతగానే మిగిలిపోయింది. దాంతో పాటు ఇప్పటికీ రైతులందరికీ రుణమాఫీ కాలేదని, అయినట్టు నిరూపిస్తే తాము రాజకీయ సన్యాసం తీసుకుంటామని ప్రతిపక్ష నాయకులు సవాళ్లు విసురుతున్నా.. కిమ్‌ అనడం లేదు. మహిళలకు ఇస్తామన్న రూ. 2500 ఆర్థిక సాయం, రూ.500కే వంట గ్యాస్‌ సిలిండర్‌‌ ఎవరికీ అందుతున్నయో కూడా తెలియని పరిస్థితి దాపురించింది. యువతకు ఉద్యోగాలు కల్పిస్తాం, జాబ్‌ క్యాలెండర్‌ విడుదల చేస్తామన్న హామీలు అంతంతమాత్రంగానే ఉన్నాయి. మూసీ రివర్‌‌ ఫ్రంట్‌కు సంబంధించి భూసేకరణ, ల్యాండ్‌ పూలింగ్‌పై ప్రభుత్వం దూకుడు మీద ఉన్నప్పటికీ, ప్రజలను ఇబ్బందులు పెడుతూ ముందుకు పోవడం రానున్న జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో ప్రభావం చూపే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.

అభివృద్ధిని కమ్మేసిన ధిక్కార స్వరాలు

కాంగ్రెస్‌లో కార్యకర్తల నుంచి పెద్ద స్థాయి నాయకుల వరకు వాక్‌ స్వాతంత్రం మరీ ఎక్కువ. ఎవరు ఏదైనా మాట్లాడొచ్చు. గల్లీ లీడర్‌‌ ఢిల్లీ నాయకుడిపై కూడా విమర్శలు ఎక్కుపెట్టొచ్చు. ఈ రకమైన ప్రజాస్వామ్యం నాయకుల్లో హద్దులు దాటిపోతోంది. చిన్నా, పెద్ద లేకుండా పోయింది. అంతర్గత కుమ్ములాటలతో ప్రజల్లో ఏహ్య భావాన్ని మూటగట్టుకుంటోంది. సీఎం రేవంత్‌రెడ్డిపై మంత్రి కొండా సురేఖ వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం, కూతురు సుస్మితా సీఎంకే వార్నింగ్‌లు ఇస్తున్నా వారించకపోవడం, ఎమ్మెల్యే కొమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి నిత్యం మంత్రి పదవి కోరుతూ పంటికింద రాయిలా మారడం, అనిరుధ్‌రెడ్డి, యెన్నం శ్రీనివాస్‌ రెడ్డి లాంటి వారు తమ నియోజక వర్గ అభివృద్ధికి కూడా కనీసం నిధులు ఇవ్వడం లేదని బాహాటంగా మాట్లాడడం, వ్యాసాలు రాయడం, చిన్నారెడ్డి లాంటి సీనియర్‌‌ నేతలు కూడా పార్టీలోని ప్రజాప్రతినిధులపై ఆరోపణలు చేయడం, నియోజక వర్గాల్లో గ్రూపు తగాదాలు పెరగడం ప్రభుత్వానికి ఉక్కపోతగా మారాయి. ఇలాగే అడ్డు, అదుపు లేకుండా పోతే రానున్న ఎన్నికల్లో నష్టపోయే ప్రమాదాలు లేకపోలేదు. మొదట్లోనే కట్టడి చేయకపోతే చేతులు కాలాక ఆకులు పట్టుకున్న చందంగా తయ్యారయ్యే వీలుంది.

