Let's talk: editor@tmv.in
ప్రజల వద్దకు బడ్జెట్… జిల్లాల్లో త్వరలో బడ్జెట్ సమావేశాలు: పయ్యావుల కేశవ్

ప్రజల వద్దకు బడ్జెట్… జిల్లాల్లో త్వరలో బడ్జెట్ సమావేశాలు: పయ్యావుల కేశవ్

Dantu Vijaya Lakshmi Prasanna
12 మార్చి, 2026

రాష్ట్ర బడ్జెట్‌ను నేరుగా ప్రజలకు చేరవేయడానికి ప్రభుత్వం ప్రత్యేక కార్యక్రమాన్ని రూపొందిస్తోందని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ తెలిపారు. త్వరలోనే జిల్లాల వారీగా బడ్జెట్ సమావేశాలు నిర్వహించి ప్రజలకు బడ్జెట్‌లోని ముఖ్యాంశాలను వివరించనున్నట్లు చెప్పారు. సచివాలయంలో నిర్వహించిన కలెక్టర్ల సమావేశంలో ఆయన అధికారులకు రాష్ట్ర ఆర్థిక లక్ష్యాలు, అభివృద్ధి ప్రణాళికలపై దిశానిర్దేశం చేశారు.

మంత్రి మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మార్గదర్శకత్వంలో ఈసారి ఆర్థిక శాఖ వినూత్న విధానంతో ముందుకెళ్తోందన్నారు. గతంలో మార్చి 31 వరకు కూడా బడ్జెట్ ప్రక్రియ పూర్తికాని సందర్భాలు ఉండేవని, అయితే ఈసారి సుమారు 20 రోజుల ముందుగానే బడ్జెట్ సిద్ధం చేయగలిగామని పేర్కొన్నారు. గత రెండేళ్లుగా ప్రభుత్వం ఎన్నో సవాళ్లను ఎదుర్కొని ముందుకు సాగిందని, ప్రస్తుతం రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ తిరిగి బలపడుతూ అభివృద్ధి దిశగా దూసుకెళ్తోందన్నారు.

రాబోయే ఆర్థిక సంవత్సరం రాష్ట్రానికి “అసాధారణ వృద్ధి సంవత్సరం” గా నిలవబోతోందని మంత్రి కేశవ్ పేర్కొన్నారు. ఈ లక్ష్యాన్ని సాధించడానికి అన్ని శాఖల అధికారులు ద్విగుణీకృత ఉత్సాహంతో పనిచేయాలని ఆయన సూచించారు. అభివృద్ధి ప్రణాళికలు వేగంగా అమలు చేసి రాష్ట్ర ఆర్థిక వృద్ధిని పెంచడంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని తెలిపారు.

కుటుంబ బడ్జెట్ తరహాలో రాష్ట్ర బడ్జెట్

ఈసారి రాష్ట్ర బడ్జెట్‌ను సాధారణ కుటుంబ బడ్జెట్ మాదిరిగా రూపొందించామని మంత్రి తెలిపారు. ప్రజలకు సులభంగా అర్థమయ్యే విధంగా బడ్జెట్ రూపకల్పన చేయడం ముఖ్యమంత్రి లక్ష్యమని చెప్పారు. బడ్జెట్ వివరాలను కేవలం అసెంబ్లీకి పరిమితం చేయకుండా క్షేత్రస్థాయికి తీసుకెళ్లాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. అందుకోసం జిల్లాల వారీగా సమావేశాలు నిర్వహించి ప్రజలకు బడ్జెట్ కేటాయింపులు, అభివృద్ధి కార్యక్రమాలను వివరించనున్నట్లు తెలిపారు.

జిల్లాల వారీగా బడ్జెట్ కేటాయింపులు ఎలా ఖర్చు చేయాలో అధికారులు ముందుగానే ప్రణాళికలు రూపొందించాలని మంత్రి సూచించారు. అలాగే ప్రతి శాఖకు సంబంధించిన బడ్జెట్ వివరాలను జిల్లాల వారీగా విభజించి ప్రజలకు వివరించేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు. దీని ద్వారా ప్రజలకు ప్రభుత్వ అభివృద్ధి ప్రణాళికలు స్పష్టంగా అవగాహన కలుగుతుందని తెలిపారు.

కేంద్ర నిధులు ఒక్క పైసా కూడా వృథా కాకూడదు

కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే నిధులను పూర్తిస్థాయిలో వినియోగించాలని మంత్రి అధికారులకు స్పష్టం చేశారు. వివిధ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాల కోసం కేంద్రం కేటాయించే ప్రతి రూపాయిని సమర్థంగా ఖర్చు చేయాలని సూచించారు. కొన్ని చోట్ల నిధుల వినియోగంలో నిర్లక్ష్యం కనిపిస్తోందని ఆయన పేర్కొన్నారు.

కేంద్ర నిధులు ఏ శాఖల్లో ఖర్చు కాకుండా మిగిలిపోతున్నాయో గుర్తించి వెంటనే వినియోగించేందుకు చర్యలు తీసుకోవాలని శాఖాధిపతులకు మంత్రి ఆదేశించారు. కేటాయించిన నిధులు వృథా కాకుండా పూర్తి స్థాయిలో వినియోగించడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు.

అదేవిధంగా రాష్ట్ర అభివృద్ధి కోసం రూపొందించిన “స్వర్ణాంధ్ర విజన్ 2047” లక్ష్యాల సాధనలో అధికారులు కీలక పాత్ర పోషించాలని మంత్రి కేశవ్ పేర్కొన్నారు. జీఎస్‌డీపీ వృద్ధి లక్ష్యాలను సాధించడానికి పది సూత్రాల కార్యక్రమాన్ని అమలు చేయాలని, అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. రాష్ట్రాన్ని వేగవంతమైన ఆర్థికాభివృద్ధి దిశగా తీసుకెళ్లడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని మంత్రి స్పష్టం చేశారు.