Let's talk: editor@tmv.in
ప్రజల చెంతకు పల్లె రహదారి సమాచారం : డిప్యూటీ సీఎం పవన్‌ కళ్యాణ్

ప్రజల చెంతకు పల్లె రహదారి సమాచారం : డిప్యూటీ సీఎం పవన్‌ కళ్యాణ్

Panthagani Anusha
8 నవంబర్, 2025

పల్లె ప్రజలకు నాణ్యతతో కూడిన స్వచ్ఛమైన తాగునీటి సరఫరా, గుంతలు లేని రహదారులు అందుబాటులో ఉంచాలన్నదే తన ముందున్న ప్రధాన లక్ష్యమని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా శాఖల మంత్రి పవన్ కళ్యాణ్ వెల్లడించారు. ఈ లక్ష్య సాధనలో ఆధునిక సాంకేతికతను వినియోగించడం ద్వారా ప్రతి పల్లె రహదారి సమాచారం ప్రజల చేతుల్లోకి చేరేలా చర్యలు చేపడుతున్నట్లు పేర్కొన్నారు. ‘జియో రూరల్ రోడ్ మేనేజ్మెంట్ సిస్టమ్’ పేరుతో ఒక కొత్త వ్యవస్థను త్వరలో ప్రవేశ పెడుతున్నామని ఈ సిస్టమ్‌ ద్వారా గ్రామీణ రహదారుల వివరాలు అందరికీ అందుబాటులో ఉంటాయి. ఎక్కడ రోడ్డు నిర్మాణం జరుగుతోంది, వాటి పరిస్థితి ఎలా ఉందనే సమాచారాన్ని ప్రజలు తెలుసుకునే వీలు ఉంటుంది. అదేవిదంగా పైలట్ ప్రాజెక్టు అడవి తల్లి బాటను ఈ సిస్టమ్‌కు అనుసంధానినిస్తామని తెలిపారు.

మంగళగిరిలో జరిగిన సమీక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పల్లె పండుగ 2.0, అడవి తల్లి బాట, జల్ జీవన్ మిషన్, స్వమిత్వ పథకాల పురోగతి గురించి అధికారులతో చర్చించారు. నిధులు అందుబాటులో ఉన్నప్పటికీ పనుల్లో ఆశించిన పురోగతి లేకపోవడం పట్ల అసంతృప్తి వ్యక్తం చేశారు. పనులు వేగవంతం చేయాలని ఆదేశించారు. గిరిజన ప్రాంతాల్లో రోడ్ల నిర్మాణంలో సవాళ్లు ఉన్నప్పటికీ వాటిని అధిగమించేందుకు పటిష్ట ప్రణాళిక అవసరమని సూచించారు. అడవి తల్లిబాట ప్రాజెక్ట్‌పై అధిక దృష్టి సారించాలని, క్షేత్ర స్థాయిలో పర్యటనలు నిర్వహించి పనుల పురోగతిని పరిశీలించాలని ఆదేశించారు.

గ్రామీణ ప్రాంతాల్లో తాగునీటి సరఫరా మెరుగుపర్చేందుకు జల్ జీవన్ మిషన్ పనులు వేగంగా సాగుతున్నాయని తెలిపారు. చిత్తూరు, ప్రకాశం, పల్నాడు, గోదావరి జిల్లాల్లో నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టుల్లో నాణ్యతా ప్రమాణాలు పాటించాలన్నారు. నవంబర్ మూడో వారం నుంచి ఆయనే స్వయంగా ప్రాజెక్టుల పురోగతిని సమీక్షించనున్నట్టు వెల్లడించారు.

స్వమిత్వ పథకం ద్వారా వచ్చే మార్చి నాటికి రాష్ట్రవ్యాప్తంగా కోటి మందికి ప్రాపర్టీ కార్డులు అందజేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. మొదటి విడతలో 613 గ్రామాల్లో సర్వే పూర్తి కాగా, రెండో విడతలో మరో 45.66 లక్షల మంది హక్కు పత్రాలు పొందేలా చర్యలు చేపడుతున్నారు. డిసెంబర్ నుంచి మూడో విడత సర్వేలు ప్రారంభించనున్నట్టు తెలిపారు. గ్రామ సర్వేయర్ల సేవలను పంచాయతీరాజ్ శాఖకు కేటాయించి సర్వే ప్రక్రియను వేగవంతం చేయనున్నట్లు చెప్పారు. రీ సర్వే తర్వాత భూములను యథావిధిగా యజమానులకు అప్పగించి ప్రాపర్టీ కార్డులు అందిస్తామని స్పష్టం చేశారు.

సమీక్షా సమావేశంలో పంచాయతీరాజ్ ప్రధాన కార్యదర్శి శశిభూషణ్ కుమార్, కమిషనర్ కృష్ణతేజ, సర్వే శాఖ కార్యదర్శి కూర్మనాథ్ తదితర అధికారులు పాల్గొన్నారు.

ప్రజల చెంతకు పల్లె రహదారి సమాచారం : డిప్యూటీ సీఎం పవన్‌ కళ్యాణ్ - Tholi Paluku