దూకుడు పెంచిన బీఆర్‌ఎస్‌

అసెంబ్లీ ఎన్నికల్లో అధికారం కోల్పోయిన తర్వాత బీఆర్‌ఎస్‌ క్రమంగా ప్రభుత్వంపై దూకుడైన విమర్శలకు పదును పెంచుతోంది. వెయ్యి రోజుల పాలనను లక్ష్యంగా చేసుకుని ‘వెయ్యి రోజుల ద్రోహం’ పేరుతో ప్రచార కార్యక్రమాలకు సిద్ధమవుతోంది. ప్రభుత్వం ఇచ్చిన హామీలు, అవినీతి ఆరోపణలు, వివిధ వర్గాల సమస్యలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని పార్టీ శ్రేణులకు కేటీఆర్‌ ఇప్పటికే దిశానిర్దేశం చేశారు. సెప్టెంబర్‌‌ 2 నుంచి 8వ తేదీ వరకు పోరుబాటకు సమాయత్తమవుతోంది. ప్రభుత్వం కాళేశ్వరం , ఈ–ఫార్మూలా రేసులో అవినీతి జరిగిందని చెప్పి కమిషన్లు, కేసులు నమోదు చేసినా గులాబీ పార్టీ నాయకులు విమర్శలను సంధించడంలో ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదు. ప్రభుత్వంలోని ధిక్కార స్వరాల మాటలే వారికి అస్త్రాలుగా మారుతున్నాయి. వాటిని అందిపుచ్చుకుని నిత్యం అనేక అంశాల్లో ప్రభుత్వాన్ని ఇరుకున పెడుతున్నారు.

ప్రజల సమాధానమే గీటురాయి

మూడు సంవత్సరాల దరిదాపు పాలనను కేవలం ప్రభుత్వ ప్రకటనలు, ప్రతిపక్ష ఆరోపణల ఆధారంగా అంచనా వేయడం కంటే ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల్లో ఎన్ని అమలయ్యాయి? ఎంతమందికి ప్రయోజనం చేకూరింది? అభివృద్ధి పనులు ఎంతవరకు పూర్తయ్యాయి? ఉద్యోగాలు, రైతులు, మహిళలు, యువత, పేదల విషయంలో మార్పు ఎంత వచ్చింది? అనే అంశాలపై ప్రజల సమాధానమే అసలైన గీటురాయి. దాంతో పాటు అధికార పక్షం తమ విజయాలను సమర్థంగా ప్రజల్లోకి తీసుకెళ్లగలిగితేనే ప్రతిపక్షాల విమర్శలకు ధీటుగా సమాధానం ఇచ్చినట్లవుతుంది. అదే సమయంలో బీఆర్‌ఎస్‌ లేవనెత్తుతున్న ప్రశ్నలకు ప్రభుత్వం స్పష్టమైన లెక్కలు, గణాంకాలతో సమాధానం ఇవ్వాల్సిన అవసరం ఉంది. లేకుంటే తెలంగాణ వచ్చిన దాదాపు దశాబ్దానికి జవజీవాలు కూడకట్టుకుని బొటాబోటి మెజార్టీతో అధికారం చేపట్టిన కాంగ్రెస్‌ పార్టీ రానున్న ఎన్నికల్లో కాడి కిందపడేయక తప్పదు. రాష్ట్రంలోని సబ్బండ వర్ణాలను సంతృప్తి పరిచినప్పుడే మరోసారి అధికార పీఠాన్ని కైవసం చేసుకోగలదు.

సీఎం రేవంత్‌ రెడ్డి ధీమా

ప్రభుత్వం, ప్రతిపక్షాల ఆరోపణల మధ్య రాజకీయ విశ్లేషకులను ఆశ్చర్యపరుస్తున్న మరో అంశం రేవంత్‌రెడ్డి మళ్లీ రెండోసారి అధికారంలోకి వస్తామని బలంగా చెప్పడం. ఏ పథకం ఆయనను ఇంకోసారి ముఖ్యమంత్రి పీఠం అధిష్టించేలా చేస్తోంది? ఏ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు కాంగ్రెస్‌ తిరిగి పగ్గాలు చేపట్టడానికి మంత్రదండంగా మారనున్నాయనే అంశాలు విశ్లేషణలో పడేశాయి. కొట్లాదిమంది మహిళలు ఉపయోగించుకుంటున్న మహాలక్ష్మీ పథకమా?, సన్నబియ్యం, వడ్లకు బోనస్, లక్షలాది మంది లబ్దిదారులైన రుణమాఫీ, రైతు భరోసా పథకాలు కీలకంగా మారతాయా? ప్రతిపక్ష నాయకుడు ఫాంహౌస్‌కు పరిమితం కావడం కలిసోస్తుందా? అన్నది కాలమే సమాధానం చెబుతుంది.