
ప్రజల బారులు.. సిలిండర్ల వరుసలు
పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఘర్షణల ప్రభావంతో వాణిజ్య ఎల్పీజీ సరఫరాలో అంతరాయం ఏర్పడుతోంది. దేశంలో ప్రజలు వంట గ్యాస్ కోసం ఉదయం నుంచే బారులు తీరుతున్నారు. గ్యాస్ ఏజెన్సీల ముందు సిలిండర్ల కోసం పొడవైన క్యూలు దర్శనమిస్తున్నాయి. అలాగే దేశవ్యాప్తంగా హోటళ్లు, రెస్టారెంట్లు, వీధి ఆహార వ్యాపారులు ఇండక్షన్ స్టవ్‌లు, మైక్రోవేవ్‌లు, కట్టెలు, సౌరశక్తి వంటి ప్రత్యామ్నాయాలను వినియోగించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇక గ్యాస్ కొరత ప్రభావం దేశం అంతటా కనిపిస్తోంది. సిలిండర్ బండల కోసం కొన్నిచోట్ల ప్రజలు గొడవలు పడిన సంఘటనలు కూడా వెలుగులోకి వచ్చాయి..
ఎల్పీజీపై ఆందోళన: పలు రాష్ట్రాల్లో క్యూలు, ప్రభుత్వాల భరోసా
ఎల్పీజీ ధరలు పెరగనున్నాయన్న పుకార్ల నేపథ్యంలో ఉత్తరప్రదేశ్‌లోని బస్తీలో గ్యాస్ సిలిండర్ల కోసం వినియోగదారులు భారీగా తరలివచ్చారు. మహాగురి గ్యాస్ ఏజెన్సీ వద్ద గురువారం తెల్లవారుజామునే పెద్ద క్యూలు కనిపించాయి. స్థానికుల ప్రకారం కొంతమంది వినియోగదారులు ఉదయం 4 గంటల నుంచే క్యూలో నిలబడ్డారు. ఉదయం 7 గంటలకు ఏజెన్సీ గేట్లు తెరుచుకున్న వెంటనే ప్రజలు సిలిండర్లు తీసుకునేందుకు ఒక్కసారిగా లోపలికి దూసుకెళ్లడంతో దాదాపు తొక్కిసలాట పరిస్థితులు ఏర్పడ్డాయి. కొంతమంది సిలిండర్లను తలపై, భుజాలపై మోస్తూ వెళ్లినట్లు అధికారులు తెలిపారు.
అయితే జిల్లాలో ఎల్పీజీ కొరత లేదని జిల్లా సరఫరా అధికారి విమల్ కుమార్ శుక్లా స్పష్టం చేశారు. ఇటీవల ఆయిల్ కంపెనీలు ఓటీపీ ఆధారిత ఎల్పీజీ బుకింగ్ వాటాను 30 శాతం నుంచి 80 శాతానికి పెంచినట్లు చెప్పారు. దీంతో కొంతమంది వినియోగదారుల కనెక్షన్లు తాత్కాలికంగా సాధారణ కేటగిరీ నుంచి బయటకు వెళ్లాయని వివరించారు. బస్తీ జిల్లాలో సుమారు 2.07 లక్షల ప్రధానమంత్రి ఉజ్వల యోజన లబ్ధిదారులు, దాదాపు మూడు లక్షల సాధారణ ఎల్పీజీ వినియోగదారులు ఉన్నారని ఆయన తెలిపారు. ప్రస్తుతం కేవైసీ ధృవీకరణ ద్వారా కనెక్షన్లను మళ్లీ సక్రమంగా చేస్తున్నామని చెప్పారు.
