
ప్రజల దృష్టిని మళ్లించడానికే.. లోక్‌సభ సీట్లు పెంపు ప్రతిపాదన: కాంగ్రెస్
లోక్‌సభ, రాష్ట్ర అసెంబ్లీల సీట్ల సంఖ్యను పెంచాలన్న కేంద్ర ప్రభుత్వ ప్రతిపాదనపై కాంగ్రెస్ పార్టీ తీవ్ర విమర్శలు గుప్పించింది. ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఈ ప్రతిపాదనను ‘బుల్‌డోజ్’ చేస్తున్నారని, ఇది పెద్ద జనాభా గల రాష్ట్రాలకు ఎక్కువ ప్రయోజనం చేకూర్చే చర్యగా మారుతుందని కాంగ్రెస్ ఆరోపించింది. ఈ చర్యను ‘ప్రజల దృష్టిని మళ్లించే రాజకీయ ఆయుధం’గా అభివర్ణించింది. కాంగ్రెస్ కమ్యూనికేషన్స్ ఇన్‌చార్జ్ జనరల్ సెక్రటరీ జైరాం రమేశ్ సోషల్ మీడియా వేదిక ఎక్స్‌లో చేసిన పోస్టులో ప్రధాని ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని విమర్శించారు. దక్షిణ భారత రాష్ట్రాలకు ఎలాంటి నష్టం జరగదని ప్రధాని చెబుతున్నది ప్రజలను మోసం చేయడమేనని అన్నారు.
ప్రస్తుతం లోక్‌సభలో ఉత్తరప్రదేశ్‌కు 80 సీట్లు ఉండగా కేరళంకు 20 సీట్లు మాత్రమే ఉన్నాయని, ఈ తేడా 60గా ఉందని ఆయన పేర్కొన్నారు. సీట్లను 50 శాతం పెంచితే ఈ తేడా 90కి పెరిగే అవకాశముందని చెప్పారు. అలాగే ఉత్తరప్రదేశ్, తమిళనాడు మధ్య ఉన్న సీట్ల తేడా కూడా మరింత పెరుగుతుందని తెలిపారు. ఈ విధంగా పెద్ద జనాభా గల రాష్ట్రాల సంఖ్య మరింత పెరిగి, చిన్న రాష్ట్రాల ప్రభావం తగ్గే ప్రమాదం ఉందని రమేశ్ అన్నారు. దక్షిణ భారత రాష్ట్రాలకే కాకుండా పంజాబ్, హార్యానా అలాగే ఈశాన్య రాష్ట్రాల ప్రభావం కూడా తగ్గుతుందని ఆయన వ్యాఖ్యానించారు. దేశం ప్రస్తుతం తీవ్రమైన ఆర్థిక, విదేశాంగ సవాళ్లను ఎదుర్కొంటున్న సమయంలో ప్రధాని మాత్రం లోక్‌సభ, అసెంబ్లీ సీట్ల పెంపుపై దృష్టి పెట్టారని కాంగ్రెస్ విమర్శించింది. ప్రజా చర్చలు, రాజకీయ పార్టీలతో సంప్రదింపులు లేకుండా ఈ నిర్ణయాన్ని తీసుకురావడం సరైంది కాదని పార్టీ అభిప్రాయపడింది.
దక్షిణాది రాష్ట్రాలు రాజకీయ ప్రాభావాన్ని కోల్పోతాయి
కాంగ్రెస్ ఎంపీ మనీశ్‌తివారీ కూడా ఈ విషయంపై స్పందిస్తూ, హిందీ బెల్ట్ రాష్ట్రాలకంటే దక్షిణ, పశ్చిమ, ఈశాన్య రాష్ట్రాలు రాజకీయ ప్రభావాన్ని కోల్పోయే ప్రమాదం ఉందని అన్నారు. ప్రస్తుతం పంజాబ్, హర్యానా, హిమాచల్ ప్రదేశ్, జమ్మూ-కశ్మీర్, ఢిల్లీ కలిసి కేవలం 40 లోక్‌సభ సీట్లు మాత్రమే కలిగి ఉన్నాయని, అయితే ఉత్తరప్రదేశ్‌కు 80 సీట్లు ఉన్నాయని గుర్తుచేశారు.
ఎన్నికల్లో లబ్ది పొందడానికే
ఇదిలా ఉండగా, పార్లమెంట్ బడ్జెట్ సమావేశాన్ని ఏప్రిల్ 16–18 వరకు పొడిగించినట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఈ సమావేశాల్లో మహిళలకు లోక్‌సభ, అసెంబ్లీలలో 33 శాతం రిజర్వేషన్ అమలు చేయడానికి అవసరమైన చట్టపరమైన మార్పులను తీసుకురావాలని కేంద్రం భావిస్తోంది. 2023లో పార్లమెంట్ ఆమోదించిన నారీశక్తి వందన్ అధినియమ్ ద్వారా మహిళలకు 33 శాతం రిజర్వేషన్ కల్పించేలా రాజ్యాంగ సవరణ జరిగింది. అయితే ఈ చట్టం అమలుకు ముందు నియోజకవర్గాల పునర్విభజన (డిలిమిటేషన్) అవసరం. ప్రస్తుతం ప్రభుత్వం లోక్‌సభ సీట్లను 543 నుంచి 816కు పెంచే ప్రతిపాదనను పరిశీలిస్తోంది. ఈ చర్య ద్వారా మహిళా రిజర్వేషన్ అమలుకు మార్గం సుగమం అవుతుందని కేంద్రం చెబుతోంది.
అయితే ఎన్నికల సమయంలో ఈ చట్ట సవరణలను త్వరితగతిన తీసుకురావడం ద్వారా రాజకీయ లాభం పొందాలని కేంద్రం ప్రయత్నిస్తున్నదని కాంగ్రెస్ ఆరోపించింది. ముఖ్యంగా పశ్చిమబెంగాల్, తమిళనాడు ఎన్నికల నేపథ్యంలో ఇది మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్‌కు విరుద్ధమని కూడా పార్టీ అభిప్రాయపడింది. డిలిమిటేషన్ వంటి సున్నితమైన అంశంపై తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం ప్రమాదకరమని కాంగ్రెస్ హెచ్చరించింది. తమిళనాడు, కేరళ వంటి రాష్ట్రాలు రాజకీయంగా నష్టపోయే పరిస్థితి ఏర్పడవచ్చని పార్టీ నాయకులు పేర్కొన్నారు.
