Let's talk: editor@tmv.in
ప్రజానుకూల పాలనకు ఈ వేయి రోజులే సాక్ష్యం: సీఎం సిద్ధరామయ్య

ప్రజానుకూల పాలనకు ఈ వేయి రోజులే సాక్ష్యం: సీఎం సిద్ధరామయ్య

Pinjari Chand
15 ఫిబ్రవరి, 2026

తన ప్రభుత్వం సంక్షేమ కార్యక్రమాలు, ఆర్థిక వృద్ధిలో రికార్డులు సృష్టించిందని కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య శనివారం పేర్కొన్నారు. అధికారంలో 1,000 రోజులు పూర్తి చేసుకున్న నేపథ్యంలో, ఈ కాలం ప్రజలందరికీ సమగ్ర అభివృద్ధి అందించాలనే తమ నిబద్ధతను ప్రతిబింబిస్తోందని అన్నారు. జిల్లా పరిపాలన, రెవెన్యూ శాఖ సంయుక్తంగా నిర్వహించిన 1,000 రోజుల వేడుకల కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా లక్ష మంది లబ్ధిదారులకు హక్కు పత్రాలు (టైటిల్ డీడ్లు) పంపిణీ చేసే కార్యక్రమాన్ని కూడా ప్రారంభించారు.

రెవెన్యూ శాఖ ద్వారా రెండోసారి లక్ష మంది లబ్ధిదారులకు హక్కు పత్రాలు అందిస్తున్నాం. ఇప్పటివరకు 2.20 లక్షల కుటుంబాలకు టైటిల్ డీడ్లు పంపిణీ చేసి రికార్డు సృష్టించామని సీఎం తెలిపారు. తమ ప్రజానుకూల ప్రభుత్వమే రాష్ట్ర జీడీపీని దేశంలో నంబర్ వన్ స్థానానికి చేర్చిందని, జీఎస్టీ వసూళ్లలో కూడా రాష్ట్రం రికార్డు వేగంతో ముందుకెళ్తోందని ఆయన డేటా వివరాలతో పేర్కొన్నారు. ప్రస్తుతం ప్రభుత్వం రెండు సంవత్సరాలు తొమ్మిది నెలలు పూర్తి చేసుకుందని, ఎన్నికల సమయంలో ఇచ్చిన 590 హామీలలో 243 ఇప్పటికే నెరవేర్చామని తెలిపారు. మిగిలిన హామీలను కూడా పదవీకాలంలోనే పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు.

2013–18 మధ్య తన గత పదవీకాలాన్ని ప్రస్తావిస్తూ, ఆ సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన అన్ని హామీలను నెరవేర్చడమే కాకుండా మేనిఫెస్టోలో లేని 30 అదనపు హామీలను కూడా అమలు చేసి మాట ఇచ్చి నిలబెట్టుకున్న ప్రభుత్వంగా నిలిచిందని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న గ్యారంటీ పథకాల ద్వారా ఇప్పటివరకు రూ.1.18 లక్షల కోట్ల మేర నేరుగా ప్రజలకు లబ్ధి చేకూరిందని తెలిపారు. మా ప్రభుత్వం ఫిబ్రవరి 13న 1,000 రోజులు పూర్తి చేసుకుంది. ఈ విజయోత్సవం మా ప్రజానుకూల నిబద్ధతకు నిదర్శనం. పేదలు, దళితులు, వెనుకబడిన వర్గాలు, మైనారిటీలు, మహిళలు, కార్మికుల అభ్యున్నతికి మేము కట్టుబడి ఉన్నామని సిద్ధరామయ్య అన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని సమీక్షించి జిల్లాల అభ్యర్థనలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. రెవెన్యూ మంత్రి కృష్ట బైరి గూడ బాధ్యతలు స్వీకరించిన తర్వాత శాఖలో విప్లవాత్మక మార్పులు వచ్చాయని ప్రశంసించారు.

బీజేపీ తప్పుడు ప్రచారం చేస్తోంది

బీజేపీపై విమర్శలు గుప్పిస్తూ, అధికారంలో ఉన్నప్పుడు హామీలు నెరవేర్చలేకపోయిన ఆ పార్టీ ఇప్పుడు రాష్ట్ర ఖజానా ఖాళీ అయిందని తప్పుడు ప్రచారం చేస్తోందని అన్నారు. ఆర్థిక నిపుణులు అమర్త్యసేన్, అభిజిత్ బెనర్జీ తదితరులు వ్యక్తం చేసిన అభిప్రాయాలు, పత్రికలు, విశ్వవిద్యాలయాల అధ్యయనాలు తమ పాలనకు మద్దతిస్తున్నాయని తెలిపారు. 2019–2023 మధ్య అధికారంలో ఉన్న బీజేపీ రాష్ట్ర అభివృద్ధికి ఏమి చేయలేదని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి తగిన గ్రాంట్లు ఇవ్వకుండా అన్యాయం చేస్తోందని విమర్శించారు. జీఎస్టీ పరిహారం లోటుతో రాష్ట్రానికి రూ.12,000–15,000 కోట్ల నష్టం వాటిల్లిందని తెలిపారు. జల్ జీవన్ మిషన్ కింద రూ.15,000 కోట్లు విడుదల కావాల్సి ఉందని, ఆ నిధులు అందితే రాష్ట్రవ్యాప్తంగా అనేక అభివృద్ధి పనులు చేపట్టవచ్చని అన్నారు. మాజీ ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై, కేంద్ర మంత్రి ప్రహ్లద్ జోషి, బీజేపీ నేత జగదీశ్ షట్టర్ రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయంపై ఢిల్లీలో ఒక్క మాట కూడా మాట్లాడలేదని విమర్శించారు. కార్యక్రమంలో అత్యుత్తమ సేవలందించిన అధికారులను సత్కరించారు. ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర నాయకులు పాల్గొన్నారు.

ప్రజానుకూల పాలనకు ఈ వేయి రోజులే సాక్ష్యం: సీఎం సిద్ధరామయ్య - Tholi Paluku