బెంగాల్‌లో భారీగా బుకింగ్‌లు
ఇక కోల్‌కత్తాతో పాటు పశ్చిమ బెంగాల్‌లోని పలు జిల్లాల్లో కూడా గ్యాస్ కోసం పెద్ద క్యూలు కనిపించాయి. ఎల్పీజీ సరఫరా అంతరాయం ఏర్పడవచ్చన్న భయంతో ప్రజలు భారీగా బుకింగ్‌లు చేస్తున్నారు. ఆటో డ్రైవర్లు ఎల్పీజీ కోసం గంటల తరబడి వేచి ఉండాల్సి వస్తోందని చెప్పారు. కొందరు రాత్రి నుంచే క్యూలో నిలబడినట్లు తెలిపారు. నగరంలో ఆటో ఎల్పీజీ ధర కిలోకు సుమారు రూ.5 వరకు పెరిగిందని డ్రైవర్లు పేర్కొన్నారు. బెంగాల్‌లో ఇండియన్ ఆయిల్ కార్పోరేషన్‌కు చెందిన ఇండేన్ గ్యాస్ సిలిండర్ల రోజువారీ బుకింగులు సుమారు ఒక లక్ష నుంచి రెండు లక్షలకు పెరిగినట్లు పంపిణీదారులు తెలిపారు. భారీగా బుకింగ్‌లు రావడంతో ఆన్‌లైన్ సర్వర్లు తరచూ పనిచేయకుండా పోతున్నాయని వారు చెప్పారు. ఈ పరిస్థితిని ‘పానిక్ బాయింగ్’గా బిజన్ బిశ్వాస్ పేర్కొన్నారు. త్వరలో గ్యాస్ అందకపోవచ్చన్న భయంతో ప్రజలు ముందుగానే సిలిండర్లు బుక్ చేస్తున్నారని అన్నారు. ఈ సంక్షోభం రెస్టారెంట్లు, చిన్న హోటళ్లపై కూడా ప్రభావం చూపుతోంది. వాణిజ్య ఎల్పీజీ సరఫరా తగ్గడంతో కొన్ని హోటళ్లు వంట సమయాలను తగ్గించుకోవాల్సి వస్తోందని పరిశ్రమ ప్రతినిధులు తెలిపారు.
ఈ నేపథ్యంలో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలను బుకింగ్ సర్వర్లను వెంటనే పునరుద్ధరించాలని ఆదేశించారు. ఆసుపత్రులు, మధ్యాహ్న భోజన పథకం వంటగదులు, హాస్టళ్లకు ప్రాధాన్యతగా గ్యాస్ సరఫరా చేయాలని సూచించారు. గ్యాస్ నిల్వలు దాచిపెట్టడం, బ్లాక్ మార్కెటింగ్ జరిగితే సిలిండర్లను స్వాధీనం చేసుకుని ప్రజలకు పంపిణీ చేస్తామని కూడా ఆమె హెచ్చరించారు. రోజువారీ గ్యాస్ నిల్వలు, సరఫరాను పర్యవేక్షించేందుకు ప్రత్యేక డ్యాష్‌బోర్డ్ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.
ఉత్తరాఖండ్‌లో ఆసుపత్రులకు ప్రాధాన్యత
ఇక ఉత్తరాఖండ్‌లో ఎల్పీజీ సరఫరా అంతరాయం ఏర్పడవచ్చన్న భయంతో ప్రభుత్వం ముందస్తు చర్యలు ప్రారంభించింది. ఆసుపత్రులు, విద్యాసంస్థలకు వాణిజ్య గ్యాస్ సిలిండర్లను ప్రాధాన్యతగా అందించాలని నిర్ణయించింది. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆనంద్ బర్దన్ అధ్యక్షతన జరిగిన సమీక్ష సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతానికి హోటళ్లు, ధాబాలు వంటి వాణిజ్య సంస్థలకు సిలిండర్ల సరఫరాను పరిమితం చేయాలని నిర్ణయించారు. అయితే రాష్ట్రంలో గృహ వినియోగ ఎల్పీజీకి ఎలాంటి కొరత లేదని అధికారులు స్పష్టం చేశారు. బ్లాక్ మార్కెటింగ్, అక్రమ నిల్వలను అరికట్టేందుకు జిల్లాల్లో ప్రత్యేక దళాలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. అంతేకాకుండా అవసరమైతే వాణిజ్య వినియోగానికి ప్రత్యామ్నాయంగా కట్టెలను అందుబాటులో ఉంచేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు అటవీ మంత్రి సుబోధ్ ఉనియల్ తెలిపారు. ప్రస్తుత అంతర్జాతీయ పరిస్థితుల నేపథ్యంలో ఎల్పీజీ సరఫరా అంతరాయం పూర్తిగా కొట్టిపారేయలేమని ఆయన పేర్కొన్నారు.
