Let's talk: editor@tmv.in
ప్రజల తరపున పోరాటానికి సిద్ధంగా ఉండాలి: జగన్

ప్రజల తరపున పోరాటానికి సిద్ధంగా ఉండాలి: జగన్

Panthagani Anusha
2 డిసెంబర్, 2025

పార్లమెంట్‌ శీతాకాల సమావేశాలు సోమవారం (డిసెంబర్ 1) ఉదయం 11 గంటలకు ప్రారంభం కాగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ( వైఎస్సార్‌సీపీ ) అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పార్టీ ఎంపీలకు కీలక దిశానిర్దేశం చేశారు. 18వ లోక్‌సభ 6వ సమావేశం,269వ రాజ్యసభ సమావేశాల సందర్భంగా, రాష్ట్ర హక్కులను కాపాడడంపై దృష్టి సారించాలని, ప్రజల తరపున పోరాటానికి సిద్ధంగా ఉండాలని ఆయన సూచించారు. ముఖ్యంగా, రైతులు, కార్మికులు, బలహీన వర్గాలు ఎదుర్కొంటున్న ప్రధాన ప్రజా సమస్యలను పార్లమెంట్‌లో స్పష్టంగా, బలంగా లేవనెత్తాలని ఆయన ఎంపీలను ఆదేశించారు.

ముఖ్యంగా అక్టోబర్‌–నవంబర్‌ నెలల్లో వచ్చిన ‘ మొంథా ’ తుఫాను కారణంగా రాష్ట్ర తీర ప్రాంతాల్లో లక్షల ఎకరాల పంటలు నాశనమైనా కేంద్రం, రాష్ట్రం ఇప్పటి వరకు సరైన పరిహారం ఇవ్వలేదని జగన్ విమర్శించారు. వరి పొలం నుంచి మిర్చి, మామిడి వరకు ప్రధాన పంటలకు కనీస మద్దతు ధరలు ఇవ్వకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, వ్యాపారుల దయాదాక్షిణ్యానికి వదిలేశారని జగన్ ఆవేదన వ్యక్తం చేశారు. కనీస మద్దతు ధర కొనుగోళ్లను వెంటనే పునరుద్ధరించాలని, అత్యవసర సహాయక నిధులు విడుదల చేయాలని ప్రభుత్వం, కేంద్రాన్ని ఎంపీలు డిమాండ్‌ చేయాలని సూచించారు. తమ ప్రభుత్వ హయాంలో రైతులకు ప్రీమియం లేకుండా ఇచ్చిన ఉచిత పంట బీమాను, ఇన్‌పుట్‌ సబ్సిడీలను ప్రస్తుత ప్రభుత్వం నిలిపివేయడం వలన రైతుల భారం పెరిగిందని ఆయన ఆరోపించారు. ఈ-క్రాప్ నమోదు నిలిపివేయడం వలన పంట వివరాలు గందరగోళానికి గురై, అర్హులైన రైతులు పరిహారాలకు నోచుకోలేకపోతున్నారని తెలిపారు.

మరో ముఖ్యమైన అంశంగా లక్షలాది గ్రామీణ కార్మికులు ఆధారపడిన ఎంఎన్‌ఆరేగా పథకంలో 18.63 లక్షల జాబ్ కార్డులను తొలగించడంపై జగన్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. నిజమైన కార్డులను తప్పనిసరిగా పునరుద్ధరించి, పెండింగ్ వేతనాలను చెల్లించాలని ఎంపీలకు సూచించారు. అదేవిధంగా విశాఖ స్టీల్ ప్లాంట్‌లో యూనిట్లను ప్రైవేట్ సంస్థలకు అప్పగించే ప్రయత్నాలను పూర్తిస్థాయి ప్రైవేటీకరణగా భావించి, దీనిని పార్లమెంట్‌లో కఠినంగా వ్యతిరేకించాలని కోరారు. ప్లాంట్‌కు ఇనుప ఖనిజ గనులు కేటాయించి యూనిట్‌ను పునరుద్ధరించాలని కేంద్రాన్ని డిమాండ్ చేయాలని తెలిపారు.

రాష్ట్రంలో చట్టవ్యవస్థ శిథిలమైందని రాజకీయ లక్ష్యాలతో అక్రమ అరెస్టులు, కేసులు పెరుగుతున్నాయని జగన్ ఆరోపించారు. పలువురు ప్రజాప్రతినిధుల భద్రతను ప్రభుత్వం వెనక్కి తీసుకోవడం వారి ప్రాణాలను ప్రమాదంలోకి నెట్టిందని పేర్కొన్నారు. ప్రభుత్వ హాస్టళ్లలో ఆహారం, తాగునీరు, పరిశుభ్రత వంటి మౌలిక సదుపాయాలు లేక విద్యార్థులు పడుతున్న ఇబ్బందులను పార్లమెంట్‌లో ప్రస్తావించాలని ఆయన ఆదేశించారు. ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించిన పెండింగ్ నిధులు, ఉపాధి అవకాశాలు, రైతాంగ సంక్షేమం, బలహీన వర్గాల రక్షణ వంటి కీలక అంశాలను శీతాకాల సమావేశాల్లో బలంగా లేవనెత్తి, రాష్ట్ర ప్రజల గళం పార్లమెంట్‌లో ఘాటుగా వినిపించాలి” అని జగన్ ఎంపీలకు స్పష్టం చేశారు.