Let's talk: editor@tmv.in
ప్రజల కోసం ఒంటరిగా పోరాడుతున్నా: మమత

ప్రజల కోసం ఒంటరిగా పోరాడుతున్నా: మమత

Pinjari Chand
14 ఏప్రిల్, 2026

పశ్చిమ బెంగాల్‌లో జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం సహా దేశంలోని 19 రాష్ట్రాలు తనను ఎదుర్కొనేందుకు కలిసి వచ్చాయని తృణమూల్‌ కాంగ్రెస్ అధినేత్రి, ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆరోపించారు. అయినప్పటికీ సాధారణ ప్రజల కోసం తాను ఒంటరిగా పోరాటం కొనసాగిస్తున్నానని ఆమె అన్నారు. బీర్బూమ్‌ జిల్లా సూరిలో సోమవారం నిర్వహించిన ఎన్నికల సభలో మాట్లాడిన ఆమె, ఢిల్లీ నుంచి బలగాలు పంపించి కూడా బీజేపీ పశ్చిమ బెంగాల్‌లో విజయం సాధించలేదని వ్యాఖ్యానించారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో టీఎంసీ 226కి పైగా స్థానాలు గెలుచుకుంటుందని ఆమె విశ్వాసం వ్యక్తం చేశారు.

ప్రధానమంత్రి నరేంద్రమోడీపై మమత తీవ్ర విమర్శలు చేశారు. ఆయన నిర్వహించే మాన్‌కీ బాత్‌ కార్యక్రమాన్ని యువతను ప్రభావితం చేయడానికి ఉపయోగిస్తున్నారని ఆరోపించారు. బీజేపీ డబ్బు పంచుతూ ఎన్నికలను ప్రభావితం చేయడానికి ప్రయత్నిస్తోందని కూడా ఆమె అన్నారు. బీహార్‌ నుంచి రైళ్లు, బస్సుల ద్వారా ఓటర్లను తీసుకొస్తున్నారని, డబ్బు, మాదక ద్రవ్యాలు, ఆయుధాలను రాష్ట్రంలోకి అక్రమంగా తరలిస్తున్నారని మమత ఆరోపించారు. అధికారులు, పోలీసులను ఇతర రాష్ట్రాలకు బదిలీ చేసి ఈ కార్యకలాపాలను ఆపే పరిస్థితి లేకుండా చేశారని కూడా విమర్శించారు.

ప్రధాని మోడీ ఇటీవల అన్ని 294 అసెంబ్లీ నియోజకవర్గాల్లో తానే బీజేపీ అభ్యర్థినని చేసిన వ్యాఖ్యలపై మమత స్పందిస్తూ, ఆయన నిజంగా అలా అనుకుంటే ప్రధాని పదవికి రాజీనామా చేసి బెంగాల్ ముఖ్యమంత్రి పదవికి పోటీ చేయాలని సవాల్ విసిరారు. ముందుగా దేశ ప్రధాని కావాలా, లేక బెంగాల్ ముఖ్యమంత్రి కావాలా నిర్ణయించుకోవాలని అన్నారు. ఉద్యోగాల అంశంపైనా ఆమె మోడీపై ప్రశ్నలు లేవనెత్తారు. ప్రతి ఏడాది రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని ఇచ్చిన హామీ ఏమైందని ప్రశ్నించారు. రాష్ట్రంలో ఖాళీలను భర్తీ చేయాలని ప్రయత్నిస్తే కోర్టు కేసులు పెట్టి నియామకాలను అడ్డుకుంటున్నారని ఆరోపించారు.

మేం ప్రజలతో ప్రేమతో వ్యవహరిస్తాం

ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ చేసిన ‘బుల్డోజర్’ వ్యాఖ్యలపై కూడా మమత స్పందించారు. తమ ప్రభుత్వం బుల్డోజర్ విధానాన్ని నమ్మదని, ప్రేమతో ప్రజలతో పనిచేసే విధానాన్ని అనుసరిస్తుందని అన్నారు. బీజేపీ నుంచి డబ్బు తీసుకోవద్దని ప్రజలకు ఆమె హెచ్చరించారు. అలా తీసుకుంటే తరువాత ఈడీ, సీబీఐ వంటి సంస్థల ద్వారా కేసులు పెట్టే ప్రమాదం ఉందని అన్నారు.

సూరి నియోజకవర్గంలో తృణమూల్ అభ్యర్థిగా ఉన్న ఉజ్జల్‌ చటర్జీ కోసం ప్రచారం చేస్తూ, 294 స్థానాల్లోనూ తననే అభ్యర్థిగా భావించి ఓటు వేయాలని మమత ప్రజలను కోరారు. అదే సమయంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణలో మిషనరీస్ ఆఫ్ చారిటీకి చెందిన 300 మంది సన్యాసినుల పేర్లు, అలాగే భారత్ సేవాశ్రమ సమితి, రామకృష్ణ మిషన్‌, బెలూరు మఠానికి చెందిన పలువురు సన్యాసుల పేర్లు తొలగించారని కూడా ఆమె ఆరోపించారు.