Let's talk: editor@tmv.in
ప్రజల మాటకు వేదికగా… ‘మీట్ యువర్ సీపీ’

ప్రజల మాటకు వేదికగా… ‘మీట్ యువర్ సీపీ’

Sirisha B
6 ఫిబ్రవరి, 2026

హైదరాబాద్ నగర ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకుని, తక్షణ పరిష్కార మార్గాలు చూపేందుకు హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వి.సి. సజ్జనార్ ఐపీఎస్ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ‘మీట్ యువర్ సీపీ’ పేరిట ప్రారంభమైన ఈ కార్యక్రమం ద్వారా ప్రజలు ఇకపై నేరుగా పోలీస్ కమిషనర్‌ను కలుసుకుని తమ సమస్యలు, ఫిర్యాదులు, సందేహాలను తెలియజేసే అవకాశం కల్పించారు.

ఈ కార్యక్రమం ప్రతి రోజు మధ్యాహ్నం 2 గంటల నుంచి హైదరాబాద్ సిటీ పోలీస్ ప్రధాన కార్యాలయంలో ప్రజలతో ప్రత్యక్ష సమావేశం నిర్వహించనున్నట్లు సీపీ సజ్జనార్ తెలిపారు. నగరంలోని శాంతిభద్రతలు, ట్రాఫిక్ సమస్యలు, సైబర్ నేరాలు, మహిళా భద్రత, స్థానిక సమస్యలు వంటి అంశాలపై ప్రజలు తమ అభిప్రాయాలను, ఫిర్యాదులను స్వయంగా వివరించవచ్చు అని వారి ఇబ్బందులను అర్థం చేసుకుని, పోలీస్ శాఖపై నమ్మకం మరింత బలపడేలా చేయడమే ఈ కార్యక్రమ ప్రధాన ఉద్దేశమని ఆయన పేర్కొన్నారు.

ప్రత్యేకంగా ప్రతి శుక్రవారం రోజున పాతబస్తీలోని కోత్వాల్ హౌస్‌లో ఈ సమావేశం నిర్వహించనున్నట్లు తెలిపారు. దీని ద్వారా పాతబస్తీ ప్రాంత ప్రజలు కూడా సులభంగా తమ సమస్యలను కమిషనర్ దృష్టికి తీసుకురావాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వివరించారు.

ఈ కార్యక్రమానికి ముందస్తు అపాయింట్‌మెంట్ అవసరం లేదని అధికారులు స్పష్టం చేశారు. ఎవరైనా సరే నేరుగా వచ్చి తమ సమస్యను తెలియజేయవచ్చని, ప్రతి ఫిర్యాదును క్షుణ్ణంగా పరిశీలించి పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని సీపీ స్పష్టం చేశారు.

ప్రజలతో ప్రత్యక్ష సంభాషణ ద్వారా పోలీస్-ప్రజల మధ్య నమ్మకాన్ని మరింత బలోపేతం చేయడమే ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యమని సజ్జనార్ పేర్కొన్నారు. ప్రజల సమస్యలు తమ బాధ్యతగా భావిస్తూ, సురక్షితమైన నగర నిర్మాణానికి ప్రతి ఒక్కరి సహకారం అవసరమని పేర్కొంది.

“మీ సమస్యలు మీవే కావు… అవి మా బాధ్యత” అనే సందేశంతో ప్రారంభమైన ‘మీట్ యువర్ సీపీ’ కార్యక్రమం నగర ప్రజల నుంచి మంచి స్పందన పొందుతుందని అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

ప్రజల మాటకు వేదికగా… ‘మీట్ యువర్ సీపీ’ - Tholi Paluku