పుణేలోనూ
పుణేలో ఎల్పీజీ కొరత వార్తల నేపథ్యంలో గ్యాస్ ఏజెన్సీల వద్ద ప్రజలు భారీగా చేరుకున్నారు.ఉదయం నుంచే గ్యాస్ సిలిండర్ కోసం స్థానికులు పెద్ద ఎత్తున క్యూలో నిలబడ్డారు. దూర ప్రాంతాల నుంచి కూడా ప్రజలు వచ్చి సిలిండర్ కోసం వేచి చూస్తున్నారు.సరఫరా తగ్గిపోతుందన్న భయంతో ముందుగానే గ్యాస్ తీసుకోవడానికి ప్రజలు పరుగులు పెడుతున్నారు. ఏజెన్సీ వద్ద గంటల తరబడి నిలబడి సిలిండర్ కోసం ఎదురు చూస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఎల్పీజీ సరఫరాపై స్పష్టత ఇవ్వాలని ప్రజలు అధికారులను కోరుతున్నారు.
ఎలక్ట్రిక్ స్టవ్‌లు.. కట్టెల పొయ్యిలు
భోపాల్‌లోని రెస్టారెంట్లు వంట కోసం గ్యాస్‌కు బదులుగా ఇండక్షన్ స్టవ్‌లను ఉపయోగించడం ప్రారంభించాయి. అక్కడి సాగర్ గైరే ఫాస్ట్‌ఫుడ్ అనే ఫుడ్ అవుట్‌లెట్ యజమాని దోల్రాజ్ గైర్ మాట్లాడుతూ, ప్రస్తుతం తమ వంటల్లో సుమారు 60 శాతం ఇండక్షన్‌పై పూర్తి చేశామని, మిగిలిన పనిని కూడా త్వరలో పూర్తి చేస్తామని తెలిపారు. మరోవైపు హైదరాబాద్‌లో గ్యాస్ కొరత రెస్టారెంట్లపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ఎంఎస్‌మండి రెస్టారెంట్ యజమాని నదీమ్ ఖాద్రీ మాట్లాడుతూ, గ్యాస్ లేకపోవడంతో కట్టెలతో వంట చేయాల్సి వస్తోందని చెప్పారు. తెలంగాణలో ఇప్పటికే అనేక హోటళ్లు గ్యాస్ కొరత కారణంగా మూతపడినట్లు తెలిపారు. గ్యాస్ కొరతతో పాటు కట్టెల ధరలు కూడా పెరిగిపోయాయని, దీంతో వ్యాపారంపై తీవ్ర ప్రభావం పడుతోందని ఆయన పేర్కొన్నారు. గ్యాస్‌తో వంట చేయడం సులభమై త్వరగా పూర్తవుతుందని, కానీ కట్టెలతో వంట చేయాలంటే అదనంగా కార్మికులు అవసరం అవుతారని చెప్పారు. అంతేకాకుండా రెస్టారెంట్లలో కాలుష్యం కూడా పెరుగుతోందని తెలిపారు.
ప్రజలు ఆందోళన పడొద్దు
ఇదిలా ఉండగా కేంద్ర ప్రభుత్వం మాత్రం ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. దేశీయ ఎల్పీజీ ఉత్పత్తి సుమారు 25 శాతం పెరిగిందని తెలిపింది. ప్రస్తుతం దేశీయ వినియోగదారులకు సరఫరా చేయడానికే మొత్తం గ్యాస్ ఉత్పత్తిని మళ్లిస్తున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. వాణిజ్య ఎల్పీజీ విషయంలో ఆసుపత్రులు, విద్యాసంస్థలు వంటి అత్యవసర రంగాలకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు కేంద్రం పేర్కొంది. ఎల్పీజీ సరఫరా కొనసాగుతుందని ఆయిల్ కంపెనీలు కూడా హామీ ఇచ్చాయి.
దేశవ్యాప్తంగా ఎల్పీజీ గ్యాస్ కొరత ఏర్పడిందని ఆరోపిస్తూ ప్రతిపక్షాలు పార్లమెంట్ ప్రాంగణంలో గురువారం కూడా నిరసనలు కొనసాగించాయి. లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీ నాయకత్వంలో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్‌తోసహా ఇండియా కూటమికి చెందిన నేతలు ఈ అంశంపై పార్లమెంటులో చర్చ జరపాలని డిమాండ్ చేశారు. పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్తతల ప్రభావంతో ఎల్పీజీ సరఫరాపై ప్రభావం పడుతున్నట్టు వార్తలు వెలువడుతున్న నేపథ్యంలో ఈ నిరసనలు చేపట్టారు.
